India Women Cricket Champions: అభిరుచి ఆటలోనే కాదు
ABN, Publish Date - Nov 08 , 2025 | 05:02 AM
ముంబయి డీవై పాటిల్ స్టేడియం భారత్ దక్షిణాఫ్రికా మధ్య మహిళల ప్రపంచ కప్ అంతిమ సమరం ఇన్నింగ్స్ 46వ ఓవర్. దీప్తి శర్మ వేసిన ఫుల్‌టాస్ బంతిని గాల్లోకి లేపింది....
ముంబయి డీవై పాటిల్ స్టేడియం... భారత్- దక్షిణాఫ్రికా మధ్య మహిళల ప్రపంచ కప్ అంతిమ సమరం... ఇన్నింగ్స్ 46వ ఓవర్. దీప్తి శర్మ వేసిన ఫుల్‌టాస్ బంతిని గాల్లోకి లేపింది నడైన్ డిక్లెర్క్. కవర్స్‌లో ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు వేగంతో వెనక్కి పరుగెడుతూ బంతిని అందుకుంది. ఒక్కసారిగా మైదానంలో జయ జయ ధ్వానాలు మిన్నంటాయి. భారత క్రీడాకారుల ముఖాలు భావోద్వేగాలతో నిండిపోయాయి. ఆలింగనాలు... ఆనందబాష్పాలు... కేరింతలు... నృత్యాలు... ఎన్నో ఏళ్ల వారి దీక్షకు, పట్టుదలకు, అలుపెరుగని పరిశ్రమకు దక్కిన ఫలితం. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు... కలలను చేధించడం... వాటిని నెరవేర్చుకోవడం. భారతదేశం తొలిసారిగా మహిళల ప్రపంచ కప్‌ను సాధించిన నేపథ్యంలో... కోట్లాదిమంది గుండెలు గర్వంతో ఉప్పొంగిన క్షణం.
ఈ గెలుపులో ఎవరికి వారే ప్రత్యేకం. సమష్టి కృషితో... అచంచలమైన ఆత్మవిశ్వాసంతో హర్మన్‌ప్రీత్ జట్టును నడిపించిన తీరు అత్యద్భుతం. వీరిని చూస్తుంటే ‘లగాన్’ చిత్రంలో ఆమిర్‌ఖాన్ జట్టు గుర్తుకువస్తుందనేది క్రికెట్ పండితుల మాట. భిన్న నేపథ్యాలు... ఒకరికీ ఒకరికీ సంబంధంలేని పరిస్థితులు. కానీ అందరిదీ ఒకటే కల... ఒకటే శ్వాస... క్రికెట్. ఆటలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం... దశాబ్దాలుగా ఊరిస్తున్న ప్రపంచ కప్‌ను సాధించడం. షఫాలీవర్మ ఉత్సాహం... స్మృతి మంధాన ప్రశాంత చిత్తం... జమీమా రోడ్రిగ్స్ పోరాడే తత్వం... దీప్తిశర్మ శ్రమ... శ్రీచరణి ఆత్మస్థైర్యం... క్లిష్ట పరిస్థితుల్లో ముందుండి నడిపించగల హర్మన్‌ప్రీత్ సామర్థ్యం... ఇవే నేడు భారత్‌ను జగజ్జేతగా నిలబెట్టాయి. క్రికెట్ సరే... మరి మన స్టార్లు మైదానం విడిచాక ఏంచేస్తారు? తెలుసుకోవాలని ఉందా..! అయితే రండి... ఆటను ఆస్వాదిస్తూనే తమ అభిరుచులకు పట్టం కడుతున్నవారిపై ఓ లుక్కేద్దాం.
