Birwa Qureshis Journey: ఒక్కో కట్టడం వెనక ఒక్కో చరిత్ర ఉంది
ABN, Publish Date - Nov 30 , 2025 | 02:13 AM
ఒక గొప్ప కోటను చూసినప్పుడు గత చరిత్ర గుర్తుకొస్తుంది. భావోద్వేగం కలుగుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం అక్కడ నివసించిన వ్యక్తులు ఎలా ఉండేవారు? వారి ఆచార వ్యవహారాలేమిటి...
సండే సెలబ్రిటీ
ఒక గొప్ప కోటను చూసినప్పుడు గత చరిత్ర గుర్తుకొస్తుంది. భావోద్వేగం కలుగుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం అక్కడ నివసించిన వ్యక్తులు ఎలా ఉండేవారు? వారి ఆచార వ్యవహారాలేమిటి? సంస్కృతి సంప్రదాయాలేమిటి? ఎలాంటి దుస్తులు ధరించేవారు? ఏ భాష మాట్లాడేవారు?... ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. వాటన్నింటిపైన పరిశోధన చేసి, మళ్లీ మన కళ్ల ముందు ఆ నాటి రాజసాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న వ్యక్తి... క్రాఫ్ట్ ఆఫ్ ఆర్ట్‌కు చెందిన బిర్వా ఖురేషి. వచ్చే నెల 12న గోల్కొండ కోటలో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలలోకి వెళ్తే..
చరిత్రపై మీకు ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది?
ఎలా ఏర్పడింది?
నాన్నగారు దేశంలో పెద్ద ఆర్టిటెక్ట్‌లలో ఒకరు. చిన్నప్పటి నుంచి నేను ఆర్కిటెక్ట్ అవ్వాలనున్నా. నాకు ఆర్కిటెక్చర్‌తో పాటు కళలన్నా చాలా ఇష్టం. అందుకే భరతనాట్యం కూడా నేర్చుకున్నా. మన భారతీయ సంస్కృతిలో కళలకు.. కట్టడాలను ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దేశం నలుమూలలా అనేక కోటలు, కట్టడాలు ఉన్నాయి. ఒకో కట్టడం వెనక ఒకో చరిత్ర ఉంది. ఇవన్నీ మన గత వైభవ గర్వ చిహ్నాలు. ఆ చరిత్ర చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈతరం పిల్లలకు మన ఘన చరిత్ర గురించి చెప్పటానికి 16 ఏళ్ల క్రితం అహ్మదాబాద్‌లో నేను తొలి సారి ఈ ఫెస్ట్‌వెల్‌ను నిర్వహించాను. ఇక గోల్కొండ కోట విషయానికి వస్తే 2019 నుంచి ఈ కట్టడానికి సంబంధించిన పరిశోధన ప్రారంభించాను. కొన్ని వందలసార్లు వచ్చాను. అనువణువూ తెలుసుకున్నాను. ఆరేళ్ల తర్వాత వచ్చే నెల ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం.
ఇప్పటిదాకా మీరు అనేక ఫెస్టివల్స్ నిర్వహించారు. వీటిలో హరప్పా నాగరితకు చెందిన ధోలోవీరా ఫెస్టివల్ ఒకటి. మనకు హరప్పా సంస్కృతి గురించి కొంతే తెలుసు. ఈ ఫెస్టివల్‌ను నిర్వహించటానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది?
