ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bani Yadav: మహిళా రేసర్‌

ABN, Publish Date - Oct 25 , 2025 | 04:49 AM

పురుషాధిక్య రంగాల్లో మోటార్‌స్పోర్ట్‌ ఒకటి. దాన్లో రాణించడమే కాకుండా డాక్టరేట్‌ కూడా పొందగలిగింది... గురుగ్రామ్‌కు చెందిన 53 ఏళ్ల బని యాదవ్‌. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ రేసర్‌ బని ఆసక్తికరమైన ప్రస్థానమిది...

పురుషాధిక్య రంగాల్లో మోటార్‌స్పోర్ట్‌ ఒకటి. దాన్లో రాణించడమే కాకుండా డాక్టరేట్‌ కూడా పొందగలిగింది... గురుగ్రామ్‌కు చెందిన 53 ఏళ్ల బని యాదవ్‌. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ రేసర్‌ బని ఆసక్తికరమైన ప్రస్థానమిది...

ని తండ్రి రేస్‌ కార్లకు మార్పులు చేసేవారు. అలా చిన్నప్పటి నుంచి రేసు కార్లతో కలిసి పెరిగిన బని... ఎంతో ఆలస్యంగా 43వ ఏట ప్రొఫెషనల్‌ రేసింగ్‌లోకి అడుగు పెట్టింది. అందుకు కారణం గురించి వివరిస్తూ... ‘‘మా నాన్నకు స్వతహాగా రేసింగ్‌ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ నేను రేసర్‌గా ఎదగడానికి ఒప్పుకోలేదు. పైగా నా చిన్నతనంలో మన దేశంలో రేసింగ్‌కు సంబంధించి మౌలిక సదుపాయాలు కూడా అంత మెరుగ్గా ఉండేవి కావు. దాంతో అందరు యువతుల్లాగే పెళ్లి చేసుకుని, పిల్లల పెంపకంతో బిజీగా మారిపోయాను. అలాగని రేసింగ్‌ పట్ల నా మక్కువ తగ్గిపోలేదు. చిన్ననాటి స్నేహితుడినే ప్రేమించి, పెళ్లాడాను. దాంతో కుటుంబం నన్ను వెలి వేసింది. ఆర్థిక ఇబ్బందులు కూడా వేధించాయి. దాంతో డబ్బు సంపాదన, పిల్లల పెంపకం మీదే దృష్టిని కేంద్రీకరించాను. పిల్లలు పెరిగి పెద్దయ్యాక, కుటుంబం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత... రేసింగ్‌ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. మా వారు నా మక్కువను మరింత ప్రోత్సహించడంతో 40 ఏళ్ల వయసులో రేసింగ్‌ మొదలుపెట్టాను. భారతదేశలో ర్యాలీ కార్‌ డ్రైవింగ్‌ ప్రధానంగా పురుషులకే పరిమితం. ఈ పోటీల్లో కేవలం కొద్దిమంది మహిళలే పాల్గొంటూ ఉంటారు. అయితే అదృష్టవశాత్తూ, నా నేవిగేటర్‌ కూడా మహిళే కావడంతో సర్క్యూట్‌ మొత్తంలో మేమే ఏకైక మహిళా జంటగా రేసింగ్‌లో పాల్గొనేవాళ్లం. ఇది పురుషుల క్రీడ కాబట్టి మహిళల చేతుల్లో ఓడిపోవడాన్ని పురుషులు ఇష్టపడరు. మహిళలు పురుషులతో సమానంగా వేర్వేరు రంగాల్లో ఎదగడాన్ని పురుషులు స్వాగతిస్తారు, ప్రోత్సహిస్తారు... కానీ అది వాళ్లను ఓడించనంతవరకే! ‘‘రేసింగ్‌ ఆమె అభిరుచి కాబట్టి రేస్‌లో పాల్గొనడంలో తప్పేముంది?’’ అన్న వాళ్లే, రేసింగ్‌లో నేను గెలిస్తే జీర్ణించుకోలేకపోతూ ఉండేవారు. ప్రారంభంలో ఇలాంటి ఎన్నో ప్రతిఘటనలను ఎదుర్కొన్నాను. ఆ తర్వాత ర్యాలీలు, టైటిళ్లు గెలుచుకోవడం మొదలుపెట్టడంతో అందరూ గౌరవించడం మొదలుపెట్టారు’’ అంటూ తన రేసింగ్‌ పోరాటం గురించి వివరించింది బని.

