ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hormonal imbalances: భావోద్వేగాల పగ్గాలు హార్మోన్ల చేతుల్లో...

ABN, Publish Date - Aug 19 , 2025 | 04:31 AM

మహిళల మానసిక ఆరోగ్యం అంతర్గత హార్మోన్ల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవితంలోని వేర్వేరు దశల్లో హెచ్చుతగ్గులకు లోనయ్యే హార్మోన్ల ప్రభావాలు, వాళ్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉ

మహిళల మానసిక ఆరోగ్యం అంతర్గత హార్మోన్ల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవితంలోని వేర్వేరు దశల్లో హెచ్చుతగ్గులకు లోనయ్యే హార్మోన్ల ప్రభావాలు, వాళ్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి విరుచుకుపడడం, చికాకు ప్రదర్శించడం, తీవ్రంగా కుంగిపోవడం... ఇలాంటి భావోద్వేగాలు అయోమయానికీ, గందరగోళానికీ గురి చేస్తుంటే, అందుకు కారణమైన అస్తవ్యస్థ హార్మోన్లను అదుపులోకి తెచ్చుకోవాలంటున్నారు వైద్యులు.

నెలసరికి 15 రోజుల ముందు నుంచే శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో ఈస్ట్రోజన్‌ మోతాదు తగ్గుతూ ప్రొజెస్టరాన్‌ మోతాదు పెరుగుతుంది. ఈస్ట్రోజన్‌కూ సెరటోనిన్‌ అనే హ్యాపీ హార్మోన్‌కూ సంబంధం ఉంటుంది. ఈ సమయంలో సెరటోనిన్‌ కూడా తగ్గడంతో శరీరం బరువు పెరగడం, రొమ్ముల్లో సలపరం, చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం, కుంగిపోవడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. అయుతే ఈ పరిస్థితి కొందర్లో తీవ్రంగా ఉంటుంది. అలాంటివాళ్లు ప్రొటీన్‌ ఆధారిత ఆహారంతో పాటు ఫైటోఈస్ట్రోజన్స్‌ కలిగి ఉండే సోయా, మొలకలు తీసుకోవాలి. అలాగే ధ్యానం, యోగా వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అరుదుగా కొందర్లో భావోద్వేగాల తీవ్రత ఉధృతంగా ఉంటుంది. ఆత్మహత్య ఆలోచనలు కూడా వాళ్లను వేధిస్తాయి. ఇలాంటి వాళ్లు హర్మోన్ల ఉధృతిని తగ్గించే మందులు తీసుకోవాల్సి ఉంటుంది. శారీరక అసౌకర్యంతో పాటు, నెలసరి స్రావంలో సమస్యలు, భావోద్వేగాల సమస్యలు ఉంటే, వారికి వైద్యులు, కొన్ని రోజుల పాటు గర్భనిరోధక నోటి మాత్రలను సూచిస్తారు. వీటిలో ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి పరిస్థితి సర్దుకుంటుంది. భావోద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉంటే, అందుకు ఉద్దేశించిన యాంటీ డిప్రెసెంట్స్‌ను వాడుకోవాలి. అలాగే హ్యాపీ హార్మోన్‌ అయిన సెరటోనిన్‌ను పెంచుకుని మానసిక స్థితిని సరిదిద్దుకోవడం కోసం రోజుకు కనీసం అరగంట పాటైనా నడుస్తూ ఉండాలి లేదా వ్యాయామం చేయాలి.

గర్భిణులు, బాలింతల్లో ఇలా...

పునరుత్పత్తి సమయంలో కూడా శరీరంలో ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ పెరుగుతుంది. దాంతో భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. కుంగుబాటు వేధిస్తుంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణులకు కుటుంబ తోడ్పాటు ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా ప్రసవమైన వెంటనే ఈస్ట్రోజన్‌తో పాటు ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ కూడా అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దాంతో భావోద్వేగాల్లో మార్పులొస్తాయి. ఈ పరిస్థితికి తోడు ప్రసవానంతరం శరీరంలో చోటుచేసుకునే మార్పులు, అసౌకర్యం, నిద్రలేమి, సర్జరీ సంబంధిత నొప్పులు, ప్రతి రెండు గంటలకూ బిడ్డకు పాలు పట్టించడం లాంటివన్నీ తోడై మానసిక ఆరోగ్యం మరింత కుదేలవుతూ ఉంటుంది. అరుదుగా కొందర్లో ఆత్మహత్య ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు తలెత్తుతాయి. బిడ్డకు హాని తలపెట్టాలనే ఆలోచనలు కూడా కొందర్ని వేధిస్తాయి. ఈ పరిస్థితే... ‘పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌’. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే తల్లి, అత్త, భర్త... ఇలా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కొత్త తల్లికి ఆసరా అందించాలి. అవసరాన్ని బట్టి వైద్యుల చేత కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. అలాగే బిడ్డకు పాలివ్వడం వల్ల నిద్రాభంగమవుతూ ఉంటే, పాలు నిల్వ చేసుకుని కుటుంబసభ్యుల సహాయంతో బిడ్డకు పట్టించవచ్చు. ప్రసవంతో కెరీర్‌కు ఆటంకం ఏర్పడిందనే భయాలు కూడా బాలింతలను వేధిస్తూ ఉంటాయి. వీటిని తొలగించే బాధ్యత భర్తలు తీసుకోవాలి. అలాగే జంక్‌ఫుడ్‌, తీపి పదార్థాలకు బదులుగా సమతులాహారం తీసుకోగలిగితే, ఈ పరిస్థితి సర్దుకుంటుంది. అలాగే కంటి నిండా నిద్రపోవాలి. కోలుకున్న వెంటనే వ్యాయామాలు మొదలుపెట్టుకోవాలి. తల్లి బిడ్డకు పాలివ్వకుండా, పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటే, పరిస్థితిని పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ ముందరి స్థితిగా పరిగణించి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. తాత్కాలిక చికిత్సతో ఈ సమస్యను సరిదిద్దుకోవచ్చు.

