ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sirigudi Kavitha Coach: కష్టాలను గెలిచి కోచ్‌గా ఎదిగి

ABN, Publish Date - Nov 06 , 2025 | 05:27 AM

మన అమ్మాయిలు ప్రపంచ క్రికెట్‌ కప్‌ గెలుచుకోవటంతో దేశమంతా ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంది. ఇప్పటి దాకా కేవలం పురుషుల క్రికెట్‌కు మాత్రమే దక్కిన గౌరవం మహిళా క్రికెట్‌కు...

మన అమ్మాయిలు ప్రపంచ క్రికెట్‌ కప్‌ గెలుచుకోవటంతో దేశమంతా ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంది. ఇప్పటి దాకా కేవలం పురుషుల క్రికెట్‌కు మాత్రమే దక్కిన గౌరవం మహిళా క్రికెట్‌కు కూడా దక్కుతోంది. కానీ ఈ గౌరవాలేవీ అందకపోయినా- కేవలం క్రికెట్‌ మీద ప్రేమతో ఆటనే నమ్ముకున్నవారెందరో. అలాంటివారిలో ఒకరు లెవల్‌ 2 కోచ్‌గా అర్హత సాధించిన సిరిగుడి కవిత. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న షబ్నం, మహంతి, తమన్నా లాంటి క్రికెటర్లకు బేసిక్‌ స్థాయిలో కోచింగ్‌ ఇచ్చింది కూడా కవితే! ఆమె తన ప్రస్థానాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘మా నాన్న టాక్సీ డ్రైవర్‌. అమ్మ సాధారణ గృహిణి. రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితి. ‘మన ఆర్థిక స్థితికి ఆటలు సరిపడవు. బాగా చదువుకో..’ అంటూ ఉండేవారు. కానీ క్రికెట్‌ అంటే ఆసక్తి. స్కూల్లో చదువుతున్న సమయంలో క్రికెట్‌లో శిక్షణ పొందా. కానీ క్రికెట్‌ మీద మాత్రమే దృష్టి పెట్టలేని స్థితి. అందువల్ల ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు క్రికెట్‌ ప్రాక్టీసు చేస్తూ ఉండేదాన్ని. అంతే కాకుండా నా చిన్నప్పుడు క్రికెట్‌ ఆడే మహిళలు తక్కువే ఉండేవారు. ఎందుకంటే- మహిళా క్రికెట్‌కు ఎక్కువ ప్రోత్సాహం ఉండేది కాదు. 2004 నుంచి పురుషుల క్రికెట్‌ బోర్డు- మహిళా క్రికెట్‌ను కూడా నియంత్రించటం మొదలుపెట్టింది. దీనితో మహిళా క్రికెటర్లకు కొంత ప్రోత్సాహం లభించింది. విశాఖ జిల్లా క్రికెట్‌ సంఘం కూడా అమ్మాయిలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేది. నేను కూడా వేసవి క్రీడా శిక్షణ శిబిరంలోనే మెలకువలు అభ్యసించా. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నీలలో ఆడే అవకాశం లభించింది. 2013లో సౌత్‌జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల మహిళల క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాను. ఆ టోర్నీలో స్వర్ణ పతకం సాధించాం.

కోచ్‌గా ప్రస్థానం..

2014లో కోచ్‌గా నా ప్రస్థానం ప్రారంభమయింది. ఆ సమయంలోనే షబ్నం, మహంతి లాంటి క్రికెటర్లకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాను. వీరందరూ ప్రస్తుతం అండర్‌-19 భారత జట్టులో ఆడుతున్నారు. అలాగే ఏయూ సౌత్‌ జోన్‌, ఆలిండియా యూనివర్సిటీల మహిళా క్రికెట్‌ టోర్నీలలో స్వర్ణ పతకాలు గెలిచిన ఆంధ్ర విశ్వవిద్యాలయం జట్టుకు కోచింగ్‌ ఇచ్చాను. సీనియర్‌ విమెన్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన తొలి మహిళా క్రికెటర్‌ను నేనే! వృత్తిపరంగా అంతా బాగా సాగుతోందని భావిస్తున్న సమయంలో- మా అమ్మా, నాన్నా ఒకే ఏడాది మరణించారు. దీనితో తమ్ముళ్ల బాధ్యత కూడా నాపై పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వైపు క్రికెట్‌ కోచ్‌గా.. మరో వైపు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టీచర్‌గా పనిచేశాను. ఉదయం, సాయంత్రం కోచింగ్‌ ఇస్తూ.. రోజంతా స్కూల్లో పనిచేయటం చాలా కష్టమయ్యేది. రెండింటిలో ఒకటి మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రికెట్‌ మీద మక్కువతో కోచ్‌గానే స్థిరపడాలనుకున్నాను.

కోచింగ్‌తో పాటు..

చాలా మంది కోచింగ్‌ అంటే కేవలం ఆటలో మెలకువలు తెలియచెప్పటం అనుకుంటారు. కానీ కోచింగ్‌ అంటే- ఒక క్రీడాకారుల వ్యక్తిత్వాన్ని పూర్తిగా తీర్చిదిద్దటం. మెలకువలతో పాటుగా మానసిక సైర్థ్యాన్ని ఇవ్వటం కూడా చాలా ముఖ్యమైన పని. అందుకే క్రికెట్‌తో పాటుగా నేను యోగా, ప్రాణిక్‌ హీలింగ్‌ లాంటి కోర్సులు చేశాను. ఇవన్నీ నాకు కోచింగ్‌లో ఎంతో ఉపకరిస్తాయి. ఒక వైపు ఈ కోర్సులు చేస్తూనే- గత ఏడాది నేను లెవెల్‌-2 కోచ్‌గా అర్హత సాధించాను. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ అర్హతను సాధించిన రెండో మహిళను కావటం చాలా గర్వంగా అనిపిస్తోంది. ప్రస్తుతం నా దృష్టంతా కోచింగ్‌పైనే ఉంది. అందుకే పెళ్లి కూడా చేసుకోలేదు. మన దేశానికి ప్రతిష్ఠను తీసుకువచ్చే మహిళా క్రీడాకారులను తీర్చిదిద్దటమే నా లక్ష్యం. దాని కోసమే శ్రమిస్తున్నాను.’’

భాస్కర్‌, విశాఖపట్నం

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 05:27 AM