Interior design: ఇంటిని అందంగా మార్చేద్దాం
ABN, Publish Date - Nov 13 , 2025 | 06:13 AM
సామాన్లను క్రమపద్ధతిలో సర్దుకుని కొంత సృజనాత్మకత జోడిస్తే చిన్న ఇంటిని కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంత చిన్న ఇంటినైనా అపురూపంగా తీర్చిదిద్దే చిట్కాల గురించి తెలుసుకుందాం...
సామాన్లను క్రమపద్ధతిలో సర్దుకుని కొంత సృజనాత్మకత జోడిస్తే చిన్న ఇంటిని కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంత చిన్న ఇంటినైనా అపురూపంగా తీర్చిదిద్దే చిట్కాల గురించి తెలుసుకుందాం...
వస్తువులను గోడవారగా, గది మూలల్లో నేలపై పెట్టకూడదు. పుస్తకాలు, బొమ్మలు, బట్టలు, గాజు లేదా పింగాణి సామాగ్రిని అరల్లో చక్కగా సర్దుకోవాలి. ఇంట్లో అరలు ఎక్కువగా లేకపోతే స్టాకింగ్ బోర్డులు, ప్లాస్టిక్ ఫోల్డబుల్ అల్మారాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇంట్లోకి గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. దీనివల్ల ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. విద్యుత్ బల్బులు అమర్చడానికి వీలులేనిచోట నేలపై స్కాన్ ల్యాంప్స్ ఏర్పాటు చేసుకుంటే ఇల్లు ప్రకాశవంతంగా ఉంటుంది. ఇంటి పై కప్పు ఎత్తుగా ఉంటే లాకెట్ దీపాలు వేలాడదీసుకోవచ్చు. టేబుల్ ల్యాంప్‌లు పెట్టుకున్నా ఇల్లు అందంగా మెరుస్తుంటుంది. వంటగది, హాల్, పిల్లలు చదువుకునేచోట, వాకిట్లో ఎక్కువ వెలుతురు వచ్చే లైట్లను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.
బయటి గోడలకు సున్నానికి బదులు అందమైన ముదురు రంగులు వేయిస్తే ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే లోపలి గోడలకు ఒకే రంగును కాకుండా రెండు లేదా మూడు రంగులు ఉండేలా చూసుకుంటే ఇంటి అందం పెరుగుతుంది. ఇంట్లో ఉండే ఫర్నిచర్‌కు నప్పేలా గోడ రంగులు ఎంచుకోవాలి.
కిటికీలకు చెక్క తలుపులకు బదులు అద్దాలు అమర్చుకుంటే ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. అలాగే కిటికీలకు ఎదురుగా ఇంట్లో అద్దాలు పెట్టుకున్నా చూడడానికి బాగుంటుంది.
Updated Date - Nov 13 , 2025 | 06:13 AM