Saudi Cultural Event: సౌదీలో ఎన్నారైలను అలరించిన ప్రవాసీ పరిచయ వేడుకలు
ABN, Publish Date - Nov 05 , 2025 | 09:50 PM
భారత దేశ సంస్కృతి వైవిధ్యం, ప్రాచీన కళలు, సంపదను విదేశాలలో నివసిస్తున్న భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో భారతీయ ఎంబసీ నిర్వహించిన ప్రవాసీ పరిచయ కార్యక్రమంలో గంగమ్మ జాతర ప్రదర్శన ఒక్క తెలుగువారినే కాదు ఇతర రాష్ట్రాల వారిని కూడా అశేషంగా ఆకట్టుకొంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గంగమ్మ జాతరలో భక్తుల విశ్వాసం అనేది ప్రధానం. భక్తులు స్వదేశంలో ఉన్నా విదేశాలలో ఉన్నా నిష్ట మాత్రం తప్పని కర్తవ్యం. అచ్చం తిరుపతిలోని తాటియాగుంటను మరిపించే విధంగా గంగమ్మ జాతరను ఇటీవల ఎడారి దేశమైన సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో భారతీయ ఎంబసీ నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శించారు.
భారత దేశ సంస్కృతి వైవిధ్యం, ప్రాచీన కళలు, సంపదను విదేశాలలో నివసిస్తున్న భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో భారతీయ ఎంబసీ నిర్వహించిన ప్రవాసీ పరిచయ కార్యక్రమంలో గంగమ్మ జాతర ప్రదర్శన ఒక్క తెలుగువారినే కాదు ఇతర రాష్ట్రాల వారిని కూడా అశేషంగా ఆకట్టుకొంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇంజినీర్ నాగార్జున.. మాతంగి పాత్రలో ప్రదర్శించిన ప్రతిభకు సభికులు మంత్రముగ్ధులయ్యారు.
తమిళనాడు సరిహద్దులోని గంగమ్మ జాతర ఏమిటి.. ఆ వైపు మహారాష్ట్ర పొరుగున ఉన్న అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో లంబాడీ గిరిజనుల సంప్రదాయక నృత్యం మాథురను కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలికల నటనకు జనాలు జోహార్లు పలికారు. చిన్నారులు మౌర్య దుగ్గపు, సమీక్ష మెరగ, రష్మీత కంచపు, రితిక గుండుబోగుల ఈ గిరిజనుల కళను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.
తిరుపతి నుండి ఆదిలాబాద్ అడవులకు మధ్యలో ఉన్న తెలంగాణ సంస్కృతి వైభవాన్ని కూడా చాటిచెప్పారు. తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మలు,బోనాలను కూడా అచ్చం హైదరాబాద్‌లోని లాల్ దర్వాజ అమ్మవార్ల సన్నిధిలో ఉన్నట్లుగా ప్రదర్శించారు. నిహారిక చెంగూరి, లావణ్యలు పూర్తిగా సహజసిద్ధంగా ఏ రకమైన కర్తృత్వం లేకుండా బతుకమ్మల పాటను పాడడం ద్వారా తరాల సాంస్కృతిక సంపదను భారత్‌లోని ఇతర రాష్ట్రీయులకు వివరించారు. బతుకమ్మ ఆటల్లో డీజేలు, దాండియా వచ్చి చేరి అసలయిన విలువలు కోల్పోతున్న ప్రస్తుత కాలంలో విదేశంలో అచ్చమైన బతుకమ్మను ఈ ఇద్దరు యువతుల నేతృత్వంలో మహిళలు పాడిన తీరు అందరికీ నచ్చింది.
పోతరాజు వేషధారణలో శరీరమంతా పసుపు పూసుకొని నిమ్మకాయలతో శివారెడ్డి అమ్మవార్లకు రక్షణగా చేసిన నృత్యం, అతనికి ఇరువైపులా ఏడుగురు అమ్మవార్లుగా శ్వేత, సునిత అషాడపు, నిహారిక, భారతి దాసరి, సంధ్య, సుచరిత, ప్రియాంకలు బొనమెత్తిన దృశ్యం సభికులను పాతబస్తీలోని లాల్ దర్వాజాకు తీసుకెళ్ళింది.
చేతి వృత్తుల నైపుణ్యం, హస్త కళాఖండాలుగా పేరొందిన నాణ్యమైన చేనేత వస్త్రాలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. గద్వాల్, పోచంపల్లి, నారాయణపేటలో చేనేత కార్మికులు సృష్టించిన సంక్లిష్ట, ఆకర్షణీయ నమూనాలను రమ్య గుండుబోగుల మార్గదర్శకత్వంలో చందన, లక్ష్మి కాకుమని, విజయలక్ష్మి, దీప్తి జంగా, మాధవి బాలు రాంప్ వాక్ విధానం ద్వారా సభికులకు నవీన చేనేత నమూనాలను పరిచయం చేసారు.
