Ponduru khadi GI tag khadi: పొందూరుకు కొత్త హంగు
ABN, Publish Date - Dec 17 , 2025 | 03:42 AM
స్వదేశీ వస్తువులనే వినియోగిద్దామన్న గాంధీ స్ఫూర్తితో... నేతన్నలను సంఘటితం చేయాలన్న సంకల్పంతో ఏర్పడింది... ‘ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం’. ఏడున్నర దశాబ్దాల కిందట శ్రీకాకుళం జిల్లా...
సంస్కృతి
స్వదేశీ వస్తువులనే వినియోగిద్దామన్న గాంధీ స్ఫూర్తితో... నేతన్నలను సంఘటితం చేయాలన్న సంకల్పంతో ఏర్పడింది... ‘ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం’. ఏడున్నర దశాబ్దాల కిందట శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆవిర్భవించిన ఈ సంఘం... మన్నికైన ఖాదీ వస్త్రాలను రూపొందిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది. సినీ, రాజకీయప్రముఖులను సైతం ఆకర్షిస్తూ... ఇటీవల జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ పొందిన పొందూరు ఖాదీపై ‘నవ్య’ కథనం.
నూలు వడికి... మగ్గంపై నేసే వరకు... పొందూరు ఖాదీ తయారీలో ప్రతి ప్రక్రియా చేత్తోనే జరుగుతుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత. మిషన్లు ముంచెత్తినా... ఫ్యాషన్ ప్రపంచం ఆధునికతను సంతరించుకున్నా... పొందూరు నేతన్నలు మాత్రం సంప్రదాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. గాంధీ స్ఫూర్తితో 1949-50లో ఏర్పడిన ‘ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం’... నాటి నుంచీ ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా చిత్తశుద్ధితో కళను కొనసాగిస్తోంది.
మూడు రకాలు...
పొందూరులో మూడు రకాల ఖద్దరు వస్త్రాలు... ప్రాంతీయ, ఎన్‌ఎంసీ, ఏఎంసీ ఖాదీ తయారవుతాయి. ఇందులో పాట్నూలుతో చేసిన ఖద్దరుకు ఆదరణ ఎక్కువ. దీన్నే ‘ఫైన్ ఖాదీ’ అంటారు. చేతి రుమాలు నుంచి తువ్వాళ్లు, ధోవతీలు, లుంగీలు, వెండి జరీ అంచు పంచెలు, షర్టులు, జమదానీ చీరలు ఇక్కడ రూపొందిస్తారు. అలాగే మజిలీ ఖాదీతో తయారీ చేసిన చీరలూ ప్రత్యేకమే. అప్పట్లో గాంధీ మనవడు దేవదా్‌సగాంధీ వచ్చి పొందూరు ఖాదీని పరిశీలించారు. క్రమంగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. అయితే తయారీ ఖర్చు పెరగడం... ఆశించిన కూలి రాకపోవడంతో చాలామంది నేతన్నలు ఈ వృత్తిని వదిలేశారు. కొన్ని కుటుంబాలు మాత్రం సంప్రదాయ నేత పనిని వదులుకోలేక కొనసాగిస్తూ వస్తున్నారు. భార్యా భర్తలు కలిసి మగ్గం నడిపిస్తూ కళను బతికిస్తున్నారు.
ఎంత చేసినా...
ఒకప్పుడు పొందూరులో మాత్రమే లభించే ఖాదీ... క్రమంగా శ్రీకాకుళం, పాలకొండ, చీపురుపల్లి, రాజాంలో కూడా విస్తరించింది. ఆ ప్రాంతాల్లో సేల్స్ అవుట్‌లెట్‌లు ఏర్పాటయ్యాయి. సంఘం ద్వారా తయారైన ఖాదీ వస్త్రాలను వీటిల్లో విక్రయిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ‘పొందూరు ఖాదీ’ పేరుతో 20 వేలకు పైగా దుకాణాలు వెలిశాయి. వీటికీ... సంఘంతో సంబంధం లేదు. దీనివల్ల పొందూరు నేతన్నలకు ఆదాయం తగ్గింది. అంతేకాకుండా... ఖాదీ వస్త్రాల ధరలు గణనీయంగా పెరగడంతో స్వల్పాదాయ వర్గాలు వీటికి దూరమయ్యాయి. గతంలో పొందూరు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లింది సంఘం. అదేసమయంలో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పొందూరు ఖాదీకి ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించారు. ఆయన కృషితో ఇక్కడి ఖద్దరుకు ఇటీవల ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’ (జీఐ) లభించింది. దీనిపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐదు కోట్ల టర్నోవర్...
