Shweta Nicholas Telugu Influencer: పడమట శ్వేతా రాగం
ABN, Publish Date - Oct 01 , 2025 | 05:24 AM
‘నిన్ను తొలిచూపులోనే ప్రేమించేశా’ అన్నప్పుడు అతన్ని నమ్మలేకపోయింది. ‘డేటింగ్ చేయను పెళ్లాడతా’ అన్నప్పుడు కాస్త మెత్తబడింది. ‘అందర్నీ ఒప్పించి పెళ్లాడతా’ అన్నప్పుడు మరో ఆలోచన లేకుండా....
‘నిన్ను తొలిచూపులోనే ప్రేమించేశా’ అన్నప్పుడు అతన్ని నమ్మలేకపోయింది. ‘డేటింగ్ చేయను పెళ్లాడతా’ అన్నప్పుడు కాస్త మెత్తబడింది. ‘అందర్నీ ఒప్పించి పెళ్లాడతా’ అన్నప్పుడు మరో ఆలోచన లేకుండా పెళ్లికి తల వంచేసింది. అలా వెంటపడి, పట్టుబట్టి పెళ్లాడిన అబ్బాయి ‘నికొలస్’ అమెరికన్ అయితే, అతన్ని తొలి చూపులోనే గెలుచుకున్న మన తెలుగమ్మాయి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ ‘శ్వేత’ కావడం విశేషం. ఊహకందనంత వేగంగా మలుపు తిరిగిన తన జీవితం గురించీ, తెలుగు భాషనూ, వంటలనూ, ప్రదాయాలనూ ఇష్టపడే భర్త నిక్ గురించి, టెక్సా్‌సలో స్థిరపడిన ‘రమిణి శ్వేత నికొలస్ అర్నీని’ నవ్యకు ఇలా వివరించింది...
అమెరికాలో చదువు అనగానే, అది సంపన్నులకే సాధ్యపడుతుందని అనుకుంటారు. కానీ నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఎలాగైనా అమెరికాలో ఉన్నత చదువు చదవాలనే కోరిక బలంగా ఉండేది. కానీ నాన్న అందుకు ఒప్పుకోరు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కాబట్టి కలను నిజం చేసుకోవాలంటే కష్టాన్నే నమ్ముకోవాలని నిర్ణయించుకున్నాను. అలా పగటివేళను చదువుకూ, రాత్రివేళను ఉద్యోగానికీ కేటాయించాను. కొద్దికొద్దిగా డబ్బు కూడబెట్టుకుంటూ, సాధ్యమైనంతగా పొదుపు చేసుకుంటూ క్యాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలోలో ఎమ్‌బిఎ చదువు కోసం దరఖాస్తు చేసుకున్నాను. మొదటి ప్రయత్నంలోనే సీటొచ్చేసింది. అయితే వీసా వచ్చేవరకూ ఇంట్లో చెప్పకూడదని అనుకున్నాను. అలా వీసా వచ్చిన తర్వాత ఇంట్లో చెప్పినప్పుడు అమ్మా నాన్న నిర్ఘాంతపోయారు. నిజానికి వీసా ఖర్చులకూ, ఫ్లైట్ టిక్కెట్‌కు అవసరమైన డబ్బును మాత్రమే దాచలిగాను. ఆ తర్వాత ఏం చేయాలో స్పష్టత లేకుండానే ప్రయాణానికి సిద్ధపడిపోయాను. కానీ చివరి నిమిషంలో అమ్మ మొదటి సెమెస్టర్‌కు అవసరమైన డబ్బును సమకూర్చి అందించింది.
అలా ఓ పక్క భయంతో, మరోపక్క ఆనందంతో 2014లో అమెరికాలో అడుగుపెట్టాను. చదువు సాగినంత కాలం సొంత ఖర్చులు, చదువు కోసం రేయింబవళ్లూ కష్టపడ్డాను. సబ్‌వే రెస్టారెంట్లు, ఇండియన్ రెస్టారెంట్లు... ఇలా వీలున్న ప్రతి చోటా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ 12 నుంచి 14 గంటల పాటు పని చేశాను. అలా ఇంట్లో ఒక్క రూపాయి అడగకుండా చదువు పూర్తి చేయగలిగాను. కొన్నిసార్లు ఇంటికి కూడా డబ్బు పంపించాను. అలా చివరకు 2016లో ఐటి సబ్జెక్టు కలిగిన ఎమ్‌బిఎ డిగ్రీ సాధించాను. ఆ తర్వాత ఏడాదిలోపే శామ్‌సంగ్‌లో ఉద్యోగం వచ్చేసింది. మొదటి ఉద్యోగం బోస్టన్‌లో. దగ్గర్లోని మాంచెస్టర్‌లో ఉన్న స్నేహితురాలిని తరచూ కలుస్తూ ఉండేదాన్ని. 2019లో ఓ పుట్టిన రోజు వేడుక కోసం మాంచెస్టర్ బయల్దేరినప్పుడు, అక్కడొక అద్భుతమైన వ్యక్తిని కలవబోతున్నట్టు నాకు తెలియదు.
