Islamic teaching: మేలైన సంపద
ABN, Publish Date - Dec 19 , 2025 | 06:12 AM
పూర్వం ఒక చక్రవర్తి తన రాజ్యాన్ని తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎంతోమంది వైద్య నిపుణులు చికిత్స చేసినా అతని వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. రోజురోజుకీ ...
పూర్వం ఒక చక్రవర్తి తన రాజ్యాన్ని తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎంతోమంది వైద్య నిపుణులు చికిత్స చేసినా అతని వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించిపోతోంది. ఈ సంగతి తెలుసుకున్న ఒక యువకుడు వచ్చి... చక్రవర్తి అనారోగ్యాన్ని నయం చేశాడు. దీనికి సంతోషించిన చక్రవర్తి ‘‘నీకు ఏం కావాలో కోరుకో’’ అన్నాడు. అతను ఏం కోరుకున్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ యువకుడు ‘‘మీ రాజ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకోవడానికి అనుమతి ఇవ్వండి’’ అని కోరాడు. రాజు అంగీకరించాడు. ఆ యువకుడు రోజు ఆ గ్రంథాలయానికి వెళ్ళేవాడు. ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేశాడు. గొప్ప వైద్యుడయ్యాడు. అతనే ఆధునిక వైద్య పితామహుడిగా ప్రసిద్ధి చెందిన అవిసీనా. అతను చక్రవర్తి దగ్గర బంగారం, వజ్ర వైఢూర్యాలు, ఇతర సంపదలు కోరుకున్నట్టయితే... ఇంత ప్రఖ్యాతుడయ్యేవాడు కాదు. శతాబ్దాలు గడచినా అతని పరిశోధనలు, గ్రంథాలు వైద్య విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తున్నాయి. విద్య, జ్ఞానం ఎంత గొప్పవో ఈ కథ స్పష్టం చేస్తుంది.
‘‘ధన సంపద కన్నా జ్ఞాన సంపద మేలైనది. డబ్బును భద్రపరచవలసి వస్తుంది. కానీ నేర్చుకున్న విద్య, జ్ఞానం మనకు రక్షణగా నిలుస్తాయి. డబ్బు ఖర్చు పెడితే తరిగిపోతుంది. విద్యను ఎంత పంచిపెడితే అంత పెరుగుతుంది’’ అని మహనీయుడైన ఖలీఫా జహ్రత్ అలీ తెలిపారు. మన అవసరాలను తీర్చుకోవడానికి, కుటుంబ పోషణకు, స్థిరాస్తులు సమకూర్చుకోవడానికి డబ్బు సంపాదిస్తాం. అది దొంగలపాలు కాకూడదని జాగ్రత్తగా దాస్తాం. డబ్బును కాపాడుకోవడానికి మనశ్శాంతి లేకుండా రాత్రింబవళ్ళు గడుపుతాం. కానీ విద్య నిత్యం మనకు రక్షణగా ఉంటుంది. మనం పంచిన విద్య మన తదనంతరం కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతుంది. నేర్చుకున్న జ్ఞానం అడుగడుగునా మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే దివ్య ఖుర్‌ఆన్ విద్యను వెలుగుతో పోల్చింది. సూర్యుడు తన వెలుగుతో చీకటిని ఎలా పటాపంచలు చేస్తాడో విద్య కూడా అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ‘‘నలుగురుకీ మేలు చేసేదే అసలైన విద్య’’ అని చెబుతూ ‘‘విద్య నా ఆయుధం’’ అని అన్నారు దైవప్రవక్త మహమ్మద్. విద్యను ఆర్జించడం ఉత్తమమైన ఆరాధనతో సమానమని ఆయన తెలిపారు. మనం చేసేది మంచో చెడో విద్య, జ్ఞానం ద్వారానే తెలుస్తుంది. ‘జ్ఞానులు, అజ్ఞానులు... వీరిద్దరూ ఎన్నటికీ సమానం కాలేరు’ అని దివ్య ఖుర్‌ఆన్ స్పష్టం చేసింది. చీకటి, వెలుగు... ఈ రెండూ ఎన్నటికీ ఒక్కటి కాలేవు. ‘‘నాకు మరింత విద్యను, జ్ఞానాన్నీ ప్రసాదించు’’ అని అల్లా్‌హను వేడుకోవాలనీ, మనిషి ఎంత విజ్ఞానవంతుడైతే అతనికి అంత మేలు జరుగుతుందనీ చెప్పిన ఇస్లామ్... స్త్రీపురుషులకు విద్యార్జనను విధిగా నిర్దేశించింది.
-మహమ్మద్ వహీదుద్దీన్
Updated Date - Dec 19 , 2025 | 06:12 AM