ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Athira Murali Keralas first woman rally driver: వేగం ఆమె ట్రాక్‌

ABN, Publish Date - Dec 01 , 2025 | 04:02 AM

అతిరా మురళీ... కేరళకి చెందిన మొదటి మహిళా ర్యాలీ డ్రైవర్‌.బైక్‌ల నుంచి టిప్పర్ల వరకూ దేన్నయినా అవలీలగా నడిపేస్తారు.రెండుసార్లు నేషనల్‌ టైటిల్స్‌ సాధించి, మరో టైటిల్‌ కోసం సిద్ధమవుతున్న అతిర...

అతిరా మురళీ... కేరళకి చెందిన మొదటి మహిళా ర్యాలీ డ్రైవర్‌.బైక్‌ల నుంచి టిప్పర్ల వరకూ దేన్నయినా అవలీలగా నడిపేస్తారు.రెండుసార్లు నేషనల్‌ టైటిల్స్‌ సాధించి, మరో టైటిల్‌ కోసం సిద్ధమవుతున్న అతిర... ‘‘సాహసమే నా ఊపిరి’’ అంటున్నారు.

‘‘వాహనాలతో నా సావాసం చాలా చిన్న వయసులోనే మొదలయింది. మాది కేరళలోని కొట్టాయం. మా నాన్న మురళీధరన్‌, అమ్మ ఉష. నాన్న ట్రాన్స్‌పోర్ట్‌ రంగానికి చెందినవారు. మా ఇంట్లో విల్లీస్‌ జీపు, ఒక లారీతో సహా అనేక వాహనాలు ఉండేవి. వాటిని నడపాలని నేను ముచ్చటపడేదాన్ని. పన్నెండేళ్ళకే బైక్‌ నడపడం నేర్చుకున్నాను. పదిహేను ఏళ్ళకల్లా మూడు టన్నుల మినీ ట్రక్‌ నడిపాను. వయసుతోపాటే వాహనాల మీద నా ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది.

లైసెన్సుల్లో రికార్డు

బీసీఏ పూర్తి చేశాక... ఎక్కడా ఉద్యోగం చెయ్యాలని అనిపించలేదు. కేరళకు వచ్చే టూరిస్టులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన పర్యటన అనుభవాలను అందించడం కోసం ఒక టూర్‌ కంపెనీ ప్రారంభించాను. అదే సమయంలో వాహనాల మరమ్మతులు నేర్చుకున్నాను. బైక్‌, త్రీవీలర్‌, కారు, ట్రక్కు, లారీ, బస్సుల్లాంటి హెవీ ప్యాసింజర్‌ వాహనాలు, హెవీ గూడ్స్‌ మోటార్‌ వాహనాలు... ఇలా ప్రతిదీ నడపడంతోపాటు లైసెన్సులు కూడా పొందాను. అతి చిన్న వయసులో ఇన్ని లైసెన్సులు పొందిన పిన్న వయస్కురాలిగా నా పేరు ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ‘యూనివర్సల్‌ రికార్డ్‌ ఫోరమ్‌’లలో నమోదయింది. అప్పుడు నా వయసు 21 ఏళ్ళు. సాహసాలు చేయాలనే తపన నాలో రోజురోజూకూ పెరుగుతూ వచ్చింది. అదే మోటార్‌ స్పోర్ట్స్‌ వైపు నన్ను మళ్ళించింది.