తొలిచూపులోనే ప్రేమ
ఆ పార్టీలో నికొలస్ తప్ప మిగిలిన వాళ్లందరూ భారతీయులే! దాంతో నా స్నేహితులందరూ నిక్‌ను చుట్టుముట్టి అతన్ని సరదాగా ఆట పట్టించడం మొదలుపెట్టారు. నేను స్వతహాగా సిగ్గరిని కాబట్టి అదేమీ పట్టించుకోకుండా ఓ సోఫాకి పరిమితమై కూర్చుండిపోయాను. కానీ నిక్ అంతమంది అమ్మాయిలను వదిలేసి నా దృష్టిలో పడే ప్రయత్నం చేస్తూ, మాటలు కలపడం మొదలుపెట్టాడు. మొదట్లో భయపడి, దూరంగా పారిపోయాను. ఆ తర్వాత ఇంట్లో నాకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నట్టు స్నేహితుల ద్వారా తెలుసుకున్న నిక్, నన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పి, ఒక కాగితం మీద తన ఫోన్ నంబర్ రాసిచ్చి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నా స్నేహితులు నన్ను అనుకరిస్తూ, నా ఫోన్ నుంచి అతనికి మెసేజెస్ పెడుతూ అతన్ని లంచ్‌కి పిలిచారు. ఆ లంచ్‌లో నిజం తెలిసినప్పటికీ, ఆయన ఏమాత్రం కోపగించుకోకుండా, నేరుగా పెళ్లి ప్రస్థావన తీసుకొచ్చారు. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. కానీ తర్వాత ఆలోచించి, అతని ప్రేమను, ప్రపోజల్‌నూ అంగీకరించాను. ఆ తర్వాత రెండు వారాలకే మా పెళ్లి జరిగిపోయింది. నిజానికి మా పెళ్లికి ఎంతోమంది ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ అమ్మ మాత్రం, ‘నువ్వు ప్రేమించే వ్యక్తికి బదులుగా, నిన్ను ప్రేమించే వ్యక్తిని చేసుకుంటే సుఖపడతావు’ అంటూ ప్రోత్సహించింది. అమ్మ చెప్పిందే నిజమైంది.
కొడుకు లేని లోటు తీర్చి...
నిక్ జీవితం, నా జీవితం ఒక లాంటివే! జీవితంలో పైకి ఎదగడం కోసం నేనెన్ని కష్టాలు పడ్డానో, నిక్ కూడా అంతకంటే ఎక్కువ కష్టాలే పడ్డాడు. 13 ఏళ్ల వయసులోనే తల్లితండ్రులను కోల్పోవడంతో మంచి కుటుంబం కావాలని కోరుకున్నాడు. మా అమ్మానాన్నలను తన అమ్మానాన్నల్లా ప్రేమించాడు. ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకు మన తెలుగు భాష, సంప్రదాయాలు, వంటలంటే ఎంతో ప్రాణం. ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడమంటాడు. టివిలో కూడా తెలుగు కార్యక్రమాలే చూపించమంటాడు. తాను కూడా కష్టపడి తెలుగు నేర్చుకున్నాడు. ప్రస్తుతం కొద్దికొద్దిగా మాట్లాడగలుగుతున్నాడు. ఓసారి నాకు తెలియకుండానే అమ్మానాన్నలను అమెరికాకు పిలిపించి నన్ను సర్‌ప్రైజ్ చేశాడు. అమ్మను షాపింగ్‌కు తీసుకువెళ్లి నచ్చివన్నీ కొనిపెట్టాడు. చెప్పుల షాపులో అమ్మ కాళ్లకు తానే స్వయంగా బూట్లు తొడిగినప్పుడు మా అందరి కళ్లూ చెమర్చాయి. ఫోన్లో గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఇన్‌స్టాల్ చేయించి, దాన్నెలా వాడుకోవచ్చో అమ్మకు నేర్పించాడు. అలా అమ్మా, నిక్ ఎంతో బాగా కలిసిపోయారు. కొడుకు లేని లోటు తీర్చాడని అమ్మ ఎంతో మురిసిపోతూ ఉంటుంది. మనది వినూత్నమైన జంట అంటూ నా చేత ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేయించాడు. అకౌంట్ క్రియేట్ చేసిన రెండు నెలలకే ఏకంగా 27 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకోగలిగాం! కొందరు ప్రముఖులు మా జంటను అభినందిస్తూ మెసేజ్‌లు పెట్టారు.
గోగుమళ్ల కవిత
మాది హైదరాబాద్. అక్కడే పుట్టి పెరిగాను. నాన్న రామకృష్ణ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. అమ్మ సంధ్యారాణి ప్రస్తుతం గృహిణి. భర్త నిక్, సైన్యంలో ఐటి డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం నేను యుఐ డెవలపర్‌గా ఇంటి నుంచే పని చేస్తున్నాను. మాకు ముగ్గురు పిల్లలు. మొదటి బాబు అయాన్ష్‌కు నాలుగేళ్లు. రెండో వాడు, అరిహాన్‌కు రెండేళ్లు. పాప ఆష్నాకు ఏడాది వయసు. నాకొక అక్క కూడా ఉంది. పేరు దివ్య. తాను కూడా ఇక్కడే స్థిరపడింది.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం
Updated Date - Oct 01 , 2025 | 05:24 AM