Uttara Dwara Darsha: ఆ దర్శనం... ఒక విజ్ఞాన విశేషం
ABN, Publish Date - Dec 26 , 2025 | 06:11 AM
ఎన్నో కోట్ల విలువైన భవనాలు, ఎంతో వ్యయం చేసి చదువుకొన్న ఉద్యోగులు, ఎన్నెన్నో లక్షల ఖరీదైన పరికరాలు, ఇతర సర్వ సౌకర్యాలు ఏర్పాటయ్యాక మాత్రమే పరిశోధనలు జరుగుతున్నాయి...
ఎన్నో కోట్ల విలువైన భవనాలు, ఎంతో వ్యయం చేసి చదువుకొన్న ఉద్యోగులు, ఎన్నెన్నో లక్షల ఖరీదైన పరికరాలు, ఇతర సర్వ సౌకర్యాలు ఏర్పాటయ్యాక మాత్రమే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ భౌతిక పరిశోధనలు మాత్రమే. ఇవన్నీ పాశ్చాత్య దేశాల పద్ధతుల ప్రకారం జరిగేవే. మన భారతీయ ఋషులు కేవలం చెట్ల కింద కూర్చొని... చలిని, వానను, ఎండను లెక్క చేయకుండా, ఏ సౌకర్యాలను ఆపేక్షించకుండా... కేవలం మౌన ధ్యానం (తపస్సు) ద్వారా ఖగోళాన్నీ, అక్కడి సర్వ రహస్యాలను గ్రహించగలిగారు. దాన్నంతటినీ దైవానుగ్రహంగానే భావించారు. అలా కనుక్కున్న యదార్థ విజ్ఞాన విశేషాల్లో ఒకటి... ఉత్తర (వైకుంఠ) ద్వార దర్శనం.
ఒక్క మాట చెప్పకపోతే నాటికీ, నేటికీ భేదం అర్థం కాదు. ఇప్పుడు ఎక్స్‌రే యంత్రం ముందు నిలబడి ఫొటో తీయించుకుంటే ఎముకలు, కండరాలు లాంటి భౌతికమైనవే కనిపిస్తాయి. అదే మహర్షుల దృష్టితో చూస్తే... శరీరంలో దాగి ఉన్న 72 వేల నాడులు, షట్ (ఆరు) చక్రాలు, చక్రాలకు ఉన్న ముడులు (గ్రంథులు)... ఇలా ఎన్నెన్నో కనిపిస్తాయి. అలా పైకి కనిపించడానికి వీల్లేని, కనిపించని రెండు రంధ్రాలు మన శరీరంలో దాగి ఉన్నాయి. ఒకటి... కనుబొమల మధ్య దాగి ఉన్న ఆజ్ఞాచక్రం, రెండోది... శిరస్సు మధ్య భాగంలో దాగి ఉన్న బ్రహ్మరంధ్రం. ఈ సంగతి ఎలాంటి చదువూ లేని అమ్మమ్మలకు స్పష్టంగా తెలుసు. అందుకే ప్రతి పండుగ రోజునా అమ్మ ద్వారా బ్రహ్మరంధ్రానికి నువ్వుల నూనె పెట్టించి, మర్దన చేయించి, అక్షతలు వేసి ఆశీర్వదించేవారు. అంతేకాదు, వివాహకాలంలో జీలకర్ర బెల్లపు మిశ్రమాన్ని పెట్టే గొప్ప స్థానంగా కూడా దాన్ని మన సంస్కృతి పరిచయం చేసింది. అదే తీరులో వివాహ సమయంలో నూతన వధూవరులు దర్శించుకోవలసిన స్థానం కూడా పరస్పర భ్రూమధ్యాలు (కనుబొమల మధ్య ప్రదేశాలు) అని కూడా తెలియజేసింది. మన శరీరంలో కనిపించని రెండు ప్రదేశాల్లో ఒకటైన బ్రహ్మరంధ్రాన్ని గురించి తెలియజేసే ఏకాదశే... ఉత్తర ద్వార దర్శన ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి.
ఆ ద్వారం తెరిస్తే...
