ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెనోపాజ్‌కు ముందస్తుగానే సర్వసన్నద్ధం

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:51 AM

కాబట్టి మహిళలు దాన్నొక సహజసిద్ధ మార్పుగా అంగీకరించి సర్దుకుపోతూ ఉంటారు. కానీ నడి వయసులో సైతం మునుపటి చురుకుదనం తగ్గకుండా ఉండాలన్నా, దీర్ఘకాలం పాటు అంతర్గత అవయవాలన్నీ...

హెచ్‌ఆర్‌టి

నడివయసులో నెలసరి ఆగడం సహజమే!

కాబట్టి మహిళలు దాన్నొక సహజసిద్ధ మార్పుగా అంగీకరించి సర్దుకుపోతూ ఉంటారు. కానీ నడి వయసులో సైతం మునుపటి చురుకుదనం తగ్గకుండా ఉండాలన్నా, దీర్ఘకాలం పాటు అంతర్గత అవయవాలన్నీ నిక్షేపంగా ఉండాలన్నా

‘హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ’ని ఆశ్రయించక తప్పదు.

ఆయుర్దాయం పెరిగింది. కాబట్టి మహిళల నడి వయసు 45 నుంచి 60 ఏళ్లకు పెరిగింది. ఇది సంతోషించవలసిన విషయమే! అయితే పిల్లల బాధ్యతలు తగి,్గ కాస్త సేద తీరదామనుకునే ఈ వయసులోనే మహిళల మీద మెనోపాజ్‌ అనే అతి పెద్ద పిడుగు పడుతూ ఉంటుంది. ఒళ్లంతా ఆవిర్లు, చమటలు పట్టడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, నిస్సత్తువ, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, నీరసం, భావోద్వేగాలు అదుపు తప్పడం... లాంటి అసౌకర్యాలన్నీ ఒక్కసారిగా నడి వయసు మహిళలను అతలాకుతలం చేయడం మొదలుపెడతాయి. ఎక్కువ మంది మహిళలు ఇవన్నీ పైబడే వయసులో మామూలే అని సర్దుకుపోతూ ఉంటారు. కానీ మెనోపాజ్‌ లక్షణాలు భౌతికంగా మాత్రమే వేధిస్తున్నాయనుకుంటే పొరపాటు. ఈ మెనోపాజ్‌ దశ, ఎముకలు, కండరాలు, జననావయవాలు, గుండె మొదలైన అవయవాలన్నిటినీ దెబ్బతీస్తుంది. అప్పటివరకూ ఆయా అవయవాలకు రక్షణ కల్పించే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ పరిమాణాలు మెనోపాజ్‌తో క్షీణించడమే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితిని తప్పనిసరిగా భరించవలసిన అవసరం ఏమాత్రం లేదు.

పెరి మెనోపాజ్‌లోనే మొదలుపెట్టాలి

మెనోపాజ్‌ దశకు ముందు, నెలసరి స్రావం తగ్గడం, నెలసరి క్రమం తప్పడం, ఒంటి నుంచి వేడి ఆవిర్లు వెలువడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మెనోపాజ్‌ ముందరి దశ అయిన పెరి మెనోపాజ్‌. ఈ పెరి మెనోపాజ్‌ దశ నుంచే ‘హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ’ మొదలుపెట్టాలి. ఈ థెరపీని పదేళ్ల వరకూ కొనసాగించవచ్చు. శరీరంలో తగ్గిన హార్మోన్‌ పరిమాణాలను భర్తీ చేసే ఈ చికిత్సతో, మెనోపాజ్‌ అసౌకర్యాలకు అడ్డుకట్ట పడడంతో పాటు, అంతర్గత అవయవాలన్నీ దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మెనోపాజ్‌కు చేరుకుని, ఐదు నుంచి పదేళ్ల కాలం గడిచిపోయిన వాళ్లకు ఈ థెరపీతో అంతగా ప్రయోజనం ఉండదు. అన్నేళ్ల పాటు హార్మోన్ల లోపం ప్రభావానికి గురైన అవయవాలు ఈ థెరపీతో మళ్లీ కోలుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి పెరి మెనోపాజ్‌లో, లేదంటే మెనోపాజ్‌కు చేరుకున్న రెండేళ్ల లోపే థెరపీ మొదలుపెట్టుకోవాలి. అయితే కొందరికి మెనోపాజ్‌లో ఆలస్యంగా లక్షణాలు బయల్పడవచ్చు. అలాంటి వాళ్లకు ఈ థెరపీ ప్రయోజనకరంగా ఉంటుంది. పదేళ్లుగా మెనోపాజ్‌లో ఉండి, ఎముకలు, కండరాల నొప్పులు, నిస్సత్తువ లాంటి లక్షణాలతో బాధపడుతున్నవాళ్లు హెచ్‌ఆర్‌టికి బదులు, లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకుని, పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

