The Eternal Mother Within: జన్మజన్మల మాతృమూర్తి
ABN, Publish Date - Dec 26 , 2025 | 06:22 AM
సమస్త విశ్వానికి సృష్టికర్తలు సదాశివుడు, ఆదిశక్తి. వారు ఆది దంపతులు. వారు చేపట్టిన సృష్టిలో భాగంగా మానవ ఆవిర్భావం జరిగింది. పరమాత్మ తనకు ప్రతిబింబంగా....
సమస్త విశ్వానికి సృష్టికర్తలు సదాశివుడు, ఆదిశక్తి. వారు ఆది దంపతులు. వారు చేపట్టిన సృష్టిలో భాగంగా మానవ ఆవిర్భావం జరిగింది. పరమాత్మ తనకు ప్రతిబింబంగా మనిషిని తయారు చేశాడు. మానవ శరీరంలో ఆత్మను, కుండలినిని అమర్చాడు. సదాశివుని చిహ్నంగా ఆత్మ హృదయ స్థానంలో, ఆదిశక్తి చిహ్నంగా కుండలిని వెన్నెముక కింది భాగంలోని త్రికోణాకారం అస్థికలో స్థిరపడ్డాయి. దాన్నే ‘మూలాధారం’ అన్నారు. ఆదిశంకరులు ‘సౌందర్యలహరి’లో దీని గురించి ప్రస్తావించారు. ఆదిశక్తి అంశ అయిన కుండలినీ శక్తిలోనే మన గత జన్మల స్మృతులు, అనుభవాలు... నిగూఢంగా భద్రపరిచి ఉన్నాయి.
ఆత్మసాక్షాత్కారం ద్వారా...
భౌతికపరంగా చెప్పాలంటే... తల్లి గర్భంలో శిశువు రెండుమూడు నెలల పిండ దశలో ఉన్నప్పుడే... తల మాడు భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తి ఆ శిశువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. పట్టిక ఆకారంలో ఉన్న శిరస్సులో అది పరావర్తనం చెందుతుంది. మూడు నాడులుగా, ఏడు చక్రాలుగా ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం వాటితో అనుసంధానమై ఉంటుంది. అలా ఏర్పడగా మిగిలిన శక్తి మన వెన్నెముక కింది భాగంలో... మూలాధారంగా పిలిచే త్రికోణాకార అస్థికలో నిద్రాణ స్థితిలో స్థిరపడి ఉంటుంది. అదే ‘కుండలినీ శక్తి’ అని వేల ఏళ్ళ క్రితమే మన శాస్త్రాలు చెప్పాయి. సదాశివుడి ఇచ్ఛాశక్తి ఆదిశక్తి. ఆదిశక్తి ఇచ్ఛాశక్తి కుండలినీ శక్తి. కుండలినిని ఉత్థానం చేయడం వల్ల హాని కలుగుతుందని కొందరు అపోహపడతారు. కానీ ఆమె జన్మజన్మలుగా మనతోనే ఉన్న మన మాతృమూర్తి. మన ఆధ్యాత్మిక ఎదుగుదల చూసి ఆమె ఆనందిస్తుంది. పరమాత్మతో మనల్ని కలపడానికి ప్రయత్నిస్తుంది. శ్రీమాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించిన సహజయోగంలో ఆత్మసాక్షాత్కారం ద్వారా... మనలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి ఉత్థానం సునాయాసంగా జరుగుతుంది. అది జరిగినప్పుడు మన ఆత్మ ప్రకాశవంతమౌతుంది. ఆ కాంతిలో మనం కేవలం ‘ఆత్మ స్వరూపులం’ అనే సత్యాన్ని గ్రహిస్తాం. మనల్ని మనం సరిదిద్దుకోవడంతో పాటు అన్నివిధాలుగానూ పరివర్తన చెందుతాం.
మనలోని భగవంతుని సూక్ష్మ కుండలినీ శక్తిని తిరిగి జాగృతం చేసి, తద్వారా సహస్రార చక్రం ఛేదించి, బాహ్యపరంగా ఉన్న పరమాత్మ ప్రేమ శక్తి అయిన పరమ చైతన్యానికి అనుసంధానం చేయడమే ఆత్మసాక్షాత్కారం. అది పూర్వం వందల ఏళ్ళ తపస్సు చేసిన తరువాత మాత్రమే లభించేది. కానీ సహజయోగ ఆవిష్కరణతో సునాయాసంగా సాధించడం సాధ్యమవుతోంది. దీనికి కావలసిందల్లా ఆత్మసాక్షాత్కారం పొందాలనే దృఢ సంకల్పం, అచంచల విశ్వాసం, భగవంతునితో ఏకీకృతం కావాలనే పవిత్రమైన, లోతైన ఇచ్ఛ మీ హృదయంలో ఉండడమే.
Updated Date - Dec 26 , 2025 | 06:22 AM