CM Chandrababu Warning: ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:39 PM
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని.. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకూ జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొంతమంది పెద్దఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని... అది ఫేక్ అని మనమే చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు, సోషల్ మీడియా అంశాలపై శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత పాలకుల హయాంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఒక్కో వ్యవస్థనూ సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. నేరస్థులకు అండగా ఉండే రాజకీయ నేతలను తాను ఇంతవరకూ చూడలేదని.. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను బయటపెట్టాలని... వారి ముసుగు తీస్తే ప్రజలే అర్థం చేసుకుంటారని తెలిపారు.
వాటి పట్ల కఠినంగానే...
వాహనాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగానే ఉంటామని తేల్చిచెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని.. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని బ్యాచ్‌లు పెద్దఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని... అది ఫేక్ అని మనమే చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
ఇదే ప్రత్యక్ష ఉదాహరణ..
వివేకా హత్య కేసు ఘటన జరిగినప్పుడు క్రైమ్ సీన్‌లో సీఐ శంకరయ్య ఉన్నారని.. వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రిగా తననూ ఏమార్చారన్నారు. గుండెపోటు కాదు గొడ్డలి పోటు అని తేలిందని... అక్కడున్న రక్తాన్ని శుభ్రం చేశారని తెలిపారు. ఏమీ తెలియని వారిలా అమాయకంగా వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చారని.. ఫేక్ రాజకీయాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం చెప్పుకొచ్చారు. రాజకీయపరంగా చాలా మందిని ఎదుర్కొన్నానని, ఇప్పుడు నేరస్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.
‘శంకరయ్య ఒక సీఎంకు నోటీసులు పంపించటం అంటే ఎంత ధైర్యం చేసి ఉండాలి. నేరం జరిగినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్సులో సీఐగా విధులు నిర్వహించి నేరం జరిగిన ప్రాంతాన్ని రక్షించాలి. క్రిమినల్స్‌తో కలిసిపోయి ముఖ్యమంత్రికే నోటీసు పంపించే స్థాయికి శంకరయ్య చేరుకున్నారు. పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్లి సినిమా డైలాగులు చెప్తారా?’ అంటూ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నేరాలు తగ్గాయి...
‘మహిళలపై రాష్ట్రంలో నేరాలు తగ్గాయి. గతంతో పోల్చుకుంటే 4.84 శాతం మేర మహిళలపై నేరాలు తగ్గాయి. వరకట్న మరణాలు 43 శాతం తగ్గాయి. మహిళా హత్యలు 15 శాతం తగ్గాయి. మహిళా ఆత్మహత్యలు 59 శాతం తగ్గాయి. మహిళలపై సైబర్ వేధింపులు 17 శాతం తగ్గాయి. వరకట్న వేధింపులు 25 శాతం తగ్గాయి. మహిళలపై నేరాలకు పాల్పడ్డ వారిలో 343 మందికి శిక్షలు పడ్డాయి. మహిళలను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టి అవమానిస్తారా?. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నాం. మహిళలపై నేరం జరిగితే కేవలం 8-10 నిముషాల్లోపే ఘటనా స్థలికి చేరుకునేలా చర్యలు చేపట్టాం. శక్తి టీమ్‌లను ఏర్పాటు చేసి మహిళల రక్షణ పట్ల చర్యలు చేపడుతున్నాం. సెక్సువల్ అఫెండర్లపైనా రౌడీషీట్లను ఓపెన్ చేస్తాం. ఆన్ లైన్‌లోనూ ఫొటోలు పెట్టి ఎక్స్ పోజ్ చేస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
సింగయ్య మృతిపై..
సింగయ్యను కారు కింద తొక్కించేసి తిరిగి బురదజల్లే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. కనీసం మానవత్వం లేకుండా పొదల్లోకి విసిరేసి వెళ్లిపోయారన్నారు. తిరిగి మృతుడి భార్యతో అసత్యాలు చెప్పించారని.. తన భర్త జగన్ కారు కింద చనిపోలేదని, పోలీసులు అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని చెప్పించారన్నారు. మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లి రోడ్డుపై మామిడికాయలు ట్రాక్టర్లతో తొక్కించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ విషయంలో రాజీ లేదు..
శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీలేదని స్పష్టంగా చెబుతున్నామన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా ఏపీ ముందుకు వెళ్లాలని.. అగ్రస్థాయి రాష్ట్రంగా ఏపీ ఉండాలని ఆకాంక్షించారు. గత పాలకులు టీడీపీ కార్యాలయంపైనా దాడి చేశారని.. దీనిపై అప్పటి గవర్నర్, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ అరాచకాలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు
శాంతిభద్రతలపై చర్చ... అయ్యన్న కీలక కామెంట్స్
Read Latest AP News And Telugu News