The Cosmic Energy Festival of Telangana: విశ్వశక్తి బతుకమ్మ
ABN, Publish Date - Sep 26 , 2025 | 03:29 AM
వేదకాలం నుంచి విశ్వాన్ని ఆరాధించే సంప్రదాయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఋగ్వేదం ‘ఓం తత్ సత్’ అని చెబుతోంది. ప్రకృతి, సృష్టి, స్త్రీశక్తి కలిసి ‘విశ్వశక్తి’ అనే భావన ఏర్పడింది. ఆ భావనే తరువాతి...
విశేషం
వేదకాలం నుంచి విశ్వాన్ని ఆరాధించే సంప్రదాయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఋగ్వేదం ‘ఓం తత్ సత్’ అని చెబుతోంది. ప్రకృతి, సృష్టి, స్త్రీశక్తి కలిసి ‘విశ్వశక్తి’ అనే భావన ఏర్పడింది. ఆ భావనే తరువాతి కాలంలో దుర్గ, కాళి, పార్వతి, లక్ష్మి, సరస్వతి రూపాలలో అభివృద్ధి చెందింది. బతుకమ్మ పండుగ ‘విశ్వశక్తి’ ఆరాధనకు ప్రతీకగా నిలుస్తోంది.
బతుకమ్మ పండుగ శక్తి ఆరాధనకు సంబంధించినది. ఆదిమవాసుల ఆరాధన మూలాల్లోకి వెళితే... ఆదిమ రాతియుగం నుంచే నాటి ప్రజలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నీరు లాంటి ప్రకృత శక్తులను ఆరాధించేవారు. ఈ విధంగా విశ్వశక్తిని ఆరాధించడం నాగరితకతో సమానంగా అభివృద్ధి చెందింది. అన్ని నాగరికతలలోనూ విశ్వశక్తి ఆరాధన కనిపిస్తుంది. ప్రకృతి ఆరాధన, అగ్ని ఆరాధన, పూల ఆరాధన దీనిలో భాగంగా ఉండేవి. ఈ క్రమంలో ‘జీవశకి’్త (బతుకు అమ్మ) అనే భావన ఏర్పడి, ఆ తరువాత అది బతుకమ్మ పండుగగా మారి ఉండవచ్చు.
ప్రకృతి, ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు
శక్తి ఆరాధనలో భాగంగా ఆదివాసులు గౌరమ్మ, గంగమ్మ, మైసమ్మ, పోలేరమ్మ తదితర దేవతలను పూజించేవారు. ఇవన్నీ వాస్తవానికి నేల తల్లికి, ప్రకృతి శక్తికి ప్రతీకలు. జానపదులు తమ ఆచారంలో భాగంగా... పూజ సమయంలో డప్పులు, తాళాలు వాయించడం, చప్పట్లు కొట్టడం లాంటి శబ్దాల ద్వారా శక్తిని కొలిచేవారు. సామూహికంగా గీతాలు పాడుతూ, వలయం వేసి నృత్యం చేస్తూ విశ్వశక్తిని స్తుతించేవారు. బతుకమ్మ పండుగ పూర్తి ఆచారాలను గమనిస్తే ఇవన్నీ కనిపిస్తాయి. బతుకమ్మ పండుగలో ఉపయోగించే పువ్వులు కూడా విశ్వశక్తికి ప్రతీకలే. ఆదిమవాసులు వాటిని కేవలం అందం కోసం కాకుండా ప్రకృతిశక్తి, ఆరోగ్యం, ఆధ్యాత్మికతలకు ప్రతీకలుగా పూజించారు. పసుపు రంగు కలిగిన తంగేడు పువ్వు సూర్యశక్తికి, జీవ ప్రకాశానికి ప్రతీక. గుమ్మడి జీవనాధారమైన ఆహారం కాబట్టి దాని పువ్వు పవిత్రమైనది. ఆహార భద్రత, జీవన స్థిరత్వం, పంటల శక్తికి ప్రతీక. ఇక బతుకమ్మలో ప్రధానంగా ఉపయోగించే బంతి పువ్వు... సృష్టి శక్తికి, పంటల సృష్టికి, దీర్ఘకాలం వాడిపోని పువ్వు కాబట్టి దీర్ఘాయుష్షుకు, స్థిరత్వానికి, శక్తి నిలకడకు ప్రతీక. బతుకమ్మలో ఉపయోగించే పూలలో చాలా వరకూ ఆదిమవాసులు అడవిలో లభించే ఔషధ గుణాలున్న గునుగు, గుమ్మడి, తంగేడు పూలను సేకరించి, దేవతకు సమర్పించేవారు.
