ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maithili Thakur Biography: జానపదం నుంచి జనపథంలోకి

ABN, Publish Date - Nov 16 , 2025 | 05:53 AM

అవకాశమిస్తే ఆటపాటల్లోనే కాదు రాజకీయాల్లో కూడా యువతులు సత్తాచూపగలరని నిరూపించింది ఓ యువతి. ఆమె ఎవరో కాదు.. బిహార్‌కు చెందిన గాయని, యూట్యూబర్‌ మైథిలీ ఠాకూర్‌. ఇటీవల జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో...

అవకాశమిస్తే ఆటపాటల్లోనే కాదు రాజకీయాల్లో కూడా యువతులు సత్తాచూపగలరని నిరూపించింది ఓ యువతి. ఆమె ఎవరో కాదు.. బిహార్‌కు చెందిన గాయని, యూట్యూబర్‌ మైథిలీ ఠాకూర్‌. ఇటీవల జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్‌ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమే కాదు... ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు ఆమె. జానపద గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న మైథిలి ప్రస్థానం ఇది.

మైథిలి.. బిహార్‌లోని మధుబని జిల్లా బెనిపెట్టిలో 2000 జూలై 25న జన్మించారు. తండ్రి రమేష్‌ ఠాకూర్‌ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడు, ఉపాధ్యాయుడు. తల్లి పూజ ఠాకూర్‌ గృహిణి. మైథిలి తాత కూడా సంగీతకారుడే. ఉపాధి కోసం ఢిల్లీకి మకాం మార్చింది మైథిలి కుటుంబం. ఆమె చదువంతా అక్కడే కొనసాగింది. బాల్‌ భవన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో పన్నెండో తరగతి వరకు చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ పూర్తిచేశారు. మైథిలికి రిషబ్‌ ఠాకూర్‌, అయాచి ఠాకూర్‌ అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఈ అక్కా తమ్ముళ్లకు సంగీతమంటే చాలా ఇష్టం. వీళ్లకి తాత, తండ్రి మొదటి గురువులు. మైథిలి.. భారతీయ శాస్త్రీయ, భక్తి సంగీతంలో శిక్షణ పొందారు. జానపదాలు పాడడం కూడా నేర్చుకున్నారు. రిషబ్‌ తబలా వాయిస్తాడు. అయాచికి తాళ వాయిద్యాల్లో ప్రవేశం ఉంది. బాగా పాడతాడు కూడా. పిల్లల సంగీత సాధన కారణంగా పదిహేడుసార్లు ఇల్లు మారాల్సివచ్చిందని, అయిదేళ్ల క్రితమే సొంత ఇల్లు కొనుక్కున్నామని మైథిలి తల్లి చెబుతున్నారు.

అంచెలంచెలుగా ఎదిగి...

భోజ్‌పురి, హిందీ భాషల్లో భక్తి పాటలు, జానపదాలు పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు మైథిలి. ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో కూడా ఎన్నో పాటలు ఆలపించారు. టీవీలో ప్రసారమయ్యే పలు సింగింగ్‌ రియాలిటీ షోలలో పాల్గొన్నారు. పదకొండేళ్ల వయసులోనే జీటీవీ సరిగమప లిటిల్‌ చాంప్స్‌లో ప్రతిభ కనబరచారు. సోనీ టీవీ ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌ పోటీలో సత్తా చాటారు. తరువాత సొంత ఆల్బం ‘యా రబ్బా’ను విడుదల చేశారు. 2017లో రైజింగ్‌ స్టార్‌ కార్యక్రమంలో రన్నర్‌పగా నిలిచారు. విదేశాల్లో సైతం పాటల ప్రోగ్రామ్‌లు, లిటరేచర్‌ ఫెస్ట్‌లు నిర్వహించారు. ఆమె బిహార్‌ సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా పనిచేశారు. గతంలో ఎన్నికల కమిషన్‌.. మైథిలితోపాటు ఆమె తమ్ముళ్లను మధుబని బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించింది. ఆమె 2021లో లోక్‌మత్‌ సుర్‌ జ్యోత్స్నా జాతీయ సంగీత పురస్కారాన్ని, ఆపైన భారత ప్రభుత్వం నుంచి అటల్‌ మిథిలా సమ్మాన్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవంలో మైథిలి పాడిన ‘మా శబరి’ పాటకు పలువురి ప్రశంసలు లభించాయి. శ్రీరామునికి శబరి పండ్లు తినిపించే ఘట్టాన్ని కళ్లముందు నిలిపావంటూ ప్రధాని మోది ప్రత్యేకంగా అభినందించారు కూడా.

సామాజిక మాధ్యమాల్లో...

మైథిలి సొంతంగా యుట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. అందులో తన తమ్ముళ్లతో కలిసి తులసీదాస్‌ విరచిత రామచరిత మాన్‌సను ఆలపిస్తున్నారు. మానస్పథ్‌ అనే ఈ ప్రోగ్రామ్‌ ఆ అక్కాతమ్ముళ్లకు మంచి పేరు తెస్తోంది. ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో కలిపి ఆమెకు కోటికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో అయితే 1.40 కోట్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం మైథిలి అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రదర్శనలు ఇస్తున్నారు. బాలీవుడ్‌ చిత్రాలకు కూడా పాటలు పాడారు. గత ఏడాది ‘ఔరోమ్‌ మే కహా థమ్‌ థా’ చిత్రంలో ఎంఎం కీరవాణి స్వరపరిచిన ‘కిసీ రోజ్‌’ పాట పాడారు.

కేంద్రం మొదటిసారి జాతీయ స్థాయి క్రియేటర్లకు అవార్డులు ప్రకటించినప్పుడు మైథిలి ‘కల్చరల్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికయ్యారు.

రాజకీయ ప్రస్థానం...

బీజేపీ తరపున బరిలోకి దిగిన మైథిలి.. అలీనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ అక్కడ బీజేపీ గెలవకపోవడం గమనార్హం. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన మైథిలి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ పర్సన్‌గా నిలిచారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, బాలికలు-మహిళల విద్య, ఉపాధి కల్పనలే ప్రధాన అజెండాగా ఆమె ప్రచారం కొనసాగించారు. పాఠశాలల్లో పెయింటింగ్‌ను అదనపు పాఠ్యాంశంగా చేర్చడంతోపాటు అలీనగర్‌ పేరును సీతానగర్‌గా మార్చాలనే ప్రతిపాదనలను ఆమె ఎన్నికల హామీల్లో వినిపించారు. పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. 51 ఏళ్ల బిహార్‌ అసెంబ్లీ ప్రస్థానంలో 25 ఏళ్ల యువతి అడుగుపెట్టడంతో రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికినట్లేనని అక్కడి ప్రజలు చెప్పుకోవడం విశేషం.

ఇవి కూడా చదవండి..

బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా

ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 16 , 2025 | 05:53 AM