హరప్పా నాగరిత ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పటానికి ఽధోలోవీరా ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఏ నాగరికతైనా పరిఢవిల్లాలంటే నీరును జాగ్రత్తగా వాడుకోవాలి. మనకు ధోలోవీరాలో ఒక రిజర్వాయర్ కనిపిస్తుంది. అంతే కాకుండా ఉత్తర ప్రాంతంలో ఒక పెద్ద గేటు ఉంటుంది. దానిపై హరప్పా లిపిలో కొన్ని అక్షరాలు కనిపిస్తాయి. ఈ అక్షరాల వెనకున్న అర్ధాన్ని ఇప్పటి దాకా కనుక్కొలేకపోయారు. ఇక తూర్పు దిశ కూడా ఒక గోడ మనకు కనిపిస్తుంది. అక్కడే కొంత ఎత్తులో వర్తులాకారంలో నిర్మించిన గుడిసెల ఆనవాళ్లు కనిపిస్తాయి. అక్కడ నుంచి చూస్తే మొత్తం ధోలోవీరా అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ధోలోవీరాలో పురాతత్వ శాస్త్రవేత్తలు కొన్ని తవ్వకాలే జరిపారు. ఇంకొన్ని జరపాల్సి ఉంది. ఇప్పటి దాకా తవ్వకాలు జరిపిన ప్రాంతంలో మేము ఫెస్టివల్ నిర్వహించాం. ఐదువేల ఏళ్ల క్రితం మనుషులు సంచరించిన ప్రాంతంలో మనం ఒక ఉత్సవాన్ని చేసుకోవటం మరిచిపోలేని అనుభవం. ఈ ఫెస్టివల్‌లో అనేక మంది కళాకారులు పాల్గొన్నారు. హరప్పా నాగరికతకు చిహ్నాలుగా కొన్ని ప్రాంతాల్లో దొరికిన పూసలను చెబుతారు. అలాంటి పూసలను వంశపారంపర్యంగా తయారుచేసే ఒక వ్యక్తి గుజరాత్‌లో ఉన్నారు. ఆయన చేత అలాంటి పూసలు ఆ ఫెస్టివల్‌లో తయారుచేయిం చాం. ఇప్పటికీ ఆ ఫెస్టివల్ గురించి తలుచుకుంటుంటే అందమైన అనుభూతులే గుర్తుకొస్తాయి.
గోల్కొండ కోటతో మీ అనుబంధమేమిటి?
గోల్కొండ కోట అనగానే ఎత్తుగా, రాజసంగా.. ఎవరికీ లొంగని ఒక కోట గుర్తుకొస్తుంది. దక్షిణ భారత దేశంలో అంత చరిత్ర కలిగిన కోట మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. గోల్కొండ కోటలో నిర్మాణాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. ఆ కోటలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ కోటను చూసిన ప్రతీ సారి కొత్తగానే కనిపిస్తుంది. నేను తొలిసారి ఈ కోటను చూసినప్పుడు కలిగిన భావోద్వేగాలు ఇప్పటికీ నాకు ఇంకా గుర్తున్నాయి. ఈ ఫెస్టివల్‌ను నిర్వహించటానికి నేను ఇప్పటి దాకా కొన్ని వందల సార్లు ఈ కోటకు వచ్చి ఉంటాను. వచ్చిన ప్రతి సారి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది.
ఈ తరహా ఫెస్టివల్స్‌ను నిర్వహించటం ఎంత కష్టం?
ప్రతి కట్టడానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను చాటి చెప్పటమే ఈ ఫెస్టివల్ ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో రకరకాల సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకు అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఒక ఫెస్టివల్ నిర్వహించాం. అక్కడకి ప్రతి రోజు కొన్ని లక్షల మంది వచ్చిపోతూ ఉంటారు. అంత బిజీగా ఉండే ప్రాంతంలో ఫెస్టివల్ నిర్వహించటమనేది ఒక పెద్ద సవాల్! దీనిని నిర్వహించటం వెనక 12 ఏళ్ల శ్రమ ఉంది. మన ఉద్దేశం మంచిదైతే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. ప్రకృతి కూడా సహకరిస్తుంది.
మీకు ఇప్పటిదాకా లభించిన గొప్ప ప్రశంస ఏమిటి?
2015లో మేము గుజరాత్‌లో అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన దిగుడు మెట్ల బావి దగ్గర ఒక ఫెస్టివల్ నిర్వహించాం. కొన్ని వేల దీపాలతో దానిని అలంకరించాం. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను, నాన్న ఆ మెట్ల దగ్గర నిలబడి వాటిని చూస్తున్నాం. ఇంతలో నాన్నకు తెలిసిన ఒక జంట వచ్చారు. ‘‘పదకొండు వందల ఏళ్ల క్రితం ఈ బావిని దీపాలతో అలంకరించారని శాసనాల్లో ఉంది. మళ్లీ ఇంతకాలానికి మీ అమ్మాయి దీపాలు వెలిగించింది..’’ అన్నారు. ఆ మాటలు విన్న నాన్న కళ్లు చమర్చాయి. నాకు అంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేం ఉంటుంది.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
‘‘మేము నిర్వహించే ఫెస్టివల్స్‌లో ఉచిత ప్రవేశం ఉంటుంది. అయితే ముందు రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు ఈ ఫెస్టివల్స్‌లో పాల్గొనాలనేదే నా ఉద్దేశం. కొత్త తరం వారికి మన సంస్కృతి ఎంత గొప్పదో తెలియాలంటే ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించాలి. వాటిలో అందరూ పాల్గొనాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 30 , 2025 | 02:14 AM