బిందు రూపిణి
విశ్వానికి ఆది రూపం బిందువు. బిందువును సృష్టికి మూలంగా పరిగణిస్తారు. బతుకమ్మను పువ్వులతో పొరలుగా పేర్చి, చివరిలో చిన్న పువ్వు లేదా గుమ్మడి పువ్వు లేదా గౌరమ్మను బిందువులా ఉంచుతారు. అది జీవన శక్తి కేంద్రం, విశ్వశక్తికి బిందువు ప్రతీక. అందుకే బతుకమ్మను శ్రీచక్రంతో పోలుస్తారు. శ్రీచక్రంలో ఉన్న బిందువును విశ్వశక్తి కేంద్రంగా భావిస్తారు. విజ్ఞాన దృష్టితో చూస్తే బిందువును శక్తి కేంద్రంగా కూడా భావించవచ్చు. విశ్వంలో శక్తి అంతా ఒకే కేంద్రీకృత బిందువులో ఉందని ఆధునిక సైన్స్ కూడా చెబుతోంది. బతుకమ్మ కూడా శక్తి కేంద్రీకృత బిందు రూపమే. పూలతో అల్లిన రూపం పై నుంచి చూస్తే... బతుకమ్మ గుండ్రని బిందువులా కనిపిస్తుంది. మధ్యలో జీవన శక్తిని సూచించే పూలు ఉంచుతారు. ఒక బిందువు విస్తరించి విశ్వం అవుతుంది. తిరిగి అదే బిందువులో లీనమవుతుంది. బతుకమ్మ పూలను ఒక్కొక్కటీ జోడించి గోపురంలా పేర్చుతారు. చివరకు ఆ పూలన్నీ నీటిలో కలిసిపోయి, రేపటి పునఃసృష్టికి మూలం అవుతాయి. బతుకమ్మ పువ్వుల పుట్టుక, వికాసం, వాడిపోవడం, చివరకు లీనం కావడం... ఇదంతా జీవన చక్రాన్ని సూచిస్తుంది.
ద్రవిడ సంస్కృతి మూలాలు
ద్రవిడ సంస్కృతి దక్షిణ భారతదేశంలో ఏర్పడిన అత్యంత ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి. ఇది కేవలం భాష, సంప్రదాయాలనే కాదు, మానవ జీవన విధానాన్ని, ఆచారాలను, ఆరాధనా విఽధానాలను సూచిస్తుంది. పోచంపల్లి, నాగార్జున కొండ, పిఠాపురం, ధూళికట్ట లాంటి ప్రదేశాల్లో దొరికిన ఆదిమ రాతియుగం, కొత్త రాతియుగం నాటి అవశేషాలు ద్రవిడ సంస్కృతి మూలాలను చూపిస్తున్నాయి. మాతృదేవతా పూజ ద్రవిడుల ప్రధాన ఆరాధన. ‘బతుకమ్మ’ అంటే ‘జీవించి ఉండు తల్లి’ అని అర్థం. ఇది మాతృశక్తి ఆరాధన. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో మాతృదేవత... బతుకమ్మ రూపంలో పూజలు అందుకుంటుంది. బతుకమ్మ పండుగలో... గునుగు, బంతి, చామంతి, తంగేడు, గున్నెమల్లె లాంటి పూలను ఉపయోగిస్తారు. ద్రవిడ సంప్రదాయంలో ఇది ప్రకృతి శక్తి పూజకు ప్రతీక. బతుకమ్మ పండుగ కోసం పూల సేకరణ మొదుకొని బతుమ్మను సాగనంపేవరకూ ప్రతిదీ ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంది. అలాగే బతుకమ్మ పాటల్లో అమ్మవారి శక్తిని, ప్రకృతిని వర్ణించడం, గ్రామ సంప్రదాయాలు, పాడి పంటల ఆనందం, బలి అయిన స్త్రీల చరిత్రలు, బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాల కథల్లాంటివి ఉంటాయి. గ్రామీణ మహిళలు తమ స్వానుభవంతో మౌఖికంగా ఈ పాటలు అల్లుకొని, చప్పట్లు కొడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆశువుగా పాడుకుంటారు. ద్రవిడ సంస్కృతిలో సృష్టికి మూలం స్త్రీశక్తి అనే భావన ఉంది. బతుకమ్మ పండుగలో అది కొనసాగుతోంది. బతుకమ్మను స్త్రీశక్తికి ప్రతీకగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలుస్తారు. ఈ పండుగలో మహిళల భాగస్వామ్యమే ఎక్కువ. కాలక్రమేణా ఎన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, బతుకమ్మ పండుగకు మూలమైన విశ్వశక్తి ఆరాధన, ద్రవిడ సంస్కృతి మూలాలు బలంగా నిలిచే ఉన్నాయి. ఇంతటి ఘనమైన ఈ వేడుకలపై ఆధునిక పోకడలు రుద్దకుండా... ప్రాచీన సంస్కృతి మూలాలను కాపాడుకుందాం.
డాక్టర్ శారదా హన్మాండ్లు
9912275801
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..
Updated Date - Sep 26 , 2025 | 03:29 AM