NRI: ఆసుపత్రిలో ఒంటరైన రోగికి ఆపన్నహస్తం.. సౌదీలో మానవత్వం చాటుకున్న తెలుగు మహిళ
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:20 PM
సౌదీలో జరిగిన యాక్సిడెంట్‌లో గాయపడి ఒంటరిగా మారిన ఓ హైదరాబాద్ మహిళకు మరో తెలుగు మహిళ అండగా నిలిచారు. ఆమెకు వెన్నంటే ఉంటూ సపర్యలు చేసి స్వస్థలానికి చేర్చారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి: ఘోర రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడి ప్రాణసంకట స్థితిలో ఉన్న అసంఖ్యాక రోగులకు సేవలందించిన ఓ తెలుగు నర్సు కొంత కాలం క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా సాటి తెలుగు మహిళ సాయంతో మళ్లీ కోలుకుని మృత్యుంజయురాలిగా నిలిచారు. సోమవారం స్వదేశానికి బయలుదేరారు. సకాలంలో ఆమెకు వైద్యసాయం అంది కోలుకున్నా పరాయిగడ్డపై ఆత్మీయులు కొరవడి ఏకాకిగా మారిన నేపథ్యంలో ముక్కూమొహం తెలియని మరో తెలుగు వీర మహిళ తానున్నాంటూ ఆమెకు ఆసరాగా నిలిచారు. బాధితురాలి కోసం 2200 కిలోమీటర్లు ప్రయాణం చేశారు .
హైదరాబాద్ నగరానికి చెందిన 34 ఏళ్ళ నర్సు ఒకరు సౌదీ అరేబియాలోని బిషా ప్రాంతంలో పని చేస్తున్నారు. అల్ బాహా – తాయిఫ్ ప్రాంతంలో మూడు నెలల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదస్థలం నుండి ఆమెను హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స చేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడి మృత్యుంజయురాలిగా నిలిచారు. కొద్ది కాలం తర్వాత ఆమెను బిషా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స కొనసాగిస్తున్నారు. మెదడు, వెన్నెపూసకు ఆపరేషన్లతో సహా మెరుగయిన వైద్య సదుపాయం ఆమెకు అందించినా దుర్ఘటన బీభత్సం నుండి మాత్రం ఆ యువతి మానసికంగా కోలుకోలేక కన్నీరు మున్నీరయ్యింది. ఘోర దుర్ఘటనల నుండి తేరుకున్న బాధితులలో ఈ రకమైన మానసిక వ్యధ, వేదన సహజంగా ఉంటుందని వైద్యవర్గాలు పేర్కొంటాయి. తెలుగు మాట్లాడే వారు ఎవరూ తోడుగా లేకపోవడంతో ఆమె మరింత కృంగిపోయారు.
బిషా నుండి 700 కిలో మీటర్ల దూరంలోని రియాద్‌లో ఉండే దుగ్గరపు ఉష అనే మహిళ కార్యకర్త ఒకరు నర్సు పరిస్థితి తెలిసి చలించిపోయారు. ప్రతి రోజూ ఆమెతో మాట్లాడుతూ ఆమెకు మనోధైర్యం ఇచ్చారు. అక్కగా అండగా నిలిచారు. తన పిల్లలకు పరీక్షలు ఉన్నా నర్సు వైపే దృష్టి పెట్టారు. స్వదేశానికి తిరిగి వెళ్ళి చికిత్స చేయించుకుంటానని నర్సు ఒత్తిడి చేయడంతో ప్రయాణానికి సంబంధించి ఉష తన వంతుగా సహాయమందించారు.
రియాధ్ నుండి బిషాకు వెళ్ళిన ఉష అక్కడి నుండి నర్సు వెంట తోడుగా తన భర్త ఎర్రన్నతో కలిసి విమానంలో జెద్ధా వరకు వచ్చి దగ్గరుండి ఆమెను హైదరాబాద్ విమానమెక్కించారు. రియాధ్, బిషా, జెద్ధా నగరాల మధ్య మొత్తం 2,200 కిలో మీటర్లకు పైగా ప్రయాణం చేసిన ఉష.. సౌదీ అరేబియాలోని జనసేన వీరమహిళ నాయకురాలు కూడా. నర్సుకు అన్ని విధాలుగా అండగా నిలిచి సహకరించిన సౌదీ అధికారులకు, ఆసుపత్రి వర్గాలకు, తనకు తోడుగా నిలిచిన తన భర్త ఎర్రన్నకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో కూడా కొంత మంది మహిళలకు సహాయమందించిన ఉషా ఆపదలో ఉన్న ప్రతి తెలుగు మహిళలో తనకు ఒక సోదరి కనిపిస్తుందని, అందుకే వారి కోసం తన వంతుగా సహాయం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తి కూడా ఒక కారణమని ఉష వ్యాఖ్యానించారు. ఉష సేవా నిరతిని అనేక మంది కొనియాడారు.
ఇవీ చదవండి:
తానా త్రోబాల్, వాలీబాల్ పోటీలకు మంచి స్పందన
కెనడాకు వెళ్లాలనుకునే వారు ఈ వీడియో చూడాలి.. దడ పుట్టిస్తున్న భారతీయ యువతి పోస్టు