ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Videshi Sampark Program: విజయవాడలో విదేశీ సంపర్క్ కార్యక్రమం

ABN, Publish Date - Oct 09 , 2025 | 09:31 PM

విజయవాడలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న విదేశీ సంపర్క్ కార్యక్రమంపై రాష్ట్రంలో, విదేశాలలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. తెలుగు ఎన్నారైల సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

Videshi Sampark Vijayawada

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: శుక్రవారం విజయవాడలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న విదేశీ సంపర్క్ కార్యక్రమం రాష్ట్రంలో, విదేశాలలోనూ అనేక ఆశలు రేకెతిస్తుంది.

పొరుగున ఉన్న తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ కార్యక్రమం కేవలం ఒక అధికారిక లాంఛనంగా మొక్కుబడిగా నిర్వహించేవారు. అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందులో ప్రవాసీయులతో సహా సంబంధిత వర్గాలను భాగస్వాములను చేస్తూ కేంద్రానికి సమస్యలను విశదీకరించే ప్రయత్నం చేస్తోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండి మాత్రమే పాచి పనులు చేసే నిరక్షరాస్య మహిళల నుండి ఉన్నత, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణుల వరకూ అన్ని వర్గాల వారూ విదేశాలకు వెళ్తున్నారు. అటు పార్వతిపురం జిల్లా మొదలు ఇటు చిత్తూరు జిల్లా వరకు పెద్ద సంఖ్యలో యువత విదేశీ బాట పడుతోంది. గల్ఫ్, అమెరికా దేశాలకు వెళ్ళే క్రమంలో, అక్కడకు వెళ్ళిన తర్వాత వీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన పరధిలో స్పందిస్తున్నా అంతర్జాతీయ దౌత్య నియమాల కారణంగా ఆశించిన విధంగా ఫలితం ఉండడం లేదు.

దేశం బయటా ఎలా ఉన్నా, దేశం లోపలి సమస్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందు శాస్త్రీయంగా వివరిస్తూ వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. గల్ఫ్ దేశాలలోని భారతీయ ఎంబసీలలోని సంక్షేమ విభాగాలలో వచ్చే అత్యధిక ఫిర్యాదులలో ఆంధ్రప్రదేశ్ హౌజ్ మెయిడ్స్, డ్రైవర్లకు సంబంధించినవి ఉంటుంన్నాయి. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకునేందుకు తెలుగు మాట్లాడే సిబ్బంది ఒకరు ఉంటే చాల వరకు ఉపశమనం కలుగుతుందని, అయితే ఇలాంటి వారు ఒక్కరు కూడ లేరు. కేవలం తెలుగు భాష రాక సౌదీ అరేబియాలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ సంవత్సరానికి పైగా జైలులో ముగ్గిపోయింది. సి.డబ్ల్యూలలో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకం చేయాలనే డిమాండ్ ఉంది. ఎంబసీ షెల్టర్ హౌసులలో, స్వదేశానికి వెళ్ళే క్రమంలో మహిళలు ఉంటున్నందున సంబంధిత విభాగంలో మహిళలు లేకపోవడంతో వారు నరక యాతన అనుభవిస్తున్నారు. రుతుస్రవ క్రమంలో కనీసం ఒక బట్ట అడుక్కొనే స్థితిలో కూడా వీరు లేరు.

గల్ఫ్ దేశాల ఉపాధి, నివాస వీసాల జారీ కోసం వెళ్ళే వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి. గల్ఫ్ దేశాల మండలి ఆమోదిత వైద్య కేంద్రాలు వీటిని నిర్వహించి ధృవీకరించిన అనంతరం మాత్రమే వీసా జారీ అవుతుంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్టణంతో సహా ఎక్కడ కూడా ఈ కేంద్రాలు లేకపోవడంతో ప్రతి రోజూ వందలాది మంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన ఈ కేంద్రాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తుండడంతో అంత దూరం వెళ్లడం ఇబ్బందికరంగా మారుతోంది. కువైత్ వీసా పొందడం కంటే దాని వైద్య పరిక్షలో ఉత్తీర్ణత కావడం పెద్ద సవాల్‌గా మారింది. అధిక డబ్బును వసూలు చేసే ఉద్దేశ్యంతో ఈ వైద్య కేంద్రాలు అభ్యర్ధులను పదే పదే ఫెయిల్ చేస్తుండడంతో పలుమార్లు హైదరాబాద్‌కు వెళ్ళి వైద్య పరీక్షల ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఈ తతంగంలో అనేకులు ఆర్ధికంగా నష్టపోవడంతో పాటు వీసాల గడువు ముగిసి ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. గామా సెంటర్లుగా పిలిచే ఈ కేంద్రాల తీరుపై రాష్ట్రానికి చెందిన కొందరు పార్లమెంటు సభ్యులు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం.

రాయలసీమ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో వలసలు ఉన్నా అక్కడ కూడా పూర్తిస్థాయి పాస్ పోర్టు కార్యాలయం లేకపోవడంతో వివిధ సవరణల కోసం విజయవాడ వరకూ రావడానికి ఇబ్బంది ఎదురవుతుంది. పేరులో లేదా జనన తేదిలో ఏదైన ఒక సవరణ చేయాలంటే భగీరథ ప్రయత్నాలు చేయవల్సి ఉంటుంది. దీని కోసం అనేక సార్లు విజయవాడకు వెళ్లడానికి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తరుచుగా పాస్ పోర్టు అదాలత్‌లను నిర్వహించడం ద్వారా సవరణలకు సంబంధించిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించవచ్చు. అదే విధంగా ఇళ్ళల్లో పని చేయడానికి వెళ్ళే స్త్రీ, పురుష అభ్యర్ధులకు ప్రీ ఓరియంటేషన్ పథకం క్రింద విదేశీ మంత్రిత్వ శాఖ శిక్షణ ఇస్తోంది. అయితే, ఇందులో అత్యధికం ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, కడప, చిత్తూరు జిల్లాలకు రావాల్సి ఉండగా అవి దక్కడం లేదు.

విదేశాలలో స్థానికులకు ఉపాధి కల్పన ఫలితంగా ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి వస్తున్న వారికి పునరావాసం కల్పించే దిశగా తిరిగి వచ్చే వారి వివరాలతో పాటు పునరావాసానికి అవసరమైన నిధులను కూడా ఇవ్వాలని రాష్ట్రం డిమాండ్ చేస్తోంది.

వరకట్నం, గృహహింస, ఇతర కేసులకు సంబంధించి వారెంట్ల అమలులో రాష్ట్ర స్థాయిలో పోలీసులతో విదేశీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేయాలనే సూచన కూడా ఒకటి ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సి.ఐ, మండల రెవెన్యూ అధికారి స్థాయిలతో కూడిన అధికారిక బృందాన్ని ప్రవాసీయుల సమస్యలను పరిష్కరించడానికి నియమించే యోచనలో ఉన్నట్లుగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నందున దీనికి ప్రాధాన్యత ఉంది.

ఇవి కూడా చదవండి..

దుబాయిలో ఇంకా పరిమళిస్తున్న బతుకమ్మ పూలు

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN)నూతన కార్యవర్గం

మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2025 | 09:21 PM