Neeta Ambanis Stunning Pink Ball Look: పింక్ బాల్ మెరుపులు
ABN, Publish Date - Oct 26 , 2025 | 02:34 AM
నీతా అంబానీ ఫ్యాషన్ సెన్స్ కేవలం స్టయిల్స్, ట్రెండ్స్‌కు మాత్రమే పరిమితం కాదు. ఆమె దుస్తులు భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె తరచూ భారతీయ చేనేత, బనారసి, కాంజీవరం, పటోలా చీరలు ధరించి అంతర్జాతీయ వేదికల...
నీతా అంబానీ ఫ్యాషన్ సెన్స్ కేవలం స్టయిల్స్, ట్రెండ్స్‌కు మాత్రమే పరిమితం కాదు. ఆమె దుస్తులు భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె తరచూ భారతీయ చేనేత, బనారసి, కాంజీవరం, పటోలా చీరలు ధరించి అంతర్జాతీయ వేదికల పైన సందడి చేస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించినా అధునాత దుస్తుల్లో కనిపించినా ఆమె లుక్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగా చర్చనీయాంశమవుతుంది. ఆమె ఆభరణాల ఎంపిక కూడా అసాధారణంగా ఉంటుంది. మ్యాచింగ్ నగలను ధరించడంలో ఆమెకు ఆమే సాటి. ఇటీవల బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన పింక్ బాల్ కార్యక్రమానికి దేశీ స్టయిల్‌లో హాజరయ్యారు నీతా. సంప్రదాయ కాంజీవరం చీర కట్టుకుని అరుదైన పచ్చలు, వజ్రాలు పొదిగిన లాంగ్ నెక్లె్‌సతో భారతదేశ వారసత్వానికి ప్రతీకగా నిలిచారు.
అందమైన చీరలో నీతా...
నీతా ధరించిన కాంజీవరం జరీ పట్టు చీర రంగు పౌడర్ పింక్. దీన్ని స్వచ్ఛమైన మల్బరీ సిల్క్, బంగారు జరీ దారాలతో రూపొందించారు. ఈ చీరను 68 ఏళ్ల మాస్టర్ వీవర్ ఆర్. వర్ధన్ తన స్వహస్తాలతో నేశారు. ఈ సంప్రదాయ కళారూపాన్ని నేయడం తన తండ్రి, తాతల నుంచి నేర్చుకున్నాననీ, ఇది తమ కుటుంబ వారసత్వ కళ అనీ ఆయన గర్వంగా చెబుతున్నారు. మెటాలిక్ సీక్విన్, జర్దోసి వర్క్‌లతో చీర బార్డర్‌ను అందంగా తీర్చిదిద్దారు. కొంగును వెండి జరీ కట్‌వర్క్‌తో అలంకరించారు. ఈ చీర మీద ఆఫ్ షోల్డర్ కోర్సెట్ బ్లౌజ్ ధరించారు నీతా. జరీ దారాలతో ఎంబ్రాయిడరీ వర్క్ చేయడంతో బ్లౌజ్‌కు రిచ్‌లుక్ వచ్చింది. చీర మీద చక్కగా మ్యాచ్ అయ్యింది. చీర కొంగుతోపాటు బ్లౌజ్‌ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.
చక్కని నెక్లెస్
నీతా అంబానీ ధరించిన లాంగ్ నెక్లెస్... ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇండోర్ మహారాణి సంయోగిత దేవి ధరించిన నెక్లె్‌సను ప్రేరణగా తీసుకుని ఎంతో ఇష్టంగా దీన్ని చేయించుకున్నారు నీతా. ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ కాంతిలాల్ చోటాలాల్ దీన్ని రూపొందించారు. నెక్లెస్ మధ్యలో పెండెంట్‌గా 70 క్యారెట్ల కొలంబియన్ పచ్చను పొదిగారు. దీనికి ఇరువైపులా 40 క్యారెట్ల పియర్ వజ్రాలను డ్రాప్స్‌గా అమర్చారు. పెండెంట్ దిగువన నిజాం కాలం నాటి 40 క్యారెట్ల గుండ్రని వజ్రాన్ని అందంగా కూర్చారు. నెక్లె్‌సకు ఇరువైపులా మరో రెండు కుషన్ కట్ వజ్రాలను సొగసుగా జోడించారు. ఈ లాంగ్ నెక్లె్‌సలో వాడిన వజ్రాలు, పచ్చలను నీతా వ్యక్తిగతంగా సేకరించుకున్నవే కావడం విశేషం. చెవులకు వజ్రాల జుంకాలు, వేలికి పెద్ద వజ్రపుటుంగరం, చేతులకు వజ్రాల గాజులతో నీతా అపురూపంగా కనిపించారు. తేలికపాటి మేకప్, అలల హెయిర్ స్టయిల్ ఆమె అందాన్ని మరింత పెంచాయి.
ఇషా కూడా...
తల్లితోపాటు హాజరైన ఇషా అంబానీ... పింక్ బాల్ ఈవెంట్‌కు సహ అధ్యక్షత వహించారు. పింక్ థీమ్‌కు తగ్గట్టు అబు జాని సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండ్ మేడ్ కోచర్ డ్రెస్‌లో మెరిసిపోయారు ఇషా. జర్దోసి వర్క్, గులాబీ రంగు ముత్యాలు, సీక్విన్స్, మెరిసే స్ఫటికాలతో డిజైన్ చేసిన స్కర్ట్‌కు జతగా బ్లష్ పింక్ చామోయిస్ శాటిన్ జాకెట్‌తో రాయల్‌గా కనిపించారు. ఈ డ్రెస్‌ను 30 మంది కళాకారులు 3670 గంటలు శ్రమించి తీర్చిదిద్దారు. చెవులకు పచ్చల జుంకాలు, మెడలో పచ్చల నెక్లెస్, వేలికి పచ్చలు పేర్చిన వజ్రపుటుంగరం, గోళ్లకు పింక్ కలర్ నెయిల్ రింగ్స్‌తో హుందాగా ఆకర్షణీయంగా నిలిచారు ఇషా.
Updated Date - Oct 26 , 2025 | 02:34 AM