H-1b Visa Blind Survey: హెచ్-1బీ వీసాపై సర్వే.. 56 శాతం మంది అమెరికన్ల భావన ఇదే..
ABN, Publish Date - Sep 10 , 2025 | 07:28 PM
హెచ్-1బీ వీసాపై ఇటీవల బ్లైండ్ యాప్‌లో జరిగిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్-1బీ వీసా ఉన్న వారి తమ ఉద్యోగావకాశాలకు గండి కొడుతున్నారని 56 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో హెచ్-1బీ వీసాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విదేశీ వర్కర్లు తమ ఉపాధి అవకాశాలను లాక్కుంటున్నారని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. వీసా వ్యవస్థలో సంస్కరణ అవసరమని అధికార పార్టీ నేతలు వివిధ వేదికల్లో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించిన కమ్యూనిటీ యాప్ బ్లైండ్‌లో హెచ్-1బీ వీసాపై సర్వే నిర్వహించారు. 4,230 మంది వృత్తి నిపుణులు మంది పాల్గొన్న ఈ సర్వేలో ప్రజల మనోభీష్టానికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి (H1B visa divide USA). అమెరికాకు వీసాపై వచ్చిన వారితో పాటు గ్రీన్ కార్డు ఉన్నవారు, అమెరికన్ పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఈ సర్వే ప్రకారం, హెచ్-1బీ వీసాదారులు తమ ఉపాధికి గండికొడుతున్నారని 56 శాతం మంది అమెరికన్స్ భావిస్తున్నారు. అయితే, హెచ్-1బీ వీసాదారులు అమెరికా కంపెనీల అభివృద్ధికి అవసరమని సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది చెప్పడం కొసమెరుపు. ఇక విదేశాల్లో పుట్టి, అమెరికాలో జాబ్ చేస్తూ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 87 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే అమెరికన్లలో కేవలం 49 శాతం మంది మాత్రమే హెచ్-1బీ వీసాదారులు అమెరికన్ కంపెనీలకు అవసరమని అభిప్రాయపడ్డారు (Americans opinion H1B visas).
పౌరసత్వంతో నిమిత్తం లేకుండా సామర్థ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకోవాలా అన్న ప్రశ్నకు మొత్తం పార్టిసిపెంట్స్‌లో 63 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. కానీ అమెరికా పౌరుల్లో ఏకంగా 60 శాతం మంది స్థానికులకే అవకాశం ఇవ్వాలని అన్నారు. హెచ్-1బీ వీసాదారుల్లో 11 శాతం మంది, శాశ్వత నివాసార్హత ఉన్న వారిలో 35 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రశ్నకు అవునని సమాధానం చెప్పారు (green card holders job priority).
ఇక హెచ్-1బీ వీసాదారుల వల్ల అన్యాయమైన పోటీ నెలకొందని సర్వేలో పాల్గొన్న 33 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమ ఉపాధి అవకాశాల కోసం వారు నేరుగా పోటీ పడుతున్నారని కామెంట్ చేశారు. ఇక అమెరికన్లలో ఏకంగా 56 శాతం మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. గ్రీన్ కార్డుదారుల్లో 27 శాతం మంది కూడా తమకు హెచ్-1బీ వీసాదారులతో పోటీ ఎదురవుతోందని అన్నారు.
హెచ్-1బీ వీసాదారులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తున్నందుకు అమెరికా టెక్ కంపెనీలను ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. ‘కొన్ని టెక్ కంపెనీలు సుమారు 9 వేల మంది వర్కర్లను తొలగిస్తాయి. ఆ తరువాత అదే స్థాయిలో హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేస్తాయి. ఈ తీరు నిజంగా అర్ధరహితం’ అని ఆయన కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భారత్ నా జీవితాన్నే మార్చేసింది.. రష్యా మహిళ కితాబు
ఒమాన్‌లో తెలుగు కళా సమితి క్రీడా పోటీలు
Updated Date - Sep 10 , 2025 | 07:38 PM