తెలంగాణ వారసత్వానికి ప్రతీకలయిన కాకతీయ రుద్రమదేవి, ప్రతాప రుద్రుడు, కులీఖుతూబ్ షాల వేషధారణలో ధ్వానీ బోగినేని, కౌస్తుబ్ చివుకుల, హేమ్ నిఖిల్ దర్శనమిచ్చారు.
అధునిక అపారచాణక్యుడు, దేశాన్ని ఆర్థిక గండం నుండి గటెక్కించిన మేధావి, తొలి తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు పాత్రలో ఆనంద్ పోకూరి వ్యక్తీకరించిన ముఖభావాలు, ప్రదర్శించిన తీరు అందర్నీ అశ్చర్యపరిచింది. తెలంగాణ కార్యక్రమాలను మోబీన్, సుచరితలు సమన్వయం చేసారు.
తెలుగు నేలమీద అనాదిగా అపూర్వమైన జానపద కళావారసత్వం విరాజిల్లుతున్న విషయాన్ని చైత్ర, కేత్వి, పూర్వీ, ఆన్య, మనుశ్రీ, హిందూ ప్రియాంక, ఐశ్వర్య, వినయ్, డాక్టర్ శ్రీకర్ బిల్లా, గుడేపు కార్తీక్, సురేశ్ నాయుడు చింతా, వేణుగోపాల్‌లు తమ జానపద కళా ప్రదర్శనల ద్వారా మరోసారి చాటారు.
పిండి వంటల రుచికి తెలుగునేల పెట్టింది పేరు. పావని శర్మ, భావన వన్నంద, సుచరిత, ప్రియాంక, సునీత, ఐశ్వర్య, లావణ్యలు తమ పాక శాస్త్ర కళను దేశంలోని విభిన్న ప్రాంతాల వారికి చూపించారు.
నవాబుల నగరమైన హైదరాబాద్ ఘనకీర్తిని ఖవ్వాలీ, సంప్రదాయక వివాహం రూపాలలో ప్రదర్శించారు. తెలంగాణ ప్రవాసీ ప్రముఖుడు మోబీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో యారా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు హైదరాబాద్ గత వైభవాన్ని సగర్వంగా చాటారు. ఇదే పాఠశాలకు చెందిన మొహమ్మద్ స్వాలే, షాహాబ్ పర్వాజ్‌లు ఖవ్వాలీ బృందానికి నాయకత్వం వహించగా నిసార్ అహ్మద్, నసీర్ సిద్దిఖీ, మొహమ్మద్ ఫారుఖ్, షోయెబ్ మోహీయెద్దీన్‌లు గాయక బృందంలో ఉన్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే, ఖవ్వాలీ సంస్కృతితో పరిచయం లేకున్నా గొల్లపల్లి డానియల్ అనే ఉపాధ్యాయుడు ఖవ్వాలీ స్వరానికి అనుగూణంగా తబలా వాయించిన తీరు వాహ్... తాజ్ అనిపించింది. ప్రఖ్యాత తెలుగు కవులు దాశరథి, సినారేలు కూడా ఖవ్వాలీలను తెలుగు సినిమాకు ఒకప్పుడు పరిచయం చేసారు.
హైదరాబాద్ కు చెందిన షోయెబ్ మోహియోద్దీన్ వృత్తిపరంగా ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ అయినా అభిరుచి కారణాన సౌదీలో ఒక ప్రముఖ మర్ఫా కళకారుడిగా ఉన్నారు. మర్ఫా అనే అరబ్బు సంప్రదాయ నృత్యం హైదరాబాదీ పెళ్ళి బారాత్‌లో అత్యంత కీలకం. దీన్ని ఆయన ఈ సందర్భంగా తన బృందం ద్వారా ప్రదర్శించారు.