హెచ్‌ఆర్‌టితో ప్రయోజనాలు

  • పెరి మెనోపాజ్‌లోనే హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ మొదలుపెడితే...

  • యోని పొడిబారే సమస్య తొలగిపోతుంది

  • మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు అదుపులోకొస్తాయి

  • లైంగిక జీవితం మెరుగుపడుతుంది

  • గుండెకు రక్షణ దక్కుతుంది

  • ఎముకలు దృఢంగా ఉంటాయి

  • జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది

ఈ పరీక్షలు తప్పనిసరి

హార్మోన్‌ థెరపీతో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుందనే అపోహలు ప్రచారంలో ఉండడంతో మహిళలు వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ థెరపీ విషయంలో వైద్యులు కొన్ని ప్రమాణాలను పాటిస్తూ ఉంటారు. ముందస్తు పరీక్షలతో, క్రమం తప్పని పర్యవేక్షణతో క్యాన్సర్‌ ముప్పు దరి చేరే అవకాశాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ థెరపీకి ముందు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి.

అవేంటంటే...

  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించే పాప్‌స్మియర్‌

  • ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ను గుర్తించే అలా్ట్రసౌండ్‌ పరీక్ష

  • రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే మామోగ్రామ్‌

  • లిపిడ్‌ ప్రొఫైల్‌

  • థైరాయిడ్‌ పరీక్ష

  • కాలేయ పనితీరు పరీక్ష

  • ఎముకల దృఢత్వాని పరీక్షించే డెక్సా స్కాన్‌

  • కండరాల పటుత్వానికి సంబంధించిన పరీక్ష

కుటుంబ చరిత్రలో క్యాన్సర్‌ ఉంటే?

కుటుంబ చరిత్రలో క్యాన్సర్‌ ఉంటే ఈ థెరపీని ఇవ్వలేని పరిస్థితి మునుపు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. కుటుంబంలో క్యాన్సర్‌ ఉన్నప్పటికీ, నిర్దిష్ట మహిళకు క్యాన్సర్‌ లేనప్పుడు, కచ్చితంగా థెరపీ తీసుకోవచ్చు. అయితే ఈ చికిత్స తీసుకుంటున్నంత కాలం ప్రతి మహిళా క్రమం తప్పకుండా వైద్యులు సూచించే స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రొమ్ముల పరీక్ష, మామోగ్రామ్‌, అలా్ట్రసౌండ్‌ పరీక్షలు ప్రతి ఏటా చేయించుకోవాలి.

హెచ్‌ఆర్‌టి ఇలా...

