Girija Oak National Crush India: కొత్త క్రష్
ABN, Publish Date - Nov 30 , 2025 | 02:09 AM
పదిహేనేళ్ల వయసులోనే వెండితెరపై మెరుపులు. షారూక్, ఆమిర్ లాంటి సూపర్‌స్టార్ల చిత్రాల్లో పాత్రలు. రెండు దశాబ్దాలు పైబడిన కెరీర్‌లో... అందమైన అభినయాలు... వరించిన పురస్కారాలు ఎన్నో...
ట్రెండింగ్
పదిహేనేళ్ల వయసులోనే వెండితెరపై మెరుపులు. షారూక్, ఆమిర్ లాంటి సూపర్‌స్టార్ల చిత్రాల్లో పాత్రలు. రెండు దశాబ్దాలు పైబడిన కెరీర్‌లో... అందమైన అభినయాలు... వరించిన పురస్కారాలు ఎన్నో. కానీ అవేవీ ఇవ్వని స్టార్ ఇమేజ్... ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఆమె సొంతమైంది. సామాజిక మాధ్యమాల యుగంలో... రాత్రికి రాత్రి ఇంటింటికీ పరిచయమైంది. అదే స్థాయిలో ఊహించని ఇబ్బందులనూ ఎదుర్కొంటోంది. ‘నీలం చీర అమ్మాయి’ (బ్లూ శారీ గాళ్)గా అంతర్జాలాన్ని ఊపేస్తున్న నయా ‘నేషనల్ క్రష్’... గిరిజా ఓక్ ముచ్చట్లు ఇవి.
‘థెరపీ షెరపీ’... ఇదో వెబ్‌సిరీస్. దీని ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతోనే గిరిజా ఓక్ గోడ్బోలే పేరు దేశమంతా మారుమోగిపోతోంది. వెబ్‌సిరీ్‌సలో సహనటుడు గుల్షన్ దేవయ్యతో చేసిన ఓ సాన్నిహిత్య సన్నివేశం గురించి అందులో ఆమె మాట్లాడింది. ‘‘ఆ సన్నివేశం తీస్తున్న సమయంలో గుల్షన్... ‘మీకు ఓకేనా’ అని కనీసం పదహారు పదిహేడుసార్లు అడిగాడు. నా సౌకర్యం కోసం తన వ్యానిటీ వ్యాన్ నుంచి రకరకాల దిండ్లు తెచ్చి ఇచ్చాడు. సహనటుడి నుంచి ఇంతటి గౌరవం, భద్రత లభించడం చాలా అరుదైన విషయం’’ అంటూ ఆమె తన షూటింగ్ అనుభవాలను పంచుకుంది. ‘‘సినిమా లేదా సిరీస్ కావచ్చు... అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు నటీనటులు ఇబ్బంది పడకుండా సెట్‌లో జాగ్రత్తలు తీసుకొంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు సందేహిస్తుంటాం. కానీ కొందరు నటులతో పని చేసేటప్పుడు ఆ అసౌకర్యం అనేదే ఉండదు. అలాంటివారిలో గుల్షన్ ఒకరు. తనవల్లే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశం పూర్తి చేయగలిగా’’ అంటూ ముగించింది. ఈ మాటలే యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అంతేకాదు... ఆ సందర్భంగా ఆమె పలికించిన హావభావాలు, నీలి రంగు చీరలో సంప్రదాయబద్దమైన ఆహార్యం చూసి నెటిజనులు ముగ్ధులయ్యారు. వీడియో క్లిప్పింగ్స్, ఫొటోలు తెగ షేర్ చేసేయడంతో గిరిజ హఠాత్తుగా సూపర్ స్టార్ అయిపోయింది. ‘నీలం చీర అమ్మాయి’గానూ కోట్లమంది హృదయాల్లో ముద్రపడిపోయింది. ‘ఇంతకీ ఎవరీమె’ అనే ఉత్సుకత మొదలైంది. అంతే... గిరిజ పేరుతో సెర్చ్ ఇంజిన్లు యమ బిజీ అయిపోయాయి. లక్షల్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. చాలామంది ఆమెను అంతర్జాతీయ తారలతో పోల్చారు. అంతిమంగా గిరిజా ఓక్ నయా ‘నేషనల్ క్రష్’గా అవతరించింది.
ట్రోల్స్... ట్రబుల్స్...