ఒకప్పుడు సంఘంలో ఐదు వేల మంది కార్మికులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఆరొందలకు తగ్గింది. వీరిలో నేత కార్మికులు వందమంది లోపే. ఇక ఖరీదైన జమదానీ చీరలు నేసే కుటుంబాలు ఐదే ఉన్నాయి. ఈ చీరలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంతో ఇష్టం. వీటి ఖరీదు సుమారు రూ.25 వేలు. నేసినవారికి రూ. 3వేల కూలి దక్కుతుంది. చీర తయారీకి అవసరమైన సామగ్రి అంతా సంఘం సమకూరుస్తుంది. ఇక వెండి జరీ అంచు పంచెల తయారీ చాలా శ్రమతో కూడుకున్నది. పట్టు నూలు అంచు, వెండి జరీ అంచు పంచెల తయారీకి ఆరు రోజులు పడుతుంది. ఒక్కో పంచెకు రూ.1800 కూలీ దక్కుతుంది. ఫైన్ ఖాదీ వస్త్రాలను ఎక్కువగా షర్ట్‌ల కోసం వినియోగిస్తారు. మీటరు వస్త్రం తయారీకి రూ. 300 కూలి ఇస్తారు. అలా రూపొందించిన ఫైన్ ఖాదీ వస్త్రాన్ని మీటరు రెండు వేలకు విక్రయిస్తున్నారు. మజిలీ క్లాత్‌తో రూపొందించిన షర్టులు, చీరలు మరో ఆకర్షణ. మొత్తంగా ఏపీ ‘ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం’ ఏడాదికి రూ.5 కోట్ల మేర టర్నోవర్ సాధిస్తోంది.
వారందరి ఫేవరెట్...
చాలామంది రాజకీయ నాయకులు, ప్రముఖులు పొందూరు ఖాదీనే ధరిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్సార్, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఎంతో ఇష్టమైన వస్త్రం ఇది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పొందూరు ఖాదీ ధరిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంఘాన్ని నడిపిస్తున్నామని, ప్రభుత్వం చేయూతనందిస్తే ఈ చేనేత కళను నమ్ముకొని జీవిస్తున్నవారికి భరోసా కలుగుతుందని నేతన్నలు అంటున్నారు.
టి.సురే్‌షబాబు, శ్రీకాకుళం
ఫొటోలు: జోగారావు
ఇద్దరం శ్రమించినా...
సంఘం నుంచి ఇచ్చిన సామగ్రితో పాట్నూలు చొక్కా కోసం వస్త్రాన్ని తయారు చేసి ఇస్తాం. భర్త శ్రీనివాసరావు, నేను... ఇద్దరం రాత్రింబవళ్లూ శ్రమించినా ఇల్లు గడవడం కష్టంగానే ఉంటోంది. ఆర్థిక ప్రయోజనం పెంచితే మా కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలి.
ముప్పాన కమల
ఆర్థిక భద్రత కల్పించాలి
జీఐ లభించడం సంతోషదాయకమే. అయితే ఇప్పుడు కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నేతన్నలకు ఆర్థిక ప్రయోజనం, ఆర్థిక భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దీనివల్ల ఖాదీ సంఘం పటిష్టమవుతుంది. సంఘానికి రూ.30 లక్షలు రుణాలు కావాలని బ్యాంకును కోరాం. కానీ స్పందన లేదు. సంఘం భవనం మరమ్మతులకు రూ.1.5 కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విన్నవించాం. ఇంకా మంజూరు కాలేదు.
దండి వెంకటరావు, సంఘం కార్యదర్శి
Updated Date - Dec 17 , 2025 | 03:42 AM