ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Neeru Yadav Women Leadership: నాయకత్వానికి కొత్త అర్థం

ABN, Publish Date - Nov 17 , 2025 | 06:07 AM

నాయకుడంటే ఎలా ఉండాలి? ప్రజల మధ్యనే ఉంటూ... ప్రజల కోసం పని చేయాలి. అరుదుగా కనిపించే అలాంటి నాయకురాలే నీరూ యాదవ్‌. మగవారి ఆధిపత్యాన్ని తట్టుకొని... ఆ ఊరి తొలి మహిళా సర్పంచ్‌గా ఎన్నికై...

సంకల్పం

నాయకుడంటే ఎలా ఉండాలి? ప్రజల మధ్యనే ఉంటూ... ప్రజల కోసం పని చేయాలి. అరుదుగా కనిపించే అలాంటి నాయకురాలే నీరూ యాదవ్‌. మగవారి ఆధిపత్యాన్ని తట్టుకొని... ఆ ఊరి తొలి మహిళా సర్పంచ్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే కాదు... అమ్మాయిలను హాకీలో మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. మహిళా సాధికారత, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం పాటుపడుతున్న నీరూ యాదవ్‌ జర్నీ ఇది.

‘‘హాకీవాలీ సర్పంచ్‌’... మా గ్రామంలో నాకున్న మరో పేరు. అందుకు ప్రధాన కారణం... బాలికలను హాకీ లాంటి క్రీడల్లో ప్రోత్సహించడం. మైదానంలో వాళ్లని చూస్తుంటే నన్ను నేను చూసుకొంటున్నట్టు ఉంటుంది. నా కల నెరవేరిన అనుభూతి కలుగుతుంది. హరియాణాలోని చాప్రా సాలిమ్‌పూర్‌ మాది. 2013లో మాస్టర్స్‌ చేశాను. పెళ్లి తరువాత నా నివాసం రాజస్థాన్‌ ఝున్‌ఝును జిల్లా లంబియా అహిర్‌కు మారింది. ఇది ఎక్కడో విసిరేసినట్టు ఉండే మారుమూల పల్లె. కనీస వసతులు కూడా లేని ప్రాంతం. ముఖ్యంగా ఇక్కడ మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడం నన్ను కలవరపెట్టింది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని అనుకున్నా. కానీ ఎలా? ముందుగా గ్రామం అంతా తిరిగాను. అందరినీ కలిశాను. చర్చించాను. వారితో కొన్నేళ్ల ప్రయాణం తరువాత ఒక నిర్ణయానికి వచ్చాను. అదే... సర్పంచ్‌గా పోటీ చేయాలని.

మొదటి మహిళను నేనే...

నా నిర్ణయానికి మావారు, కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. దాంతో 2020లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీపడ్డాను. మంచి మెజారిటీతో గెలుపొందాను. విశేషం ఏంటంటే... లంబియా అహిర్‌ చరిత్రలో ఒక మహిళ సర్పంచ్‌గా ఎన్నిక కావడం అదే మొదటిసారి. పురుషాధిక్యాన్ని ప్రశ్నించి, సాధించిన విజయం అది. నాకు ఎంతో గర్వంగా అనిపించింది. చదువుకున్న అమ్మాయి సర్పంచ్‌ అయితే ఆ గ్రామానికి, ముఖ్యంగా మహిళలు, వయోవృద్ధులకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో చూపించాలని అనుకున్నా. ఊళ్లో ప్రజలు, పరిస్థితులు, సమస్యల గురించి ముందే తెలుసు కాబట్టి, గెలిచిన వెంటనే కార్యాచరణ మొదలుపెట్టాను.

సామాజిక మాధ్యమాల ద్వారా...

ఒక మహిళ రాజకీయాల్లో రాణించడం అంత సులువు కాదని ఆరంభంలోనే అర్థమైంది. అయితే విద్య, స్థానిక అంశాలపై అవగాహన ఉంటే సమర్థవంతంగా పని చేయగలుగుతాం. ప్రజలు, అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం. ఆ నమ్మకంతోనే ముందుకు కదిలాను. అందరూ ఉపయోగించే సామాజిక మాధ్యమాల ద్వారా గ్రామస్తులకు నిత్యం అందుబాటులో ఉన్నాను. స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర డిజిటల్‌ మాధ్యమాలు ఓ శక్తివంతమైన వేదికగా ఉపయోగపడ్డాయి. అందులో ఎప్పటికప్పుడు మా గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా పోస్ట్‌ చేయడం మొదలుపెట్టాను. ఇంటికే పరిమితమైన మహిళలకు వివిధ పథకాలు, ఉపాధి మార్గాలపై అవగాహన కల్పిస్తున్నాను.

