Young Kuchipudi dancer Himansi Choudary: కోవెలలో దీపంలా
ABN, Publish Date - Dec 03 , 2025 | 03:11 AM
అభినయం... అద్భుతం. నాట్యం సమ్మోహనం. కోవెలలో దీపంలా... సుప్రభాత సేవలా... దేవతలను నాట్యాభినయంతో అర్చిస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి....
అభినయం... అద్భుతం. నాట్యం సమ్మోహనం. కోవెలలో దీపంలా... సుప్రభాత సేవలా... దేవతలను నాట్యాభినయంతో అర్చిస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శిథిల ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకొని... సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలను కదిలించేందుకు ప్రయత్నిస్తోంది. ‘టెంపుల్ డ్యాన్స్’ను నెలకొల్పి... కూచిపూడి వైభవాన్ని దేశవిదేశాల్లో ఘనంగా చాటుతోంది. ప్రత్యేక ప్రదర్శనలతో నిధులు సేకరించి... ప్రకృతి విపత్తు బాధితులకు అండగా నిలుస్తున్న నాట్య మయూరి... 24 ఏళ్ల కాట్రగడ్డ హిమాన్సీ చౌదరిని ‘నవ్య’ పలుకరించింది.
‘‘మా అమ్మ శ్రీలక్ష్మికి ఒక కల... నన్ను కూచిపూడి నర్తకిగా చూడాలని. తన అభీష్టాన్ని గ్రహించి నేను నాట్యం నేర్చుకోవాలని అనుకున్నాను. ఇంటర్ చదివే రోజుల్లో కూచిపూడి శిక్షణలో చేరాను. తరువాత మద్రాస్ ఆర్కిటెక్చర్ కళాశాలలో సీటు వచ్చింది. అయితే అప్పటికే కూచిపూడితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో సీటు వదులుకుని, మా స్వస్థలం వరంగల్‌లోనే బీటెక్ చదవాలని నిర్ణయించుకున్నాను. ఇంజనీరింగ్‌తో పాటు నాట్యాన్ని కూడా కొనసాగించాను. పోటీల్లో పాల్గొన్నాను. పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఈ క్రమంలోనే అమెరికాలో జరిగే ‘తానా, ఆటా’ సభల్లో కూచిపూడి ప్రదర్శించాను. ఆహూతులు, ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు అందాయి. రానురాను కూచిపూడితో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. నా జీవితంలో ఒక భాగం అయిపోయింది.
రాష్ట్రపతి ప్రశంసలు...
మహారాష్ట్ర ఖజురహోలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక నృత్య పోటీల్లో నాకు ఎన్నో బహుమతులు వచ్చాయి. మహాకుంభమేళా, గంగా ఉత్సవాలతో పాటు చిదంబరం, అయోధ్య తదితర ప్రముఖ ఆలయాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ముఖ్యంగా రెండేళ్ల కిందట జరిగిన రిపబ్లిక్ పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో నర్తించడం, ప్రముఖుల ప్రశంసలు అందుకోవడం మరిచిపోలేని అనుభవం.
శిథిల ఆలయాల జీర్ణోద్ధరణకు...
ప్రదర్శనలు, పోటీల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో పురాతన ఆలయాలు నన్ను ఆకర్షించాయి. శిథిలావస్థలో ఉన్న వాటిని చూసినప్పుడు బాధనిపించింది. చారిత్రక ప్రాధాన్యం గల వాటిని పునరుద్ధరించేందుకు నా వంతు ప్రయత్నం చేయాలని అనుకున్నాను. అందుకు కూచిపూడి నాట్యాన్ని ఒక సాధనంగా మలచుకున్నాను. తద్వారా ప్రజలు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం నాది. దాని కోసం ‘టెంపుల్ డ్యాన్స్’ పేరిట ఒక సంస్థను నెలకొల్పాను. దాని ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని శిథిల ఆలయాల జీర్ణోద్ధరణకు సంకల్పించాను. ఎక్కడెక్కడ ఇలాంటి ఆలయాలు ఉన్నాయో తెలుసుకోవడానికి, వాటి వివరాలు పొందుపరచడానికి ఒక వెబ్‌సైట్ కూడా ప్రారంభించాను. కొందరు కళాకారులతో కలిసి ఈ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టాను.
భావితరాలకు అందించేందుకు...
మా కార్యక్రమంలో భాగంగా మా దృష్టికి వచ్చిన దేవాలయాలకు వెళతాం. ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తాం. ఆధ్యాత్మికత మిళితమైన గీతాలతో కూచిపూడి నాట్య ప్రదర్శన ఇస్తాం. దానిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తాం. దీనివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి ఆలయ ప్రాశస్త్యం, ప్రాముఖ్యత దేశమంతటికీ తెలుస్తుంది. ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా మరమ్మతులు జరిగి, పూర్వ వైభవం సంతరించుకొంటుందనేది మా ఆలోచన. మా ఈ ప్రయత్నంవల్ల ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు పునప్రారంభమయ్యాయి. ఏదిఏమైనా మన ఘనమైన వారసత్వ సంపదను భావితరాలకు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం.
బాధితులకు అండగా...
ప్రస్తుతం నేను న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నాను. చదువు, నాట్యం, శిథిల ఆలయాల జీర్ణోద్ధరణ సంకల్పం... ఇవన్నీ చేయగలుగుతున్నానంటే అందుకు మా అమ్మ శ్రీలక్ష్మి, నాన్న శ్రీనివాసరావు సహకారం, ప్రోత్సాహంవల్లే సాధ్యమవుతోంది. బాల్యం నుంచి నేను ఏది అడిగినా వారు కాదనలేదు. అయితే నా ప్రదర్శనలు ఆలయాలకే పరిమితం కాలేదు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారి కోసం ఆయా ప్రాంతాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చి, నిధులు సేకరిస్తాను. ఆ సొమ్మును బాధితులకు అందచేస్తాను.’’
-ఎస్.మల్లిఖార్జునరావు,
నందిగామ
Updated Date - Dec 03 , 2025 | 03:11 AM