NRI: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
ABN , Publish Date - Jul 03 , 2025 | 08:37 PM
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించాలని ప్రవాసాంధ్రులకు ఆయన పిలుపు నిచ్చారు.
అరాచకం నుండి అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలన
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వ పాలసీలు
ప్రవాసాంధ్రులకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మన్నవ సుబ్బారావు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించాలని ప్రవాసాంధ్రులకు ఆయన పిలుపు నిచ్చారు. వైఎస్ జగన్ పాలనలో అరాచకం నుంచి ప్రస్తుతం అభివృద్ధి వైపు రాష్ట్రం వేగంగా పరుగులు పెడుతోందన్నారు. బుధవారం ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్ విల్లే నగరంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది.
అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం చేసి 75 వసంతాలు పూర్తి చేసుకొని.. వజ్రోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. జగన్ అనే భూతాన్ని చూసి ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. ప్రవాసాంధ్రులు పీ4లో భాగస్వాములు కావాలంటూ ఎన్నారైలకు ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి ఆయన సూచించారు.

గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ... గత ప్రభుత్వం కొత్త పరిశ్రమలు తీసుకు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోయేటట్టు చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీలు రాష్ట్రానికి, అన్ని వర్గాలకు మేలు చేసేవని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అనేక ప్రపంచ రికార్డులను ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుందని గుర్తు చేశారు.
సీఎం చంద్రబాబు అకుంఠిత దీక్షతోనే ఇది సాధ్యపడిందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ జరుపుకుంటున్నారని వివరించారు. వైఎస్ జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కూల్చివేతలే తప్ప నిర్మాణాలు లేవంటూ వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రాన్ని శిథిలం నుండి శిఖరం వైపునకు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తోందని అభివర్ణించారు.
అంతకుముందు ఈ కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధిపై తయారు చేసిన సీడీలను ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. సుమంత్ ఈదర, ఆనంద్ తోటకూర, అనిల్ యార్లగడ్డ, ఆనంద్ వక్కలగడ్డ, హరీశ్ కుమార్ వీరవల్లి, రాజేశ్ మాదినేని, గోపాల్ కుంట్ల, నాగేశ్వరరావు సూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
బీజేపీ నేత పాతూరి నాగభూషణానికి అరుదైన గౌరవం
అట్లాంటాలో తానా పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతం
ఆసుపత్రిలో ఒంటరైన రోగికి ఆపన్నహస్తం.. సౌదీలో మానవత్వం చాటుకున్న తెలుగు మహిళ