ఢోలక్ గీత్ అనేవి వివాహా ముందస్తు వేడుకలలో పెళ్ళి ఇంటిలో పాడే జానపద పాటలు. తెలంగాణ ముస్లిం సమాజంలో ఒకప్పుడు ఈ ఢోలక్ పాటలు అత్యంత కీలకం కాగా కాలక్రమేణా ఈ సంస్కృతి కనుమరుగవుతోంది. ఢోలక్ పాటలను కూడా విద్యార్థినులు అద్భుతంగా పాడారు. నిఖా, వలీమా విధానాన్ని కూడా ప్రదర్శించగా వలీమా రోజు వధువరులిద్దరూ మెల్లిగా మాట్లాడుకోవడం నిజమైన పెళ్ళిగా కనిపించి సభికులకు కనువిందులు చేసింది. షాహీన్ అఫ్రోజ్, కౌసర్ తహేసిన్ ఆజీం, అర్షియా తబుస్సుంల దర్శకత్వంలో హైదరాబాద్ పెళ్ళి తంతు ప్రదర్శించారు. ఇదే పాఠశాలకు చెందిన మొహమ్మద్ నదీం అనే ఉపాధ్యాయుడు ఖాజీ పాత్రను పోషించారు. ఉజ్మా బేగం, మోహర్ జబీన్, పార్వతి జయకుమారి, ధిరితీ సింగ్‌లు కూడా హైదరాబాదీ దక్కనీ కళను ప్రదర్శించేందుకు సహాయపడ్డారు. హైదరాబాదీ ప్రముఖుడు అబ్దుల్ ఖయ్యూం నయీం కూడా సమన్వయ కర్తగా వ్యవహరించారు.
వైదేహీ నృత్య విద్యాలయం విద్యార్థులు అర్ధనారీశ్వరి, రహారూపం నృత్యాలు, మౌనిక నాయకత్వంలో 20 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రదర్శించారు. పరమశివుడి నటరాజు స్వరూపంగా ఆమూల్య చేసిన శివ నృత్యరీతులు సభికులను అలరించాయి. అదే విధంగా, యువతను ఉత్సాహపరుస్తూ సాయి కీర్తన, సాయి కీర్తిక ఇద్దరు పాడిన సినీ గేయాలు కూడా సభికుల మనస్సును దోచుకున్నాయి. తెలుగు ప్రవాసీ సంఘం టాసా అధ్యక్షుడు మురారి తాటికాయల బృందం చేసిన వివిధ ప్రదర్శనలు కూడా సభికుల ఆదరణను పొందాయి. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాలకు అర్చన, అక్షితలు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
రమ సౌజన్య మెర్ల, హీతిక, సుష్మిత, సునీత కొడవలి, శివసాయి సత్య శౌర్య, రయ్యాన్ శేఖ్, తాహా మొహమ్మద్ శేఖ్, షాబాను, రమ్య స్వరూప బిడ్డల, భవిష్య రెడ్డి, శ్వేత చెన్నుపాటి, హిమంగా, రోహిణి, ఆది కార్తీకేయ నాయుడు, గుండు అర్చన, సమన్వీ, లక్ష్మి ప్రసన్న, తనూజ అపర్ణ, మౌనిక సత్య నాగ, జయలక్ష్మి సుగవాసిలు కూడా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిను ప్రతిబింబించే వివిధంగా ప్రదర్శనలు ఇచ్చారు. అదే విధంగా తెలుగు వెండితెరకు చేసిన కళా సేవలను స్మరిస్తూ తెలుగు సినీ హీరోలకు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన నృత్యాలను అర్చన, సింధూర, సంధ్యారాణి, శైలజ, జయదుర్గ మానసలు ప్రదర్శించారు.
తెలుగు వారు ఒక చోట గుమిగూడితే తీయని వంటకంబు ప్రస్తావన సహజం. వచ్చిన అతిథులందరికీ రియాద్‌లోని తెలుగు రెస్టారెంట్ ఆతిథ్యం గోదావరి గోంగూర నుండి హైదరాబాదీ బగార వరకు విశిష్ఠ భోజనాన్ని వడ్డీంచగా రాయబారితో సహా అతిథులందరూ ఆస్వాదిస్తూ ఆరగించారు. నోరూరించే పిండి వంటకాలను గీతా శ్రీనివాస్ సభికులకు వడ్డించడం జరిగింది. చందన, శ్రీ సంతోష్, కవిత పోకూరిలు కూడా వివిధ వంటకాలను వడ్డించారు.
వేదికపై రేవల్ ఆంథొని, ముజ్జమ్మీల్ శేఖ్, మురారి, జానీ బాషా, సుచరిత, మోబీన్, జబ్బార్ తదితరులు అధికారులకు స్వాగతం పలికారు.
రెండు రాష్ట్రాల కార్యక్రమాలలో కూడ తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ తన సృజనాత్మక కళల ప్రదర్శన ద్వార కీలకపాత్ర వహించగా టాసా, తెలుగు కళా క్షేత్రం, తెలంగాణ ఫోరం, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధుల సంఘం తదితర ప్రవాసీ సంఘాలు కూడ పాల్గోన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
జర్మనీలో వైభవంగా.. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!
Updated Date - Nov 06 , 2025 | 05:54 AM