ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Women Bold Journey: పర్వతారోహణ నుంచి జలక్రీడల్లోకి

ABN, Publish Date - Jul 17 , 2025 | 05:10 AM

అభిరుచి ఎప్పుడెలా ఉన్నత శిఖరాలకు చేరుస్తుందో ఎవరూ ఊహించలేరు. సూరత్‌కు చెందిన 27 ఏళ్ల అనుజ వైద్య కథ ఇలాంటిదే! పర్వతారోహణతో మొదలైన ఆమె క్రీడాసక్తి, జలక్రీడల మీదకు మళ్లి, అంతర్జాతీయ జలక్రీడా పోటీల్లో..

స్ఫూర్తి

అభిరుచి ఎప్పుడెలా ఉన్నత శిఖరాలకు చేరుస్తుందో ఎవరూ ఊహించలేరు. సూరత్‌కు చెందిన 27 ఏళ్ల అనుజ వైద్య కథ ఇలాంటిదే! పర్వతారోహణతో మొదలైన ఆమె క్రీడాసక్తి, జలక్రీడల మీదకు మళ్లి, అంతర్జాతీయ జలక్రీడా పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగేలా చేసింది. 2025 ఆసియా వాటర్‌ స్కీ అండ్‌ వేక్‌బోర్డ్‌ ఛాంపియన్‌షి్‌పకు భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన తొలి యువతిగా పేరు పొందిన 27 ఏళ్ల అనుజ ప్రస్థానమిది.

వజ్రాల నగరం సూరత్‌కు చెందిన అనుజ, సాహసోపేతమైన క్రీడా ఔత్సాహికురాలు. తన చెల్లెలితో కలిసి 2019లో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిందామె. తాజాగా జూన్‌ 24 నుంచి 29 వరకూ థాయిల్యాండ్‌లో జరిగిన ఆసియా వాటర్‌స్కీ అండ్‌ వేక్‌బోర్డ్‌ ఛాంపియన్‌షి్‌పలో పాల్గొని ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ అనుభవం గురించి వివరిస్తూ.. ‘దాదాపు ఏడేళ్లుగా నాన్నతో కలిసి తాపి నదిలో వాటర్‌స్కీయింగ్‌ సాధన చేస్తున్నాను. ఈ ఏడేళ్ల కాలంలో నాకున్న సామర్థ్యాన్ని అంచనా వేయగలిగాను. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగిన విషయాన్ని కూడా గ్రహించాను. కాబట్టి అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడి, స్వీయ సామర్థ్యాన్ని పరీక్షించుకోవడంలో తప్పేముందని అనిపించింది. కాబట్టే ఈ పోటీలో పాల్గొన్నాను. నిజానికి నాకు ఇదొక అద్భుతమైన అనుభవం. అంతకు ముందు వరకూ స్థానిక జలాల్లో, పరిమిత వనరులతో సాఽధన చేశాను కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడం కోసం, ముందుగానే థాయిల్యాండ్‌ చేరుకుని, వేర్వేరు పరికరాలతో, వేర్వేరు క్రీడాకారులతో కలిసి సాధన చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది అనుజ. తాపి నదిలో సాధన చేసే సమయంలో సాదాసీదా దుస్తులు, పరికరాలను ఉపయోగించినప్పటికీ, అంతర్జాతీయ వేదిక మీద, తన కూతురు ప్రతిభ కనబరచడం గర్వంగా ఉందని అనుజ తండ్రి ఆనంద్‌ కూడా చెప్పుకొచ్చారు. ఆసియా వాటర్‌స్కీయింగ్‌ అండ్‌ వేక్‌బోర్డింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ 2025ను, థాయిల్యాండ్‌ ఎక్స్‌ట్రీమ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించింది. ఈ పోటీల్లో అనుజతో పాటు భారతీయ అథ్లెట్లు, విలాస్‌ థాకరే, అరవింద్‌ రతూరిలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ అంతర్జాతీయ పోటీలో ఒక భారతీయ మహిళ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

పర్వతారోహణతో మొదలై...

చిన్నప్పటి నుంచి అనుజ వైద్య ఎన్నో క్రీడల్లో పాల్గొంది. ట్రెక్కింగ్‌, ఈత ఆమెకిష్టమైన క్రీడలు. ఉత్తరాఖండ్‌కు చెందిన తన తల్లి నుంచి క్రీడా స్ఫూర్తిని పొందిన అనుజ, చెల్లెలు అదితితో కలిసి, చిన్న వయసులోనే పర్వతారోహణ కూడా మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఏడు పర్వత శిఖరాలను అధిరోహించింది. గుజరాత్‌లోని మౌంట్‌ విన్సన్‌ మాసిఫ్‌, కార్స్‌టెన్స్‌ పిరమిడ్‌లను అధిరోహించిన తొలి యువతిగా కూడా అనుజ చరిత్ర సృష్టించింది. అనుజ, ఆమె చెల్లెలు అదితి, ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి, గుజరాత్‌కు చెందిన ఎవరెస్టు సిస్టర్స్‌గా పేరు పొందారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన రెండవ అక్కాచెల్లెళ్ల జంట కూడా తమదేనని అనుజ ఇన్‌స్టాలో కూడా ప్రకటించుకుంది. ఈ అక్కాచెల్లెళ్లు, గెట్‌ సెట్‌ అడ్వెంచర్స్‌ అనే అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ కంపెనీని స్థాపించి క్రీడల పట్ల తమకున్న మక్కువను కూడా చాటుకున్నారు. అలాగే తమ లాంటి సాహసికులకు ఆశ్రయం కల్పించడం కోసం ఉత్తరాఖండ్‌లో యాయవర్స్‌ అనే హోమ్‌స్టేను కూడా నెలకొల్పారు.

తొలి ప్రయత్నంలోనే ఫైనల్స్‌కు చేరుకుని...

తొలి అంతర్జాతీయ వాటర్‌స్కీయింగ్‌ పోటీల్లో అనుజ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఫైనల్స్‌కు చేరుకోగలిగింది. పూర్వానుభవం కలిగిన మలేషియా, జపాన్‌కు చెందిన అభ్యర్థులు అంతిమంగా ఈ పోటీల్లో విజయం సాధించారు. అయితే అత్యంత శారీరక దారుఢ్యంతో పాటు మెరుపు వేగంతో కదిలే నైపుణ్యం ఉండవలసిన ఈ జలక్రీడల్లో ప్రతిభ కనబరచడం ఆషామాషీ వ్యవహారం కాదు. మోటార్‌బోటు వేగంగా లాక్కెళ్లే స్కీ మీద కదులుతూ విన్యాసాలు ప్రదర్శించడానికి, బలంతో పాటు సంతులనం, టైమింగ్‌ కూడా అవసరమే! సవాలుతో కూడిన ఈ క్రీడలో అంతర్జాతీయ వేదిక మీద భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగడం కచ్చితంగా గర్వించదగిన విషయమే! అనుజ, మున్ముందు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుందాం!

అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడి, స్వీయ సామర్థ్యాన్ని పరీక్షించుకోవడంలో తప్పేముందని అనిపించింది. కాబట్టే ఈ పోటీలో పాల్గొన్నాను. నిజానికి నాకు ఇదొక అద్భుతమైన అనుభవం. అంతకు ముందు వరకూ స్థానిక జలాల్లో, పరిమిత వనరులతోనే సాధన చేశాను.

- అనుజ వైద్య

ఈ వార్తలు కూడా చదవండి..

ముగిసిన సీఎంల భేటీ.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం.. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2025 | 05:11 AM