రిటైరయ్యే వయసులో...

2013లో జైపూర్‌ స్పీడ్‌ స్ర్పింట్‌ పోటీలో పాల్గొని 2వ స్థానాన్ని దక్కించుకోవడంతో మొదలుపెట్టి, 2018, 2019లో నేషనల్‌ ఆటోక్రాస్‌ ఛాంపియన్‌ విమెన్‌గా ఎదిగింది బని. అలాగే భారతదేశం వెలుపల అబుదాబి యాస్‌ మెరీనా సర్క్యూట్‌లో ఫార్ములా కార్లను నడపడంతో పాటు, తాజాగా మోటార్‌స్పోర్ట్స్‌లో డాక్టరేట్‌ను పొందే స్థాయికి కూడా ఎదగలిగింది. ప్రస్తుతం 53 ఏళ్ల వయసులో సైతం రేసింగ్‌లో సత్తా చాటుతోంది. అగ్ర క్రీడాకారులందరూ 40 ఏళ్ల వయసులో రిటైర్‌ అయిపోతూ ఉంటారు. కానీ ఎంతో ఆలస్యంగా 43 ఏళ్ల వయసులో రేసింగ్‌లోకి ప్రవేశించిన బని... తన పట్టుదల వెనకున్న కారణం గురించి వివరిస్తూ... ‘‘రేసింగ్‌ అవకాశం నాకు కాస్త ఆలస్యంగా వచ్చింది. రేసింగ్‌లో నా వయసులో సగం వయసున్న పురుషులతో పోటీ పడ్డాను. చాలామంది నన్ను చూసి హేళన చేశారు. పోటీదారులు ట్రాక్‌ మీద కోపాన్ని ప్రదర్శించి, పోటీలో వెనకపడిపోయేలా చేసేవారు. అయితే నేను నా చిన్ననాటి కలను నిజం చేసుకుంటున్న విషయం వాళ్లకు తెలియదు. నన్ను వెనక్కి తోసేసే అవకాశం, చొరవ ఎవరికీ ఇవ్వననే విషయం కూడా వాళ్లకు తెలియదు. రేసింగ్‌లో పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో పాటు నేర్పరితనం కూడా కలిగి ఉండాలి. నా మటుకు నేను పోటీదారులను గమనిస్తూ, వాళ్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. అవరోధాలను ఎలా తప్పించుకోవాలో, అపజయాల నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో, తప్పుడు గైడెన్స్‌లను ఎలా గుర్తించాలో సాటి రేసర్ల సంభాషణల నుంచి తెలుసుకున్నాను’’ అంటూ రేసింగ్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరించింది బని.

తల్లి బాటలో పిల్లలు...

రేసింగ్‌లో వయసు కూడా ప్రధానమే! ఈ పోటీకి నా వయసు అవరోధంగా మారిన సందర్భాలు లేకపోలేదు. కంటిచూపు, రిఫ్లెక్స్‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినా పూర్తి సామర్థ్యం మేరకు ప్రతిభ కనబరచడమెలాగో అనుభవం మీద నేర్చుకున్నాను. ఏ అవకాశమైనా జీవితంలో ఒక్కసారే చేతికి అందుతుంది. దాన్ని నూరు శాతం సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఇదొక అపురూపమైన అవకాశం కాబట్టే మక్కువనే శక్తిగా మార్చుకుని రేసింగ్‌లో పైకి ఎదుగుతున్నాను’ అంటూ మీడియాకు వివరించిందామె. 53 ఏళ్ల వయసులో సైతం సాటి రేసర్లకు స్ఫూర్తిగా మారుతున్న బన్నికి ఇద్దరు అబ్బాయిలు. వాళ్లిద్దరూ కూడా ర్యాలీ డ్రైవర్లే కావడం చెప్పుకోదగిన విశేషం.

Updated Date - Oct 25 , 2025 | 04:49 AM