Telugu States CMs: సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం.. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:14 PM
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
న్యూఢిల్లీ, జులై 16: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం న్యూఢిల్లీలో (బుధవారం) కొనసాగుతోంది. సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, సీఎస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి బనకచర్ల సింగిల్ పాయింట్‌ను ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో పెట్టింది. పాలమూరు -రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత - చేవెళ్ల సహా పలు కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది.

ఏపీ ప్రభుత్వ ఎజెండా
1. గోదావరి - బనకచర్ల లింకు ప్రాజెక్టుపై చర్చ
తెలంగాణ ప్రభుత్వ ఎజెండాలోని 13 అంశాలు
1. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి
2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్‌కు నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి.
3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణా ట్రిబ్యునల్‌లో మద్దతుగా వాదించేలా ఏపీని ఒప్పించాలి.

4. కృష్ణానది జలాలను వేరే బేసిన్‌కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. కృష్ణా జలాలను అక్రమంగా తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదే ప్రభుత్వం ఒప్పుకోవాలి.
5. తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలి.
6. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు పునరుద్ధరణ జరపాలి. ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలి.

7. శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలి.
8. శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా,వెలిగొండ,గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలి.
9. శ్రీశైలం డ్యామ్ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి.

10. అక్రమంగా శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనిని అడ్డుకోవాలి
11. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపునకు తాము సిద్ధం. అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలి.
12. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలి.
13.ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏఐబిపి కింద నిధులు మంజూరు చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలి.
మరోవైపు..
ఈ సమావేశంలో బనకచర్ల ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గోదావరి - బనకచర్ల లింకు ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రంలో కరువు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం - బనకచర్ల లింకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింకు ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
అసలు, సిసలు సైకో పార్టీ వైసీపీ.. కోటంరెడ్డి ఫైర్
కేంద్రమంత్రి మన్సుఖ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే
Read Latest AP News And Telugu News