హర్మన్‌ప్రీత్ కౌర్
భారత మహిళల జట్టుకు సారథ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్... ఎన్నో అవరోధాలు, కట్టుబాట్లను దాటి క్రికెట్ బ్యాట్ పట్టింది. ఆరంభంలో ఆమె తల్లి కూడా వంట నేర్చుకొని ఇంట్లో కూర్చోమని సలహా ఇచ్చారు. ఆ మాటలు హర్మన్‌లో మరింత పట్టుదలను పెంచాయి. ‘‘అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. ఇంటి దగ్గర అబ్బాయిలతో కలిసి ఆడుతుండేదాన్ని. అది చూసి ఒక రోజు అమ్మ... ‘నువ్వు ఎప్పుడూ మగపిల్లలతోనే ఆడుతున్నావు. కెరీర్ గురించి నీకు ఏ మాత్రం ఆలోచన లేదు’ అంది. అందరి ఆడపిల్లల్లాగా సల్వార్ కమీజ్ వేసుకొని, వంట నేర్చుకోమని సలహా ఇచ్చింది. ‘నా జీవితం క్రికెట్‌తోనే’ అని తేల్చిచెప్పాను. ఆనాటి నుంచి అమ్మ నన్ను మళ్లీ ఎప్పుడూ నన్ను ప్రశ్నించలేదు’’ అంటూ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్న హర్మన్... 2017 ప్రపంచ కప్‌లో ఆస్ర్టేలియాపై చేసిన 171 పరుగుల ఇన్నింగ్స్ భారత మహిళ క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. క్రికెటర్లు కావాలనుకొనే ఎంతోమంది అమ్మాయిలకు ప్రేరణనిచ్చింది. కలల కప్‌ను ముద్దాడాక, ఆ ఆనందాన్ని, ఆ గర్వించే క్షణాన్నీ జీవితాంతం గుర్తుండిపోయేలా తాజాగా తన చేతిపై ప్రపంచ కప్ టాటూ వేసుకుంది హర్మన్. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గతంలో భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా, పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీగా గతంలో ఆమె బాధ్యతలు నిర్వర్తించింది. అయితే విద్యార్హతల విషయం వివాదాస్పదం కావడంతో డీఎస్పీగా ఆమె నియామకాన్ని పంజాబ్ పోలీస్ వెనక్కు తీసుకుంది. వివాదం సమసిపోయాక తిరిగి ఉద్యోగం ఇచ్చింది. ఎన్నో బడా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న హర్మన్‌కు సంగీతం అంటే ప్రాణం.
స్మృతి మందాన
క్రికెట్ తరువాత స్మృతికి అత్యంత ఇష్టమైనది బీజీఎంఐ (బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) ఆడటం. ఇది తనకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇచ్చే సాధనమని పలు సందర్భాల్లో చెప్పింది. గేమర్‌గా కూడా మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌వుమన్ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ఏ23కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. స్మృతి మైదానంలో కనిపించలేదంటే... స్నేహితులతో కలిసి బీజీఎంఐలో మునిగిపోయిందని అర్థం. అంతలా ఆ గేమ్‌ను ప్రేమిస్తుంది. ఇక రకరకాల వంటలు ప్రయత్నించడం తన మరో అభిరుచి. పంజాబీ వంటకాలు నేర్చుకోవడానికి తరగతులకు కూడా వెళ్లింది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమెకు నచ్చిన, బాగా వండే వంటకం. ‘వంట చేయడం అంటే నాకు మైదానంలో అద్భుతమైన కవర్‌డ్రైవ్ కొట్టినంత ఆనందాన్ని ఇస్తుంది’ అంటుంది స్మృతి. అంతేకాదు... ఆమెకు పర్యటనలన్నా చాలా ఇష్టం. స్విట్జర్లాండ్‌లోని ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు, ఆస్ర్టేలియాలోని సుందర ప్రాంతాలు... ఎప్పుడూ కొత్త కొత్త పర్యాటక ప్రాంతాల్లో సేద తీరాలని కోరుకొంటుంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు విపరీతంగా చూస్తుంది.
జమీమా రోడ్రిగ్స్
క్రికెట్ గ్రౌండ్‌లో కొట్టే కళాత్మక స్ర్టోక్స్‌తోనే కాదు... గిటార్‌ను శృతి చేస్తూ... కమ్మని రాగంతోనూ కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది జమీమా. ఇన్‌స్టాలో తరచూ రీల్స్ పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో... మెరుపు ఫీల్డింగ్‌తో మైదానంలో... తను ఎక్కడుంటే అక్కడ వాతావరణం ఉల్లాసంగా మారిపోతుంది. సమయం చిక్కినప్పుడల్లా స్టెప్పులేసి... జట్టు సభ్యుల్లోనే కాదు... స్టాండ్స్‌లో కూర్చున్న ప్రేక్షకులలోనూ ఉత్సాహం నింపుతుంది. తండ్రి మార్గదర్శకత్వంలో ఏడేళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టిన జమీమా ముంబయిలోని బాంద్రాలో పుట్టి పెరిగింది. తమ మత విశ్వాసాలను అనుసరించే జమీమా సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని ఎదుర్కొంది. అయినా ఆట నుంచి మనస్సును పక్కకు పోనివ్వలేదు. కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు. ఎన్నో పునరాగమనాల తరువాత ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసి... రికార్డు స్కోరును ఛేదించడంలో కీలకమైంది. భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఉద్వేగానికి లోనైన జమీమా కన్నీటి పర్యంతమైంది. ఇన్‌స్టాలో ఈ స్టార్ బ్యాటర్‌కు దాదాపు మూడున్నర లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ తరచూ తన అభిరుచుల చిత్రాలు, రీల్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది.
