ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Entrepreneurs: స్టార్టప్‌ సామ్రాజ్ఞులు!

ABN, Publish Date - Dec 22 , 2025 | 04:18 AM

2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత స్టార్టప్‌ రంగం ఒక కొత్త విజయగాధను లిఖిస్తోంది....

2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత స్టార్టప్‌ రంగం ఒక కొత్త విజయగాధను లిఖిస్తోంది. ఈ విజయానికి సారథులు మహిళలు. పురుషాధిక్య ప్రపంచంలో విజయానికి కొత్త నిర్వచనం చెబుతూ కేవలం వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించడమే కాకుండా షార్క్‌ట్యాంక్‌ ఇండియా వంటి వేదికల ద్వారా, ఏంజెల్‌ పెట్టుబడుల ద్వారా నవతరానికి మార్గనిర్దేశం చేస్తున్న ఐదుగురు శక్తిమంతమైన మహిళల స్ఫూర్తి ప్రస్థానం ఇది.

అందాన్ని బ్రాండ్‌గా మార్చిన నైకా అధినేత్రి

నైకా వ్యవస్థాపకురాలు, సీఈవో ఫల్గుణి నాయర్‌ 2025 లోనూ భారత సౌందర్య సాధనాల రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు 4.28 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 38,663 కోట్లు) సంపదతో దేశంలో స్వయంకృషితో ఎదిగిన అత్యంత సంపన్న మహిళగా రికార్డులకెక్కారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నైకా నికర లాభం 154 శాతం పెరిగి రూ. 33 కోట్లకు చేరుకున్నది. దేశవ్యాప్తంగా 250కిపైగా ఆఫ్‌లైన్‌ స్టోర్లతో, అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లతో దూసుకుపోతోంది. 13 బిలియన్‌ డాలర్ల విలువతో భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని యూనికార్న్‌గా రికార్డులకెక్కింది. ‘సౌందర్యం ఒక సాధికారత’ అనే ఫల్గుణి నాయర్‌ మంత్రం కోట్లాదిమంది భారతీయ మహిళలకు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది.

సహజ సౌందర్యంలో మామాయెర్త్‌ విప్లవం

మామాయెర్త్‌ సహ వ్యవస్థాపకురాలు ఘజల్‌ అలఘ్‌ తన బ్రాండ్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడమే కాకుండా ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గా స్టార్ట్‌పలకు అండగా నిలుస్తున్నారు. రసాయన రహిత ఉత్పత్తులతో వినియోగదారుల మన్నన పొందిన మామాయెర్త్‌ 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 13 శాతం వృద్ధితో రూ. 533 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ‘మాతృత్వం.. నవకల్పన’ అనే ఆమె సిద్ధాంతం 1.84 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీని నిర్మించడమే కాకుండా ఎందరో నవతరం పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చింది.

ఫిన్‌టెక్‌ రంగంలో డ్యూయల్‌ యూనికార్న్‌ సృష్టికర్త ఆఫ్‌బిజినెస్‌, ఆక్సిజో సహ వ్యవస్థాపకురాలు

రుచి కల్రా ఒకేసారి రెండు యూనికార్న్‌లను నడిపిస్తూ ఫిన్‌టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె నేతృత్వంలోని ఈ రెండు కంపెనీల సమష్టి విలువ 5 బిలియన్‌ డాలర్ల పైమాటే. దేశంలోని 15 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ, సరఫరా సేవలు అందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఒకప్పుడు కేవలం 2 శాతం మాత్రమే ఉన్న మహిళల స్టార్ట్‌పల నిధుల సమీకరణ అంతరాన్ని పూడ్చడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారు.

అపోహలను బద్దలుకొట్టిన జివామే

భారతదేశంలో మహిళల లోదుస్తుల విపణిలో ఉన్న అడ్డంకులను, సామాజిక అపోహలను బద్దలుకొట్టి ఆన్‌లైన్‌ వ్యాపార విప్లవాన్ని సృష్టించారు జివామే వ్యవస్థాపకురాలు రిచా కర్‌. 2011లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం 2025 నాటికి 50కిపైగా ఆఫ్‌లైన్‌ స్టోర్లు, 50 లక్షలమందికిపైగా వినియోగదారులతో 800 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. మహిళలకు సౌకర్యం, ఆత్మవిశ్వాసం అందించాలనే ఆమె లక్ష్యం నిశ్శబ్దంగా ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది పలికింది.

భారతీయతకు పెద్దపీట.. షుగర్‌ కాస్మెటిక్స్‌

భారతీయ మహిళల అవసరాలకు తగిన సౌందర్య ఉత్పత్తులతో షుగర్‌ కాస్మెటిక్స్‌ వ్యవస్థాపకురాలు వినీతసింగ్‌ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. సిరీస్‌ డి ఫండింగ్‌తో ఆమె కంపెనీ విలువ 1,640 కోట్ల రూపాయలకుచేరింది. షార్క్‌ ట్యాంక్‌ జడ్జిగా ఆమె ఎందరో మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు పెట్టుబడులతో ఊతమిచ్చారు. ‘‘ఆడంబరాన్ని కాదు.. సమస్య పరిష్కారాన్ని ప్రేమించండి’’ అనే ఆమె మాటలు నేటి యువతకు ఆదర్శం.

Updated Date - Dec 22 , 2025 | 04:18 AM