క్రీడలతో సాధికారత వైపు...

మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న హరియాణాలో స్కూల్‌ టీచర్లు. దాంతో ఇంట్లో ఎప్పుడూ చదువుపైనే దృష్టిపెట్టేవారు. నాకేమో చిన్నప్పటి నుంచీ హాకీ అంటే చాలా ఇష్టం. ఆడాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అమ్మానాన్నలు అనుమతించలేదు. ఆటల్లోకి దిగితే చదువు దెబ్బతింటుందన్నారు. వారి ఒత్తిడితో హాకీ స్టిక్‌ పట్టుకోవాలన్న కల... కలగానే మిగిలిపోయింది. ఇప్పటికీ నాలాగా ఎంతోమంది అమ్మాయిలు ఆసక్తి ఉన్నా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నారు. అలాంటివారిని ప్రోత్సహించి, క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సంకల్పించాను. తొలుత బాలికల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రులను కలిశాను. తమ పిల్లలను శిక్షణకు పంపించేలా ఒప్పించాను. అందరి సహకారంతో ఊళ్లో హాకీ శిక్షణ కేంద్రం ప్రారంభమైంది.

మార్పు కోసం...

గ్రామస్తుల్లో క్రమంగా క్రీడలపై మక్కువ పెరిగింది. తమంతట తామే వారి పిల్లలను, ముఖ్యంగా ఆడబిడ్డలను శిక్షణకు పంపించడం మొదలుపెట్టారు. ఇలాంటి మార్పే నేను కోరుకున్నది. వీరందరికీ ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ‘అదిత్రీ ఫౌండేషన్‌’ నెలకొల్పాను. అంతేకాదు... గ్రామంలోని మహిళా రైతులను సాధికారత వైపు నడిపించే ఉద్దేశంతో ‘సచ్చీ సహేలీ మహిళా ఆగ్రో లిమిటెడ్‌’ ప్రారంభించాను. వారికి రుణాలు ఇప్పించేలా బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నాను. దీని ద్వారా ఇప్పుడు ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. అలాగే ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని సృష్టించడంలో భాగంగా ‘స్టీల్‌ పాత్రల బ్యాంక్‌’ నెలకొల్పాను. తద్వారా ఇప్పటికి పదిహేను టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను నియంత్రించగలిగాను. ఇందుకుగానూ పలు అవార్డులు సైతం అందుకున్నాను. ఏదిఏమైనా ప్రజాస్వామ్యానికి అసలైన రూపం గ్రామాల్లోనే ఉంది. ఎందుకంటే... అక్కడ మాత్రమే ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజల మధ్యనే ఉంటాడు.’’

నా వేతనం ఇచ్చి...

నా అభ్యర్థన మన్నించి చాలామంది అమ్మాయిలు మైదానానికి వచ్చారు. వాళ్లందరికీ హాకీ స్టిక్‌లు, ఇతర క్రీడా సామగ్రి అందించాను. అందుకోసం రెండేళ్లు నా పూర్తి గౌరవ వేతనాన్ని కేటాయించాను. వాళ్లలో నన్ను నేను చూసుకున్నాను. ఒక్క హాకీలోనే కాదు, ఇతర క్రీడల్లో కూడా బాలికలను ప్రోత్సహించాను. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మరింత మెరుగైన శిక్షణ అవసరమైంది. మా పంచాయతీ పరిధిలో అందుకు తగిన మైదానాలు లేవు. దాంతో దగ్గర్లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీ వారిని ఒప్పించి, అక్కడి ఆటస్థలంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశాను. కొద్ది కాలంలోనే నా ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి. క్రమంగా జిల్లా, రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో మా క్రీడాకారులు పోటీపడ్డారు. సీనియర్‌ హాకీ టోర్నీల్లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆట వారిలో ఉత్సాహాన్నే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచింది.

ఇవి కూడా చదవండి..

కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..

లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 17 , 2025 | 06:07 AM