‘ఉత్’... ఎత్తులో, ‘తర’... మరింతది... ఉత్తరం. శరీరంలో ఎత్తుగా ఉన్నది, గట్టితనంతో ఉండేది శిరస్సు. ఆ ఉత్తరంలో ఉన్న శిరస్సులో మరో కనిపించనిది కూడా ఉంది. అదే ద్వారం. ‘ద్వి’... రెండైన, ‘అర’... తలుపులు ఉన్న ప్రదేశం. ఒకప్పటి రోజుల్లో ఒక రెక్క (తలుపు) ఉన్న ద్వారాలు ఉండేవి కావు. మనలో రెండు రెక్కలు ఉన్న ద్వారం ఒకటి ఉంది... శిరస్సులోని బ్రహ్మరంధ్రంలో. ఎక్కడైనా అతి ముఖ్యము, ప్రధానము అయిన వస్తువు ఉన్నప్పుడే కదా... ద్వారాన్ని ఏర్పరిచి భద్రత కల్పిస్తాం. ఆలయంలో రెండు అరలనూ (తలుపులను) తెరిచి చూస్తే దానిలో మనకు ఇష్టమైన దైవం కనిపిస్తాడు. అలాగే ఈ శరీరపు ఉత్తర భాగమైన బ్రహ్మరంధ్రంలోని తలుపులను తెరిచి ఏ దైవాన్ని దర్శించే వీలు పొందగలమో... ఆ విశేషాన్ని చెప్పేది, చెప్పి ప్రతి వ్యక్తికీ అనుభవైకంగా అర్థమయ్యేలా వివరించేది ఉత్తర ద్వార దర్శనం.
ఆ దిగులు అవసరం లేదు...
దేవాలయాల్లో ఉత్తరం వైపు నుంచి దైవాన్ని చూపిస్తూ ఆ దర్శనాన్ని ‘ఉత్తర ద్వార దర్శనం’ అని చెప్పారు. దీనికి కారణం... అంతకన్నా వివరించే మార్గం మరొకటి లేదు కాబట్టి. ఆ రోజున దైవాన్ని అలా దర్శించలేనివారు దిగులు పడనక్కరలేదని భగవద్గీత సవివరంగా చెప్పింది.
సమకాయ శిరోగ్రీవం ధారయన్మచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్
ఎవరి ఇంట్లో వాళ్ళు తూర్పు దిక్కుగా నేల మీద బాసింపట్టు వేసుకొని కూర్చోవాలి. శరీరపు వెన్నెముకను, మెడను, తలను ఒకే లంబాకారంలో ఉంచి నిటారుగా కూర్చోవాలి. శరీరం కదలకుండా, మనసు ఎటూ పోకుండా కట్టడి చేసుకోవాలి. దృష్టిని పైకి నిలిపి, ఆ దైవం మన శిరస్సులోనే ఉన్నాడని విశ్వసిస్తూ, మెల్లగా బ్రహ్మరంధ్రాన్ని, దాని రెండు తలుపులను తెరుస్తున్నట్టు భావించుకోవాలి. ఆ లోపల ఎవరికి ఇష్టమైన దైవాన్ని వారు అంతరంగంలో నిలుపుకొని, ఆయనకు చెందిన స్తోత్రాలను, మంత్రాలను, పద్యాలను, పాటలను, కీర్తలను... ఇలా ఎవరికి ఏది వస్తే వాటిని మౌనంగా పఠించుకుంటూ, మనస్సు నిలబడినంతసేపు అంతరాల్లో దైవాన్ని దర్శించుకోవాలి. దేవాలయాల్లో రద్దీ, అరుపులు, కేకల మధ్య ఏకాగ్రత కుదరడం కష్టం. కాబట్టి మన ఇంట్లోనే మనం ఇలా చేసుకోగలిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. నిర్మలంగా, ఏకాంతంగా, ప్రశాంతంగా... ఇలా ఉత్తర ద్వార దర్శన అనుభవాన్ని పొందండి. ఆలయంలో ఏడాదికి పది రోజులు మాత్రమే ఈ దర్శనం. కానీ ఇంట్లో మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శించుకోవచ్చు.
-డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు
9866700425
Updated Date - Dec 26 , 2025 | 06:11 AM