మెనోపాజ్‌లో...

టీనేజీ వయసులో నెలసరి సమయంలో ప్రిమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌తో బాధపడిన అమ్మాయిలు మెనోపాజ్‌లో కూడా తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతారు. అలాగే మెనోపాజ్‌లోకి ప్రవేశించి, ఆ దశకు చేరుకునే క్రమంలో మహిళల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కోడళ్ల మీద విరుచుకుపడుతూ, అడపాదడపా ఏడుస్తూ, అసహనాన్ని ప్రదర్శించే అధిక శాతం అత్తల్లో మనం చూసిన భావోద్వేగాల వెనకుండే అసలు కారణం ఇదే! కానీ ఈ భావోద్వేగాలన్నీ హార్మోన్‌ అవకతవకల ప్రభావాలే అనే విషయాన్ని అందరూ గ్రహించలేరు. అయితే ఇలాంటి దశలో ఉన్న మహిళలకు మానసిక ఆలంబన ఎంతో అవసరం. కుటుంబ సభ్యులందరూ ఆమెకు అండగా ఉండి, తోడ్పాటును అందించాలి. అలాగే వ్యాయామంతో ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. కాబట్టి 40 ఏళ్లకు చేరుకున్న ప్రతి మహిళా దైనందిన జీవితంలో వ్యాయామానికి చోటు కల్పించాలి. కుటుంబసభ్యులతో కాలక్షేప సమయాన్ని పెంచుకోవాలి. వీలైనంత వరకూ మనసును ఆహ్లాదంగా ఉంచే పనులు ఎంచుకోవాలి. ఈ దశలో కండరాలు, ఎముకల నష్టం ఉంటుంది కాబట్టి క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడంతో పాటు, బరువులెత్తే వ్యాయామాలు చేయాలి. పరిస్థితి తీవ్రతను బట్టి సురక్షితమైన హార్మోన్‌ థెరపీ చికిత్సను కూడా ఆశ్రయించవచ్చు.

అర్థం లేని కుంగుబాటు

వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ఉన్నత స్థితిలో ఉన్న విజయవంతమైన మహిళలు కూడా కుంగుబాటుకు లోనవుతూ ఉంటారు. ఇందుకు కూడా హార్మోన్లే కారణం. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే మహిళలు హార్మోన్లను పరీక్షించుకుని, లక్షణాల ఆధారంగా చికిత్సను ఎంచుకోవాలి.

అత్యవసర గర్భనిరోధక మాత్రలతో...

ఈ మాత్రల్లో ప్రొజెస్టరాన్‌ అత్యధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి సంబంధిత దుష్ప్రభావాలను కూడా భరించవలసి వస్తుంది. పిల్‌ తీసుకున్న వారం రోజుల వరకూ చికాకు, కోపం, కుంగుబాటు లాంటి భావోద్వేగాలు వేధిస్తాయి. కాబట్టి ఇలాంటి మాత్రలను కేవలం అత్యవసర సమయాల్లోనే వాడుకోవాలి. కానీ తేలికగా కొనుక్కునే వీలుండడంతో వీటిని ఇష్టారాజ్యంగా వాడుకున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఫలితంగా నెలసరి క్రమం తప్పి, తిరిగి గాడిలో పడడానికి ఎంతో కాలం పడుతుంది. గర్భధారణ కూడా క్లిష్టంగా మారుతుంది. కొందరు ఎమర్జెన్సీ పిల్స్‌కు బదులుగా అదే ప్రభావంతో కూడిన ఇంజెక్షన్లు కూడా తీసుకుంటూ ఉంటారు. వీటితో రక్తం గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

డాక్టర్‌ స్వప్న పూస్కూరు

కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - Aug 19 , 2025 | 06:45 AM