Winter Care Tips for Chrysanthemum Plants: చలికాలంలో చామంతి మొక్కలు ఇలా
ABN, Publish Date - Nov 16 , 2025 | 05:44 AM
Winter Care Tips for Chrysanthemum Plants How to Grow Healthy and Bushy Blooms
చల్లని వాతావరణంలో చామంతి మొక్కలు సులువుగా నాటుకుని గుబురుగా పెరుగుతాయి. వీటికి ఎక్కువగా ఎరువుల అవసరం ఉండదు. చలికాలంలో చామంతి మొక్కలకు ఎలాంటి సంరక్షణ అందించాలో తెలుసుకుందాం...
చామంతి మొక్కలను నేలమీద, కుండీల్లో కూడా పెంచవచ్చు. మట్టి.. మరీ పొడిగా లేదా మరీ తడిగా ఉండకూడదు. నీటిని నిల్వ ఉంచే మెత్తటి మట్టి కాకుండా కొద్దిగా ఇసుక మాదిరి ఉండేదాన్ని తీసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది. కుండీని సగానికి పైగా మట్టితో నింపి అందులో సేంద్రియ ఎరువులు వేసి బాగా కలపాలి. తరువాత ఒకటి లేదా రెండు చామంతి మొక్కలను కలిపి నాటాలి. అదే నేలమీద అయితే మొక్కల మధ్య కనీసం ఆరు అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి.
చామంతి మొక్కలకు రోజూ మూడు లేదా నాలుగు గంటలపాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మొక్కలపై నీడ పడేలా ఏర్పాటు చేయాలి. నిరంతరం గాలి వీస్తూ ఉంటే ఎక్కువగా పూలు పూస్తాయి.
చామంతి మొక్కలకు ఎక్కువగా నీరు పోయకూడదు. కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మట్టిలో నీరు నిలిస్తే మొక్క వేళ్లు కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
మొగ్గలు వచ్చే సమయంలో కొద్దిగా పొటాషియం, బోన్‌మీల్‌లను నీటిలో కలిపి మొక్కలకు అందిస్తే పూలు పెద్దగా పూస్తాయి.
పదిహేను రోజులకోసారి నీళ్లలో కొద్దిగా వేపనూనె కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే క్రిమి కీటకాలు చేరకుండా ఉంటాయి.
వికసించిన పూలను ఎప్పటికప్పుడు కోస్తూ ఉండాలి. దీనివల్ల పూల ఉత్పత్తి పెరుగుతుంది.
చలి తీవ్రత పెరిగినప్పుడు, విపరీతంగా మంచు కురుస్తున్నప్పుడు చామంతి మొక్కలకు తగు రక్షణ కల్పించాలి. బాల్కనీలో ఉండే కుండీలను సురక్షిత ప్రాంతానికి తరలించాలి.
ఇవి కూడా చదవండి..
బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా
ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 16 , 2025 | 05:44 AM