ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ashritha Gachumale: చిన్న అడుగులతోపెద్ద మార్పు

ABN, Publish Date - Dec 15 , 2025 | 02:30 AM

తొమ్మిదేళ్ల వయసులో చేసిన స్కూబా డైవింగ్‌... ఆలోచనలను మార్చేసింది. నీటి అడుగున దాగివున్న అందమైన ప్రపంచం... అమితంగా ఆకర్షించింది. సముద్ర పర్యావరణం.....

తొమ్మిదేళ్ల వయసులో చేసిన స్కూబా డైవింగ్‌... ఆలోచనలను మార్చేసింది. నీటి అడుగున దాగివున్న అందమైన ప్రపంచం... అమితంగా ఆకర్షించింది. సముద్ర పర్యావరణం, జీవవైవిధ్యం సంరక్షణ వైపు అడుగులు వేయించింది. దీనికోసం రెండు ఎన్‌జీవోలు నెలకొల్పి... ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించి... శాస్త్రసాంకేతిక విజ్ఞానం పంచుతున్న పదహారేళ్ల హైదరాబాద్‌ అమ్మాయి... ఆశ్రిత గచ్చుమాలేను ‘నవ్య’ కదిలించింది.

‘‘అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. అండమాన్‌ దీవులు... హావెలాక్‌ ద్వీపం. అక్కడి నీళ్లలో స్కూబా డైవింగ్‌ చేశాను. నీటి లోపల ప్రపంచాన్ని చూడటం అదే మొదటిసారి. ఆ లోకం నన్ను బాగా ఆకర్షించింది. ఎంతటి అద్భుతం అది! ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. ఆ రోజు నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా స్కూబా డైవింగ్‌ చేస్తున్నాను. సాగరం తనలో నిక్షిప్తం చేసుకున్న మరో ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నాను. అదే సమయంలో సముద్రపు పర్యావరణ వ్యవస్థలు వేగంగా క్షీణించడం గమనించాను. వాతావరణ మార్పులు, కాలుష్యమే ఇందుకు కారణమని తెలుసుకున్నాను. ఇది నన్ను ఆందోళనకు గురి చేసింది. దీనికి పరిష్కారం ఏంటి?

జీవివైవిధ్యాన్ని కాపాడేందుకు...

మా కుటుంబ సభ్యులందరం తరచూ పర్యటనలకు వెళుతుంటాం. అలా ఇప్పటికి పదిహేనుకు పైగా దేశాలు తిరిగాను. భారత్‌లోనూ అనేక ప్రదేశాలు చూశాను. సముద్రపు ప్రాంతాలు సందర్శించినప్పుడు స్కూబా డైవింగ్‌ చేయడం నాకు ఒక అలవాటుగా మారిపోయింది. స్నేహితులు అడుగుతుంటారు... ‘నీటి లోపలికి వెళ్లేటప్పుడు భయం వేయదా’ అని! నాకు భయం కంటే అందులోని రంగు రంగుల చేపలు, ఇతర జలచరాలను చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ వాతావరణ మార్పులతో సముద్రంలోని జీవవైవిధ్యం దెబ్బతినడం బాధగా అనిపిస్తుంది. అంతటి అద్భుత లోకం మాయమైపోతుందేమోననే భయం కలుగుతుంది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలంటే ముందుగా నాకు దీని గురించి తెలియాలి. అందుకే సముద్రపు పరిరక్షణ (మెరైన్‌ కన్జర్వేషన్‌)కు సంబంధించి ఆన్‌లైన్‌ కోర్సులు చేశాను.

రెండు ఎన్జీఓలు...

ఎప్పుడూ మన గురించే కాదు, చుట్టూ ఉన్న సమాజం, జీవాలు, జీవాధారమైన ప్రకృతి వనరుల గురించి కూడా ఆలోచించాలి. విద్యార్థి దశలోనే ఆ దిశగా అడుగులు పడితే భవిష్యత్‌ తరాలు బాగుంటాయి. అందుకే నేను నాకున్న పరిజ్ఞానాన్ని అందరితో పంచుకొని, అవగాహన కల్పించాలని అనుకున్నాను. దాని కోసం మూడేళ్ల కిందట రెండు స్వచ్ఛంద సంస్థలు... ‘ఆర్ట్‌ స్టెమ్‌’, ‘భువ్యోమ్‌’ నెలకొల్పాను. దీని ద్వారా సముద్రపు పర్యావరణ పరిరక్షణ, ‘స్టెమ్‌’ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) ఎడ్యుకేషన్‌పై ప్రభుత్వ పాఠశాలల్లోని 4 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.

200కు పైగా వర్క్‌షా్‌పలు...