మాత్రలు, ప్యాచెస్‌, చర్మం అడుగున అమర్చే వీలుండే ఇంప్లాంట్స్‌ రూపాల్లో హెచ్‌ఆర్‌టి తీసుకోవచ్చు. శరీర తత్వం ఆధారంగా ఒక్కొకరికి ఒక్కొక చికిత్స సరిపడుతుంది. మాత్రలతో పోలిస్తే ప్యాచెస్‌, ఇంప్లాంట్స్‌తో దుష్ప్రభావాలు తక్కువ. ఆరోగ్య కారణాలతో గర్భాశయాన్ని తొలగించిన మహిళలు ప్యాచెస్‌, లేదా ఈస్ట్రోజన్‌ మాత్రలు వాడుకోవచ్చు. కానీ గర్భాశయం కలిగి ఉన్న మహిళలకు ఈస్ట్రోజన్‌తో పాటు ప్రొజెస్టరాన్‌ కూడా అవసరమవుతుంది కాబట్టి రెండు రకాల మాత్రలు వాడుకోవాలి. కేవలం ఈస్ట్రోజన్‌ మాత్రమే అవసరమున్న మహిళలు, ఖర్చును భరించే స్థోమత కలిగినవాళ్లు ప్యాచెస్‌ వాడుకోవచ్చు.

కుటుంబంలో వైద్యపరమైన సహాయాన్ని అందుకునే సభ్యుల వరుసలో మహిళలు చివర్లో ఉంటారు. మొత్తం కుటుంబ అవసరతలను కనిపెట్టుకుని ఉండే మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ ధోరణికి చరమగీతం పలకాలి. మరీ ముఖ్యంగా హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ పట్ల మహిళల్లో భయాలను పెంచి, ఆ చికిత్సతో అందే ప్రయోజనాలను దక్కకుండా చేయడం కూడా సరి కాదు. కీలకమైన అంతర్గత అవయవాలన్నిటినీ ఆరోగ్యంగా ఉంచే ఈ థెరపీని తీసుకోగలిగితే, ప్రతి మహిళా తన నడి వయసును చలాకీగా, ఆరోగ్యంగా, ఆనందంగా గడపగలుగుతుంది.

ప్రస్తుతం మన ఆయుష్షు పెరిగింది. దాంతో జీవిత దశల నిడివి, పరిభాష కూడా మారింది. మునుపు 45 నుంచి 50 ఏళ్లను నడి వయసుగా పరిగణించేవారు. కానీ ప్రస్తుతం, నడివయసు నిడివి 45 నుంచి 65 ఏళ్లకు పెరిగింది. ఫలితంగా 1/3 వంతు జీవితాన్ని మహిళలు మెనోపాజ్‌లోనే గడపవలసి ఉంటుంది. కాబట్టి ఆ జీవితాన్ని చలాకీగా, ఆరోగ్యంగా గడపగలిగేలా ఉండాలి. అందుకోసం హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీని పెరి మెనోపాజ్‌ దశ నుంచి కనీసం పదేళ్ల పాటు తీసుకోవాలి.

మెనోపాజ్‌లో...

నడి వయసు మహిళల్లో కండర శక్తి తగ్గిపోతుంది. దాంతో నొప్పులు వేధించడం మొదలుపెడతాయి. సాధారణంగా ఈ నొప్పులను కీళ్ల అరుగుదలగా పొరబడుతూ ఉంటారు. కానీ కండరాలను బలపరిచే వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారశైలిని అనుసరించగలిగితే నొప్పులు అదుపులోకొస్తాయి. నడి వయసుకు చేరుకున్న కొందరికి తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు కొంత కాలం పాటు వెజైనల్‌ క్రీమ్స్‌ వాడుకోవచ్చు. అలాగే అవసరాన్ని బట్టి ఎముకలను దృఢంగా ఉంచే కొన్ని సప్లిమెంట్లు వాడుకోవాలి. వంట చేయడం, ఇంటి పనులు వ్యాయామం కోవలోకి రావు. కాబట్టి నడక లాంటి వ్యాయామాలతో పాటు బరువులను ఎత్తే వ్యాయామాలు కూడా కొనసాగించాలి. అలాగే పౌష్ఠికాహారం తీసుకోవాలి. ఎముకల మీద బరువు పడకుండా ఉండేలా వ్యాయామాలతో కండరాలను బలపరుచుకోగలిగితే కీళ్ల నొప్పులు అదుపులోకొస్తాయి.

డాక్టర్‌ ఎ.మహిత రెడ్డి

అబ్‌స్టెట్రిషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

అపోలో క్రేడిల్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 12:51 AM