ఆ వేగం ట్రాక్‌కే పరిమితం

2021, 2022 సంవత్సరాల్లో... వరుసగా రెండేళ్ళు ‘ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ ఛాంపియన్‌షి్‌ప’ (ఐఎన్‌ఆర్‌సి) పోటీల్లో లేడీస్‌ క్లాస్‌లో విజేతగా నిలవడంతో నా పేరు కార్‌ రేస్‌ సర్కిల్స్‌లో మారుమోగింది. ఈ పోటీలను ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో జరిగే ఈ పోటీలు... నాలుగు విభాగాల్లో ఉంటాయి. పలు రౌండ్లలో జరుగుతాయి. సుమారు 300 కిలోమీటర్ల ట్రాక్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసినవారిని విజేతలుగా గుర్తిస్తారు. పోటీల్లో ప్రయాణించాల్సిన మార్గాలు రకరకాలుగా ఉంటాయి. మొత్తం అన్ని దశలనూ రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా పోటీల్లో పాల్గొంటున్నాను. తాజాగా కూర్గ్‌లో నిర్వహించిన రౌండ్‌తో సహా... ఇప్పటివరకూ జరిగిన మూడు రౌండ్లలో మొత్తంగా అయిదో స్థానంలో, మహిళా విభాగంలో మొదటి స్థానంలో ఉన్నాను. వచ్చే నెలలో కోయంబత్తురూలో జరిగే నాలుగోరౌండ్‌ కోసం, మధ్యప్రదేశ్‌లో నిర్వహించే ఫైనల్‌ రౌండ్‌ కోసం సిద్ధమవుతున్నాను. మూడోసారి టైటిల్‌ను కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకుంది. మరోవైపు ఆటోమొబైల్స్‌ గురించి, పర్యాటక ప్రాంతాల విశేషాల గురించి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటాను. నాకు వేగం ఇష్టమే. కానీ అది కేవలం ర్యాలీ ట్రాక్‌ మీద మాత్రమే. పబ్లిక్‌ రోడ్ల మీద బాధ్యతాయుతంగా వాహనాలు నడపుతాను. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా... అప్రమత్తంగా ఉంటాను. నాకు వీలైనంతవరకూ... ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తున్నాను.’’

మూడేళ్ల విరామం

నేను మోటార్‌ స్పోర్ట్స్‌లో పాల్గొంటానని చెప్పినప్పుడు... ఎంతో మంది నిరుత్సాహపరిచారు. ఎందుకంటే అప్పటివరకూ కేరళలో మోటార్‌ స్పోర్ట్స్‌లో పాల్గొన్న మహిళలెవరూ లేరు. అది చాలా ప్రమాదాలతో కూడుకున్న వ్యవహారం. కానీ నా గురించి నేను చెప్పుకోవాలంటే... ‘‘సాహసం నా ఊపిరి’’ అంటాను. అందుకే వెనక్కు తగ్గలేదు. మొదట ఆఫ్‌-రోడ్‌ ఈవెంట్స్‌లోకి అడుగుపెట్టాను. ఆ తరువాత మోటోక్రాస్‌ పోటీల్లో పాల్గొన్నాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను. వేగం, కచ్చితత్వం, అప్రమత్తత, సెకెన్ల వ్యవధిలో నిర్ణయం తీసుకొనే సామర్థ్యం... ఇలాంటివి ఎన్నో కావాలి. కొట్టాయానికి చెందిన జార్జి వర్ఘీస్‌ పర్యవేక్షణలో నా నైపుణ్యాలను పెంచుకున్నాను. 2000లో తొలిసారిగా జాతీయ ర్యాలీలో పాల్గొన్నాను. అయితే ఆ తరువాత మూడేళ్ళపాటు విరామం ఇవ్వాల్సి వచ్చింది. కారణం... ఆర్థిక పరిస్థితులు. మోటార్‌ స్పోర్ట్స్‌ శిక్షణకు, ప్రాక్టీ్‌సకు, పోటీలకు సిద్ధం కావడానికి, పాల్గొనడానికి లక్షల్లో ఖర్చవుతుంది. నా వృత్తి ద్వారా నాకు వచ్చే ఆదాయంతో దాన్ని భరించే శక్తి నాకు లేదు. స్పాన్సర్ల కోసం చాలా ప్రయత్నించాను. చివరకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. దాంతో మళ్ళీ రేస్‌ ట్రాక్‌ మీదికి వచ్చాను.

Updated Date - Dec 01 , 2025 | 04:02 AM