లింఫొడీమా ఎందుకు
ABN, Publish Date - Jun 19 , 2025 | 01:57 AM
దీన్ని లింఫొడీమా అంటారు. లింఫొడీమా అంటే అవయవ వాపు. లింఫ్ గ్రంథుల నుంచి స్రవించే స్రావం కణజాలాలకు చేరకుండా, నిల్వ ఉండిపోతే ఇలా జరుగుతుంది. ఫలితంగా ఆయా ప్రదేశాలతో...
కౌన్సెలింగ్
డాక్టర్! నాకు ముంజేయి వాపు ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం సూచించగలరు?
- ఓ సోదరి, హైదరాబాద్
దీన్ని లింఫొడీమా అంటారు. లింఫొడీమా అంటే అవయవ వాపు. లింఫ్ గ్రంథుల నుంచి స్రవించే స్రావం కణజాలాలకు చేరకుండా, నిల్వ ఉండిపోతే ఇలా జరుగుతుంది. ఫలితంగా ఆయా ప్రదేశాలతో సంబంధం ఉన్న కాళ్లు, చేతులు, ముఖం... వాచిపోతాయి.
వాపు నియంత్రణ మన చేతుల్లోనే
ఈ సమస్య క్రమేపీ పెరుగుతుంది. కాబట్టి ప్రారంభంలోనే గుర్తించి జాగ్రత్తపడడం అవసరం. లింఫోడీమా వాపు సాధారణ వాపు కంటే భిన్నంగా ఉంటుంది. కాళ్లలో తలెత్తే లింఫోడీమా అయినా, చేతుల్లో తలెత్తే లింఫోడీమా అయినా, వేళ్ల పైన ఉండే చర్మం ఉబ్బిపోయి, వేళ్లతో పట్టుకుని లాగడానికి సాధ్యపడదు. ఇలా ప్రారంభంలోనే గుర్తిస్తే బిగుతైన ‘లింఫాటిక్ గార్మెంట్స్’ వేసి వాపును అదుపులో ఉంచుకోవచ్చు.
చికిత్స ఇలా
లింఫ్ స్రావం పేరుకుపోవడం కారణంగా లింఫోడీమా తలెత్తినప్పుడు, ఆ స్రావాన్ని తిరిగి ఆ ప్రదేశం నుంచి వెనక్కి వెళ్లేలా చేయడమే ఈ సమస్యకు ప్రధాన చికిత్స. ఇందుకోసం మూడు రకాల పద్ధతులను అనుసరించాలి. అవేంటంటే....
మర్దన: మర్దన వల్ల మూసుకుపోయిన నాళాలు తెరుచుకోకపోయినా, చర్మం అడుగున కొత్త నాళాలు ఏర్పడేలా చేయవచ్చు. ఫలితంగా స్రావం వెనక్కి వెళ్లిపోతుంది. అయితే మర్దన కోసం ఎలాంటి నూనెలూ వాడకూడదు. మర్దన విధానం వైద్యుల దగ్గరే నేర్చుకుని అనుసరించాలి.
శుభ్రత: లింఫోడీమా తలెత్తిన అవయవం చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా వేళ్ల సందుల్లో ఎక్కువగా శుభ్రం చేసుకోవాలి. కేవలం చర్మం శుభ్రం చేసుకోవడానికే ఉదయం, సాయంత్రం చెరొక అరగంట కేటాయించాలి. జీరో పిహెచ్ రకం సబ్బునే వాడాలి. లేదంటే వాపు వల్ల ఏర్పడే ముడతల్లో బ్యాక్టీరియా చేరి ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. ఇలా కొత్తగా వచ్చే ఇన్‌ఫెక్షన్లు తిరిగి లింఫ్ నాళాలను మూసుకుపోయేలా చేసి పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి.
లింఫాటిక్ కంప్రెషన్ పంప్: ఈ పరికరం కూడా అవయవాల్లో పేరుకుపోయిన స్రావాన్ని వెనక్కి పంపిస్తుంది. ప్రారంభంలో వైద్యుల సహాయంతో ఈ చికిత్స తీసుకోవాలి. తర్వాత ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గంట నుంచి గంటన్నర సమయం పాటు ఈ పరికరాన్ని ఉపయోగించాలి.
ఈ జాగ్రత్తలన్నీ నేర్చుకుని, అనుసరించడం కోసం ఆస్పత్రిలో వైద్యుల దగ్గర 8 రోజుల పాటు శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించగలిగితే లింఫోడీమాను 70ు నుంచి 80ు వరకూ తగ్గించవచ్చు. అయితే వాపు తగ్గినా కంప్రెషన్ గార్మెంట్స్ జీవితాంతం వాడుతూనే ఉండాలి.
ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్ష
లింఫోడీమాలో చర్మానికి గాయమెతే సూక్ష్మజీవులు తేలికగా ఆకర్షితమవుతాయి. దాంతో ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ అవకాశాలు ఎక్కువ కాబట్టి ఎటువంటి ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే వీలు లేకుండా ‘లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్’ తీసుకోక తప్పదు. ఈ చికిత్సలో భాగంగా తక్కువ మోతాదులో ప్రతి 21 రోజులకు ఒక ఇంజక్షన్ తీసుకోవలసి ఉంటుంది. అలాగే బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే తక్కువ ఉన్న వారితో పోలిస్తే, అంతకంటే ఎక్కువ ఉన్న వారిలో లింఫోడీమా వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవడం అవసరం.
డాక్టర్ రాజా వి. కొప్పాల,
ఫెలో ఇన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ,
ఎవిస్ హాస్పిటల్, హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 01:57 AM