ప్రయోగాలు, పలు రకాల యాక్టివిటీల ద్వారా ‘స్టెమ్‌’ కాన్సెప్ట్‌ చెబుతున్నాం. మెరైన్‌ కన్జర్వేషన్‌లో భాగంగా వాతావరణ మార్పులు, జలాచరాలు, జీవవైవిధ్యం గురించి కథలు, చిత్రాలు, వీడియోల ద్వారా వివరిస్తున్నాం. వీటితోపాటు ఖగోళ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలు బోధిస్తున్నాం. ‘స్టెమ్‌’ ఎడ్యుకేషన్‌ ఎందుకు చెబుతున్నామంటే... నేడు చాలా స్కూళ్లల్లో మార్కుల కోసం పాఠ్య పుస్తకాలను బట్టీ పట్టిస్తున్నారు. అలా కాకుంగా ప్రయోగాత్మకంగా చెబితే వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పైతరగతులకు కావల్సిన బలమైన పునాది పడుతుంది. నేను అలాగే నేర్చుకున్నా. అదే విధానం ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నేర్పుతున్నా. ఇప్పటివరకు 200కు పైగా ‘స్టెమ్‌’ వర్క్‌షాప్స్‌ నిర్వహించాను. మరో ఎన్‌జీవో ‘భువ్యోం’ ద్వారా పర్యావరణ పాఠాలు చెబుతున్నా.

వందమంది వాలంటీర్లు...

మా స్వచ్ఛంద సంస్థల్లో వందమందికి పైగా వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరంతా తమకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వర్క్‌షా్‌పలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని పలు నగరాలతో పాటు ముంబయిలో కూడా మా వాలంటీలర్లు ఉన్నారు. ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేయడంలోనూ వీరు నాకు సహకరిస్తారు. అందుకే విజయవంతంగా ఇన్ని కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాను. సముద్ర ప్రాంతాలకు వెళ్లినప్పుడు డైవింగ్‌ చేయడం నా అభిరుచి. దాని కోసం ‘పాడీ’ నుంచి స్కూబా డైవింగ్‌లో మూడు కోర్సులు చేశాను. ‘పాడీ’ (ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సాగర అన్వేషణ, డైవర్స్‌కు సంబంధించిన సంస్థ. 186 దేశాల్లో ఇది విస్తరించి ఉంది. ఈ కోర్సుల వల్ల నాకు డైవింగ్‌ ఒక్కటే కాదు... నీటి అడుగున జీవించే వాటిపై కూడా అవగాహన ఏర్పడింది.

వాటికి హాని...

సముద్రంలోకి దిగినప్పుడు ఎన్నో జీవరాశులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి మనం సృష్టించే కాలుష్యానికి బలికావడం చూశాను. తాబేళ్లు... జెల్లీ ఫిష్‌లను తింటాయి. ప్లాస్టిక్‌ కవర్లు సముద్రంలోకి విసిరేయడంవల్ల ఆ రెండిటికీ తేడాను అవి కనిపెట్టలేవు. నిత్యం వందలాది తాబేళ్లు ప్లాస్టిక్‌ తిని అనారోగ్యం పాలవుతున్నాయి. అలాగే పగడపు దిబ్బలు. వాతావరణ మార్పులవల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, అవి అద్భుతమైన తమ రంగులను కోల్పోతున్నాయి. కొన్నేళ్ల కిందట నేను డైవ్‌ చేసిన ప్రాంతం రకరకాల చేపలతో ఎంతో ఆహ్లాదంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ అవి మాయమయ్యాయి. అలాంటివి చూసినప్పుడు బాధ కలుగుతుంది.

ఏ ఒక్కరివల్లనో కాదు..

పర్యావరణానికి హాని కలిగిస్తున్న వ్యర్థాలను నియంత్రించాలంటే అది ఏ ఒక్కరివల్లనో సాధ్యం అయ్యేది కాదు. అలాగని దీని కోసం భారీఎత్తున కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి రోజూ మనం చేసే చిన్న చిన్న పనులు, అలవాట్లలో మార్పులు కూడా పెను ప్రభావం చూపగలవు. ఉదాహరణకు ప్టాస్టిక్‌ స్ర్టాలకు బదులు పేపర్‌ స్ట్రాలు ఉపయోగించడం. క్యారీ బ్యాగ్‌ల స్థానంలో నార, వస్త్ర సంచులు వాడటం లాంటివి. మనం వేసే చిన్న అడుగులు మంచి మార్పునకు కారణమవుతాయి.’’

-హనుమా

పరిశోధనలు చేస్తున్నా...

ప్రస్తుతం నేను హైదరాబాద్‌ రెజోనన్స్‌ స్కూల్‌లో పన్నెండో తరగతి చదువుతున్నాను. మా అమ్మ శ్వేత... కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా ఉన్నారు. నాన్న విష్ణు. ఓ లీగల్‌ సర్వీసెస్‌ కంపెనీకి వైస్‌ ప్రెసిడెంట్‌. నేను వచ్చే ఏడాది యూనివర్సిటీకి వెళతాను. మెకానికల్‌ ఇంజనీరింగ్‌తోపాటు ఆస్ర్టోఫిజిక్స్‌ చదవాలని అనుకొంటున్నాను. ప్రస్తుతం ఐఐటీ బాంబేతో కలిసి అండర్‌ వాటర్‌ డ్రోన్‌ అభివృద్ధి చేస్తున్నాను. ప్రొటోటైప్‌ బయోమెడికల్‌ డివైజె్‌సపై కొన్ని పరిశోధన పత్రాలు సమర్పించాను. వైకల్యంగల వ్యోమగాములను దృష్టిలో పెట్టుకొని ఈ పరిశోధన చేశాను. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ మెంటార్‌ నేతృత్వంలో పగడపు దిబ్బలను స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని పరిశోధనలు చేస్తున్నాను.

Updated Date - Dec 15 , 2025 | 02:30 AM