ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Avocado Recipes: అవకాడోతో ఆరోగ్యంగా

ABN, Publish Date - Nov 22 , 2025 | 03:51 AM

చాలామంది అవకాడోలను చాలా ఇష్టంగా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. అవకాడో పచ్చడి గురించి అందరికీ తెలిసిందే. బాగా పండిన అవకాడోలతో సలాడ్స్‌, స్మూతీలు, మిల్క్‌ షేక్‌లు, కేక్‌లు ఇలా ఎన్నో రకాలు తయారుచేసుకుని ఆస్వాదిస్తుంటారు. పోషకాల గనిగా పరిగణించే అవకాడోతో తయారుచేసే విభిన్న వంటకాలు మీకోసం......

చాలామంది అవకాడోలను చాలా ఇష్టంగా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. అవకాడో పచ్చడి గురించి అందరికీ తెలిసిందే. బాగా పండిన అవకాడోలతో సలాడ్స్‌, స్మూతీలు, మిల్క్‌ షేక్‌లు, కేక్‌లు ఇలా ఎన్నో రకాలు తయారుచేసుకుని ఆస్వాదిస్తుంటారు. పోషకాల గనిగా పరిగణించే అవకాడోతో తయారుచేసే విభిన్న వంటకాలు మీకోసం.

అవకాడో టిక్కీ

కావాల్సిన పదార్థాలు

  • అవకాడోలు- రెండు, పచ్చి మిర్చి పేస్టు- ఒక చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, ఉప్పు- తగినంత, బియ్యప్పిండి- ఆరు చెంచాలు, పసుపు- చిటికెడు, నూనె- ఆరు చెంచాలు

తయారీ విధానం

  • అవకాడోలను మధ్యకు కోసి లోపలి భాగాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని చెంచాతో మెత్తగా మెదపాలి. తరువాత అందులో పచ్చి మిర్చి పేస్టు, జీలకర్ర పొడి, ఉప్పు, బియ్యప్పిండి, పసుపు వేసి బాగా కలపాలి.

  • స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని అవకాడో-బియ్యప్పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేళ్ల మీద చిన్న టిక్కీల మాదిరి చేసి మెల్లగా పాన్‌లో వేయాలి. రెండువైపులా ఎర్రగా వేగనివ్వాలి. తరువాత పళ్లెంలోకి తీయాలి. ఇలా తయారుచేసుకున్న అవకాడో టిక్కీలను వేడి వేడిగా టమాటా సాస్‌తో సర్వ్‌ చేసుకోవాలి.

గ్వాకమూలే

కావాల్సిన పదార్థాలు

  • అవకాడోలు- మూడు, నిమ్మకాయలు- రెండు, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- రెండు, కొత్తిమీర- ఒక చిన్న కట్ట, ఉప్పు- అర చెంచా, మిరియాల పొడి- ముప్పావు చెంచా

తయారీ విధానం

  • ఉల్లిపాయలు, టమాటాలను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కొత్తిమీరను నీళ్లతో శుభ్రంగా కడిగి ఆపైన సన్నగా తరగాలి. అవకాడోలను మధ్యకు కోసి లోపలి భాగాన్ని చెంచాతో గిన్నెలోకి తీయాలి. గంటె సహాయంతో దాన్ని మెత్తగా మెదపాలి.

  • వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో అవకాడో గుజ్జు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి చెంచాతో మెల్లగా కలపాలి. ఈ గిన్నెమీద మూతపెట్టి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఈ గ్వాకమూలేను చిప్స్‌, క్రాకర్స్‌తో సర్వ్‌ చేసుకోవాలి.

అవకాడో చాట్‌

కావాల్సిన పదార్థాలు

  • అవకాడోలు- రెండు, నిమ్మకాయలు- రెండు, ఉప్పు- తగినంత, నానబెట్టి ఉడికించిన శనగలు- అర కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- మూడు, ఉడికించి తొక్క తీసిన ఆలుగడ్డలు- రెండు, కారం- ఒక చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, చాట్‌ మసాలా- ఒక చెంచా, స్వీట్‌ చట్నీ- ఒక చెంచా, గ్రీన్‌ చట్నీ- ఒక చెంచా, క్రాకర్స్‌- అయిదు, సన్నని కారప్పూస- కొద్దిగా, బూందీ- రెండు చెంచాలు, దానిమ్మ గింజలు- కొన్ని, సన్నగా తరిగిన టమాటా ముక్కలు- కొన్ని, మరమరాలు- కొన్ని

తయారీ విధానం

  • అవకాడోలను మధ్యకు కోసి లోపలి భాగాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, నిమ్మరసం వేసి చెంచాతో బాగా మెదపాలి. తరువాత అందులో మెత్తగా మెదిపిన ఆలుగడ్డల మిశ్రమం, శనగలు, పచ్చి మిర్చి ముక్కలు, కారం, చాట్‌ మసాలా, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. దానిపైన చిదిమిన క్రాకర్స్‌, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ వేయాలి. ఆపైన టమాటా ముక్కలు, కారప్పూస, బూందీ, మరమరాలు, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి చివరగా నిమ్మరసం పిండితే రుచికరమైన అవకాడో చాట్‌ రెడీ..!

అవకాడో పుడ్డింగ్‌

కావాల్సిన పదార్థాలు

  • అవకాడోలు- రెండు, పాలు- రెండు కప్పులు, మిల్క్‌ మెయిడ్‌(కండెన్స్‌డ్‌ మిల్క్‌)- అర కప్పు, పిస్తా పప్పులు- కొన్ని, జీడి పప్పు పలుకులు- పది, పంచదార- పావు కప్పు, చైనా గ్రాస్‌ లేదా అగార్‌ అగార్‌ పౌడర్‌- ఒకటిన్నర చెంచా, వెనీలా ఎసెన్స్‌- అర చెంచా

తయారీ విధానం

  • అవకాడోలను మధ్యకు కోసి లోపలి భాగాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న గిన్నెలో జీడిపప్పు పలుకులు వేసి అవి మునిగేలా నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. మందపాటి గిన్నెలో పాలు, పంచదార, మిల్క్‌ మెయిడ్‌, అగార్‌ అగార్‌ పౌడర్‌, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి. ఈ గిన్నెను స్టవ్‌ మీద పెట్టి చిన్న మంట మీద వేడిచేయాలి. పాలను చెంచాతో కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరిగిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి.

  • బ్లెండర్‌లో అవకాడో ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, అర కప్పు మరిగించిన పాల మిశ్రమం వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. ఈ పేస్టుని మిగిలిన పాలలో వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక మౌల్డ్‌లోకి మార్చి ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి. మిశ్రమం గట్టిపడి కేక్‌లా మారుతుంది. దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పైన పిస్తా పలుకులు చల్లితే అవకాడో పుడ్డింగ్‌ రెడీ..!

Updated Date - Nov 22 , 2025 | 07:58 AM