Harnaaz Bollywood Debut: బాలీవుడ్‌కు మరో విశ్వసుందరి
ABN, Publish Date - Aug 17 , 2025 | 03:45 AM
ఇతర పరిశ్రమల నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన మరో తార... హర్నాజ్ సంధు. చేసింది రెండే పంజాబీ చిత్రాలు. అయినా అందంతోపాటు నటనపరంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది...
టీజర్
ఇతర పరిశ్రమల నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన మరో తార... హర్నాజ్ సంధు. చేసింది రెండే పంజాబీ చిత్రాలు. అయినా అందంతోపాటు నటనపరంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పటి విశ్వసుందరిగా సుపరిచితురాలైన ఆమె... ఇప్పుడు ‘బాగీ4’లో టైగర్ షరా్‌ఫకు జోడీగా అదరగొట్టడానికి సిద్ధమవుతోంది.
కాస్త ఆలస్యమైనా మెగా ప్రాజెక్ట్‌తో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది హర్నాజ్. వచ్చే నెల ఐదున విడుదలవుతున్న ‘బాగీ4’లో సూపర్‌స్టార్లు సంజయ్‌దత్, టైగర్ షరా్‌ఫతో పాటు పంజాబీలో అగ్రతార సోనమ్ బజ్వా నటిస్తోంది. వారందరితో కలిసి తెరపై మురిపించే అరుదైన అవకాశం రావడంతో, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది హర్నాజ్. సాజిద్ నడియడ్‌వాలా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆమెది యాక్షన్ సన్నివేశాలతో కూడిన గ్లామరస్ పాత్ర. అందుకే దానిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తొలి చిత్రంతోనే బ్టాక్‌బస్టర్ దక్కుతుందని ఆశిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లలో హర్నాజ్‌ను చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు.
కల నిజమైన రోజు...
‘‘డిసెంబరు 12... నా జీవితంలో ఎంతో అమూల్యమైనది. ఆ రోజునే నేను ‘విశ్వసుందరి’ కిరీటాన్ని గెలుచుకున్నాను. మూడేళ్ల తరువాత మళ్లీ అదే రోజున ‘బాగీ4’ లాంటి భారీ ప్రాజెక్టులో భాగస్వామిని అయ్యాను. ఇది నా కొత్త ప్రయాణానికి నాందిగా భావిస్తున్నాను’’ అని ఓ సందర్భంలో తన సంతోషాన్ని పంచుకుంది హర్నాజ్. అంతేకాదు... నిర్మాత సాజిద్‌కూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ‘‘నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు దార్శనికుడైన సాజిద్ సర్‌కు రుణపడి ఉంటాను. ఆ నిర్మాణ సంస్థ కుటుంబంలో నేనూ ఒక సభ్యురాలిని అవడం ద్వారా నా కల నిజమైంది. నాపై నమ్మకం ఉంచి, ఎన్నో ఏళ్ల నా బాలీవుడ్ కలను నిజం చేసినందుకు ధన్యవాదాలు’’ అంటూ భావోద్వేగానికి లోనైంది.
చదువుకొంటూనే...
పంజాబ్ గురుదా్‌సపూర్ జిల్లా కోహలిలో పుట్టిన హర్నాజ్‌కు మొదటి నుంచి గ్లామర్ ప్రపంచంపై మక్కువ ఎక్కువ. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఆమె తండ్రి ప్రీతమ్‌పాల్ సింగ్ సంధు రియల్‌ఎస్టేట్ వ్యాపారి. తల్లి రబీందర్‌కౌర్ గైనకాలజిస్టు. కొంతకాలం బ్రిటన్‌లో ఉన్న ఆమె కుటుంబం, తిరిగి భారత్‌కు వచ్చాక చండీగఢ్‌లో స్థిరపడింది. హర్నాజ్... అక్కడి శివాలిక్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది. ప్రభుత్వ పీజీ కళాశాల నుంచి పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. పంజాబీతోపాటు హిందీ, ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడగలదు. చదువుకొంటూనే మోడల్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తల్లిదండ్రులు కూడా ఆమె అభిరుచిని కాదనలేదు.
మలుపు తిప్పిన మజిలీ...
కొంత కాలానికి హర్నాజ్ ప్రయత్నాలు ఫలించాయి. 2017లో స్థానిక అందాల పోటీల్లో పాల్గొని ‘మిస్ చండీగఢ్’ టైటిల్‌ను గెలుచుకుంది. ఏడాది తరువాత ‘మిస్ మాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా’ కిరీటం దక్కింది. 2019లో పంజాబ్ రాష్ట్రం నుంచి ‘ఫెమినా మిస్ ఇండియా’కు ఎంపికైంది. కానీ టాప్ 12కే పరిమితమైంది. అయితే 2021లో ‘మిస్ దివా’ టైటిల్ సాధించడంతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఆమె కెరీర్‌ను అనూహ్య మలుపు తిప్పింది. అదే ఏడాది జరిగిన ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో నెగ్గి, చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఈ ఘనత సాధించిన మూడో భారతీయురాలిగా రికార్డులకు ఎక్కింది. ‘మిస్ యూనివర్స్’గా ఇజ్రాయిల్, అమెరికా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం, దక్షిణాఫ్రికా తదితర దేశాలు చుట్టివచ్చింది. అదే ఏడాది పంజాబీ చిత్రంతో నటిగా కెరీర్‌ను ఆరంభించింది. ‘బాగీ4’తో హిట్ కొడితే బాలీవుడ్‌లో ఇక తనకు తిరుగులేదని భావిస్తోంది ఈ భామ. మరి ఆమె కోరిక నెరవేరుతుందా..? సెప్టెంబరు 5 వరకు... వెయిట్ అండ్ సీ!
ఇవి కూడా చదవండి
భారత్ ఇలాంటి దాదాగిరి ఎన్నటికీ చేయదు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఈ-ఆధార్ యాప్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం
For More National News and Telugu News
Updated Date - Aug 17 , 2025 | 03:45 AM