ఉన్నట్టుండి వచ్చిన స్టార్‌డమ్, బిరుదు కాని బిరుదు ‘నేషనల్ క్రష్’... ఈ హఠాత్ పరిణామం నుంచి కోలుకొనేలోపే గిరిజకు ట్రోల్స్, ట్రబుల్స్ మొదలయ్యాయి. కొన్నిటిని సానుకూలంగానే తీసుకున్నా... అన్నిటినీ ఆమె భరించలేకపోయింది. ‘‘మీరు చూపుతున్న ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. చాలామంది నన్ను ప్రశంసిస్తూ మెసేజ్‌లు పెడుతున్నారు. మీమ్స్ కూడా సృష్టించారు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతుంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! దీనివల్ల నాకు, నా సినిమాలకు అభిమానులు పెరుగుతున్నారు. ఇది సంతోషమే. కానీ కొందరు హద్దులు మీరి... నా ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీలత జోడిస్తున్నారు. నా పన్నెండేళ్ల కొడుకు తల్లి ఫొటోలను అలా చూస్తే ఎలా స్పందిస్తాడోనని ఆందోళన కలుగుతోంది. కొందరు నా పేరుతో ఫేక్ అకౌంట్లు తెరిచి డబ్బులు అడుగుతున్నారు. మీరు నిజంగా నటనను ఇష్టపడేవారే అయితే దయచేసి ఇలాంటివి మానుకోండి’’ అంటూ ఆవేదనతో వీడియో సందేశం విడుదల చేసిన గిరిజ... మరాఠీ ప్రముఖ నటుడు గిరీష్ ఓక్ తనయ. ముంబయి ‘ఠాకూర్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజీ’లో బయోటెక్నాలజీ డిగ్రీ పూర్తి చేసిన ఆమె నటనపై ఆసక్తితో చిన్నప్పుడే థియేటర్ వర్క్‌షా్‌పలో చేరింది. మొదట మోడలింగ్ చేసిన ఆమె... తరువాత మరాఠీ, హిందీ చిత్రాలతో పాటు పలు వెబ్‌సిరీ్‌సలు, టీవీ షోల్లో కూడా నటించింది. దర్శకనిర్మాత సుహ్రుద్ గోడ్బోలేను పెళ్లి చేసుకుంది. ఆయన తండ్రి మరాఠీ చిత్ర దర్శకుడు, మాటల రచయిత, నిర్మాత శ్రీరంగ్ గోడ్బోలే.
విభజన వచ్చింది...
అభ్యంతరకర సందేశాలు, వంకర వ్యాఖ్యలు పక్కన పెడితే... తనకు ఉన్నట్టుండి వచ్చిన స్టార్ ఇమేజ్‌ను గిరిజ ఆసాంతం ఆస్వాదిస్తోంది. ‘‘నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేదు. నేనే కాదు ఎవరూ ఊహించలేరు. అయితే ‘మీరు నా బేబ్‌గా ఉంటారా’ అంటూ నాకు ఒక మెసేజ్ వచ్చింది. నాకు పెళ్లయిందని, ఒక కొడుకు ఉన్నాడని, ఎన్నో ఏళ్లుగా థియేటర్ ఆర్టి్‌స్టగా కొనసాగుతున్నానని మీరు నా ఇన్‌స్టాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. అందువల్ల సహజంగానే ఒక గౌరవ భావన వస్తుంది. కానీ ‘నేషనల్ క్రష్’ ట్యాగ్‌వల్ల ‘బేబ్’ లాంటి మాటలను కూడా వినాల్సి వస్తోంది. దీంతో ‘నా పట్ల గౌరవం చూపాలా... లేక నన్ను లైంగిక దృష్టితో చూడాలా’ అనే విషయంలో అభిమానుల్లో ఒక ఆసక్తికర విభజన కనిపిస్తోంది’’ అని, తనతోపాటు తన కుటుంబం కూడా మెసేజ్‌లను చూసి బాగా ఆస్వాదిస్తున్నారని ఇన్‌స్టాలో ఆమె చెప్పుకొచ్చింది.
‘‘మా కుటుంబం సినీ రంగానికి చెందినదే కాబట్టి వారు వీటన్నిటినీ అర్థం చేసుకోగలరు. నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. కనుక ఈ అనుభూతి కొత్తగా ఉంది. సరదాగానూ అనిపిస్తోంది. ఇదంతా జరిగినప్పుడు మా అబ్బాయి స్కూల్ ట్రిప్‌లో ఉండటంతో వాడికి ఏమీ తెలియలేదు. అయితే తనను ఇంటికి తీసుకురావడానికి వెళ్లినప్పుడు విద్యార్థుల తల్లితండ్రులందరూ నన్ను చుట్టుముట్టారు. వీడియోల గురించి ఆసక్తిగా చర్చించారు. వాళ్లంతా ఏంమాట్లాడుతున్నారో వాడికి అర్థంకాలేదు. ఈ వైరల్ కాన్సెప్ట్ గురించి తరువాత వాడికి వివరించే ప్రయత్నం చేశాను. ‘ఇప్పుడు ఇంత పేరు వచ్చింది కదా... నువ్వు మారిపోతావా’ అని అడిగాడు. ‘ఎందుకు మారను! ఇది ‘గిరిజ-2 వెర్షన్. ఇకమీదట నువ్వు నాతో బాగా మాట్లాడాలి’ అని మొదట సరదాగా అన్నాను. కానీ తరువాత... ‘నేను ఎప్పటికీ మారను’ అని వాడికి భరోసా ఇచ్చాను.’’
అదే నేను...
తారస్థాయిలో పేరు, ‘నేషనల్ క్రష్’ ట్యాగ్‌తో మీ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా అని అడిగితే... ‘‘ఏమీ మారలేదు. అదే నేను. ఇప్పటికీ ఆటోరిక్షా దొరకడంలేదు. కొత్తగా ఆఫర్లూ రావడంలేదు’’ అని నవ్వుతూ బదులిచ్చింది. తన జీవితంలో అనుకోని ఈ ఘట్టాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నా... కొంతమంది తుంటరి మెసేజ్‌లు బాధ కలిగిస్తుంటాయని, కానీ వెనక మాట్లాడేవారు ఒకవేళ ముందుకు వస్తే సూటిగా మన కళ్లలోకి కూడా చూడలేరని అంటుంది గిరిజ. ఇవన్నీ ఎలావున్నా ఎప్పటిలానే తన ప్రాజెక్టులు, పనుల్లో బిజీగా ఉంది.
Updated Date - Nov 30 , 2025 | 02:09 AM