దీప్తి శర్మ
ప్రపంచక్‌పలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి... ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించింది. అన్నయ్య సుమిత్ ఆటను చూస్తూ పెరిగిన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది ఒక త్రో. అన్నయ్య శిక్షణ తీసుకొంటుండగా... తనవద్ద పడివున్న ఓ బంతిని నేరుగా కోచ్ చేతుల్లోకి విసిరింది దీప్తి. అది భారత మాజీ బ్యాటర్ హేమలత కాలా దృష్టిని ఆకర్షించింది. ఆ రోజు నుంచి సుమిత్ చెల్లి కోసం తన ఆటను, ఉద్యోగాన్ని త్యాగం చేశాడు. ‘దీప్తి ఆడుతుంటే దేశం తరుఫున నేనూ ఆడినట్టే’ అంటూ ఓసారి అతను చెప్పాడు. అన్నయ్య నేతృత్వంలో, తల్లి ప్రోత్సాహంతో దీప్తి అంచెలంచెలుగా ఎదిగింది. ఆగ్రాకు నుంచి వచ్చిన ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గానూ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం ఆమెకు బాగా నచ్చిన అంశాలు. బెంగాల్‌కు ఆడుతున్న సమయంలో తన సహచరుల ద్వారా బంగ్లా మాట్లాడటం నేర్చుకుంది. గార్డెనింగ్‌తో పాటు ఇంటిని అందంగా అలంకరించడం ఆమె మరికొన్ని అభిరుచులు.
ప్రతీక రావల్
ఢిల్లీలో పుట్టి పెరిగిన ప్రతీక... క్రికెట్‌లోనే కాదు, చదువులోనూ టాపే. ఆమె తండ్రి ప్రవీణ్ రావల్ బీసీసీఐ అంపైర్. ఆమె తల్లి గృహిణి. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతీకను తల్లితండ్రులు ప్రోత్సహించారు. బడి రోజుల్లో ఆమె బాస్కెట్‌బాల్ ఆడేది. 2019 జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఢిల్లీ తరుపున స్వర్ణ పతకం కూడా సాధించింది. తరువాత క్రికెట్ వైపు మళ్లింది. పన్నెండో తరగతిలో 92.5 శాతం మార్కులు సంపాదించిన ఆమె, సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ‘‘ఆటను అవగాహన చేసుకోవడానికి, మానసికంగా దృఢంగా ఉండటానికి, విశ్లేషణాత్మకంగా ఆలోచించడానికి నేను చదివిన మనస్తత్వ శాస్త్రం అవకాశం కల్పించింది’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతీక... ఆట లేనప్పుడు కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతుంది.
హర్లీన్ దేవల్
క్రికెట్‌లోకి రాకముందు హర్లీన్ రకరకాల క్రీడా పోటీల్లో పాల్గొంది. చిన్నప్పుడు హాకీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ తదితర గేమ్స్ ఆడింది. డ్యాన్సింగ్, ట్రావెలింగ్, షాపింగ్‌తో పాటు సినిమాలు చూడటం ఆమె అభిరుచులు. విభిన్న సంస్కృతులతో మమేకం కావడం ఎంతో ఇష్టం. అలాగే ఖాళీ సమయాల్లో ఫుట్‌బాల్ ఆడుతుంది. ఒకవేళ క్రికెటర్‌ను కాకపోయివుంటే పైలెట్‌గా స్థిరపడాలని కోరుకున్నట్టు హర్లీన్ ఓ సందర్భంలో వెల్లడించింది.
రాధా యాదవ్/ శ్రీచరణి
ఇరుకైన ముంబయి వీధుల్లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడిన రాధా యాదవ్‌కు ఆట తప్ప మరో ధ్యాస లేదు. తన జీవితాన్ని మలుపు తిప్పిన క్రికెట్టే ఆమెకు జీవితం. ఇక తెలుగు అమ్మాయి శ్రీచరణికి కూడా హర్లీన్‌లానే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లో కూడా ప్రవేశం ఉంది. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్, ఖోఖో ఆడింది. అయితే చివరకు క్రికెట్‌ను తన కెరీర్‌గా ఎంచుకుంది.
Updated Date - Nov 08 , 2025 | 05:02 AM