Navratri Vrat 5 Recipes: ఉపవాస విందు ఇలా
ABN, Publish Date - Sep 25 , 2025 | 02:41 AM
దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు ఉపవాసం ఉంటూ అమ్మవారిని అర్చిస్తుంటారు. ఉపవాసం కారణంగా శరీరం నీరసించి అలసటగా అనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో...
దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు ఉపవాసం ఉంటూ అమ్మవారిని అర్చిస్తుంటారు. ఉపవాసం కారణంగా శరీరం నీరసించి అలసటగా అనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో తక్షణ శక్తిని అందించడంతోపాటు తినదగిన వంటకాల తయారీ మీకోసం...
గురువారం
కుట్టు పరాటా-
మఖానా మఖనీ గ్రేవీ
ఒక గిన్నెలో కుట్టు పిండి, ఉప్పు వేసి నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా కలపాలి. దీన్ని చిన్న ఉండలుగా చేసి పరాటాలు పామాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె రాసి పరాటాలు వేసి రెండువైపులా దోరగా కాల్చాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి వెన్న, లవంగాలు, ఏలకులు, జీలకర్ర, గరం మసాల పొడి, కసూరి మేథీ వేసి రెండు నిమిషాలపాటు వేయించాలి. తరవాత టమాటా ప్యూరీ వేసి దగ్గరకు వచ్చేదాకా ఉడికించాలి. ఆపైన క్రీమ్, వేయించిన మఖానా వేసి పాలు పోసి బాగా కలపాలి. తరవాత ఉప్పు కలిపి కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ మఖానా గ్రేవీని కుట్టు పరాటాతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
శుక్రవారం
మఖానా ఖీర్
చిన్న గిన్నెలో కొన్ని వేడిపాలు పోసి కుంకుమపువ్వు రేకులు వేసి నానబెట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగించాలి. ఆపైన మఖానా వేసి కలుపుతూ దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. అవి చల్లారాక చేత్తో కచ్చాపచ్చాగా మెదపాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి పాలు పోసి మరిగించాలి. తరవాత మఖానా మిశ్రమం వేసి ఉడికించి స్టవ్ మీద నుంచి దించాలి. అందులో బెల్లం తురుం, యాలకుల పొడి, కుంకుమ పువ్వు రేకుల మిశ్రమం, వేయించిన బాదం-జీడిపప్పుల పలుకులు వేసి మెల్లగా కలపాలి. ఈ ఖీర్‌ను వేడిగా, చల్లగా కూడా తినవచ్చు.
శనివారం
స్వీట్ పొటాటో-
సాబుదాన టిక్కీ
సగ్గుబియ్యంలో నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టాలి. దనిసి గడ్డలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించాలి. ఆపైన వెడల్పాటి గిన్నెలో వేసి మెత్తగా మెదపాలి. అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, కచ్చాపచ్చాగా దంచిన వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుం, కొత్తిమీర తరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి ముద్దలా కలపాలి. అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని పై మిశ్రమాన్ని చిన్న టిక్కీల మాదిరి చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి రాసి టిక్కీలు పేర్చి రెండు వైపులా దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఈ టిక్కీలను గ్రీన్ చట్నీతో తినవచ్చు.
ఆదివారం
కుట్టు పూరీ- జీరా ఆలు
కుట్టు పిండి (చిలగడ దుంపల పిండి)లో ఉప్పు వేసి వేడి నీళ్లు చల్లుతూ ముద్దలా కలపాలి. ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పూరీలు పామాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడిచేయాలి. అందులో పూరీలు వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా నెయ్యి, జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరవాత ఉడికించి తొక్కతీసిన ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు వేసి టాస్ చేస్తూ కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించాలి. కుట్టు పూరీలను జీరా ఆలు కూరతో కలిపి తింటే రుచి బాగుంటుంది.
సోమవారం
స్వీట్ పొటాటో-
కుట్టు పిజ్జెట్స్
ఒక గిన్నెలో పన్నీర్ తురుం, ఉడికించిన ఆలుగడ్డల ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, కొద్దిగా క్రీమ్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. దనిసి గడ్డలను ఉడికించి వెడల్పాటి గిన్నెలో వేసి మెత్తగా మెదపాలి. అందులో కుట్టు పిండి, ఉప్పు, నెయ్యి వేసి వేడి నీళ్లు చల్లుతూ ముద్దలా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న బిళ్లలు చేయాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె రాసి ఈ బిళ్లలు పరిచి రెండు వైపులా దోరగా వేయించాలి. ఈ బిళ్లల మీద కొద్దిగా పన్నీర్-ఆలుగడ్డ ముక్కల మిశ్రమం ఉంచి రెండు నిమిషాలు మగ్గించి పళ్లెంలోకి తీయాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News
Updated Date - Sep 25 , 2025 | 02:41 AM