Bonalu in Bahrain: బహ్రెయిన్‌లో అంగరంగ వైభవంగా బోనాలు
ABN, Publish Date - Jul 05 , 2025 | 10:17 PM
బహ్రెయిన్‌లోని తెలుగు ఎన్నారైలు బోనాల పండుగను కన్నులపండువగా జరుపుకున్నారు. తెలంగాణ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చే రీతిలో అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: బోనాల పండుగ ఉత్సవాలు ఒక్క జంట నగరాలకే పరిమితం కాలేదు. ఎల్లలు దాటి గల్ఫ్ అరేబియా దేశాలకు కూడా వ్యాపించాయి. బహ్రెయిన్‌లో శుక్రవారం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగలో పోతరాజులు, ఘటాల ఊరేగింపులు, తెలంగాణ డప్పు వాయనాలు, జానపద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించగా బాలికలు, మహిళలు కలిసి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాకినాడలో పుట్టిపెరిగిన డి.టి. శ్రీరాం చేసిన పోతరాజు విన్యాసం పక్కా హైదరాబాదీని మించిపోయింది. గత మూడేళ్ళుగా శ్రీరాం చేస్తున్న పోతరాజు విన్యాసం బహ్రెయిన్‌లోని బోనాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణ సాంప్రదాయక డప్పులు, పెద్దపులుల వేషాల పాత్రధారులతో బహ్రెయిన్‌లోని పార్కు తెలంగాణలోని ఒక గ్రామంలోగల పోచమ్మ తల్లి ఆలయ పరిసరాల అనుభూతిని కలిగించింది.
గంగ లక్ష్మి, చంద్రమణి, కవిత, కిరణ్మయి, మంజులలు మహిళలకు బోనాలు, అమ్మ వార్లకు బోనాలు సమర్పించే విధానాన్ని వివరించగా భక్తిపారవశ్యంతో కూడిన వైవిధ్య సాంస్కృతిక కార్యక్రమాలను నేహా కృతి, నైనిక, శ్రేయ, చార్వి, జస్విత, వేద, సత్య ప్రసూన, కావ్య బాలక, హిమ శ్రీ, హిమబిందులు ప్రదర్శించిన తీరు భక్తులను ఆకట్టుకొంది. కార్యక్రమానికి లావణ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
బహ్రెయిన్‌లోని ప్రవాసీ భారతీయులలో ప్రముఖుడు, ఇంజినీరింగ్ వ్యాపారవేత్త, ప్రతిష్ఠాత్మక ప్రవాసీ సమ్మాన్ అవార్డు గ్రహీత కె.జి. బాబురాజన్, భారతీయ స్టేట్ బ్యాంకు సీ.ఈ.ఓ అమిత్ కుమార్‌లు ముఖ్య అతిథులుగా పండుగలో పాల్గొన్నారు. తెలుగు ప్రవాసీ ప్రముఖులు రఘునాథ బాబు, జే.వీ.ఆర్, హరిబాబులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని తెలుగు కళా సమితి అధ్యక్షుడు పి.జగదీశ్ వ్యాఖ్యానిస్తూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు.
ప్రాంతాలకు అతీతంగా అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ బోనాలు అని ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ అన్నారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పల్లా, కోశాధికారి నాగ శ్రీనివాస్, ఉప కార్యదర్శి లత, సభ్యత్వ కార్యదర్శి గంగా సాయి, సాంస్కృతిక కార్యదర్శి సంతోష్, క్రీడల కార్యదర్శి చంద్రబాబు, సాంకేతిక విభాగం అధిపతి దీపక్ తదితరులు వచ్చి బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
మోహన్ మురళీధర్, సతీష్ శెట్టి, సింగిరెడ్డి, బి.సురేశ్, గేదల నాగశ్వేర రావు, రామ్ మోహన్, వయ్యావుల శ్రీనివాస్, సతీశ్ పెటేటీ, అంజలి ప్రమోద్, రవి ఎల్లపు తదితరులు కార్యక్రమానికి సహాయసహాకారాలను అందించారని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం
ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
Updated Date - Jul 05 , 2025 | 10:31 PM