From Despair to Hope: నిరాశ వదిలించి...నవజీవనం వైపు
ABN, Publish Date - Dec 24 , 2025 | 06:25 AM
ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనకు సకాలంలో అడ్డుకట్ట వేస్తూ, ఆ విపత్తుకు శాశ్వత ముగింపు పలుకుతోంది ‘వన్ లైఫ్ సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్’. లాభాపేక్ష లేని ఈ సంస్థకు చెందిన మెంటర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ రెబెకా మారియా ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలు...
ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనకు సకాలంలో అడ్డుకట్ట వేస్తూ, ఆ విపత్తుకు శాశ్వత ముగింపు పలుకుతోంది ‘వన్ లైఫ్ సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్’. లాభాపేక్ష లేని ఈ సంస్థకు చెందిన మెంటర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ రెబెకా మారియా ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలు...
‘‘ఆత్మహత్యకు పాల్పడే మార్గాల కోసం అన్వేషించేవారు కచ్చితంగా ఇంటర్నెట్‌లో వెతుకుతారు. ఆ ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికీ ఆత్మహత్య నివారణకు చెందిన హెల్ప్ లైన్ నంబర్లు కనిపిస్తాయి. అలా వన్ లైఫ్ సంస్థను ఆశ్రయించిన వారికి తగిన కౌన్సెలింగ్‌ను అందించి, జీవితం పట్ల ఆశను కల్పించి, ఆత్మహత్య ఆలోచన మాన్పించేలా సహాయపడుతూ ఉంటాం. ఇందుకోసం మా దగ్గర 120 మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లందరూ వేర్వేరు రంగాలు, వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు. దేశం నలుమూలల నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వాలంటీర్లు వేర్వేరు భాషల్లో కౌన్సెలింగ్ కోసం అందుబాటులో ఉంటారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని, తీవ్రతను అంచనా వేసి, ఆ ఆలోచన విరమించుకునేలా చేయడానికి ఎంతో నేర్పు, ఓర్పు అవసరమవుతాయి. ఆత్మహత్య ఆలోచన ఎందుకొచ్చింది? దాని వెనకున్న కారణాలేంటి? అన్నది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే భావోద్వేగాలను అర్థం చేసుకుని, ఆలోచన తీవ్రతను అంచనా వేయడం కూడా ముఖ్యమే! కాబట్టి వాలంటీర్ల శిక్షణ వ్యూహాత్మకంగా సాగుతుంది. ఒకటిన్నర నెల శిక్షణ, ఆ తర్వాత 3 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వాళ్లనే వాలంటీర్లుగా నియమించుకుంటాం. ప్రారంభంలో మాక్ కాల్స్ ద్వారా వాలంటీర్ల కౌన్సెలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించి, అంతిమంగా టెలి కౌన్సెలింగ్‌కు అనుమతిస్తాం. మా దగ్గర శిక్షణ పొందిన వాలంటీర్లు అందరూ సర్టిఫైడ్ కౌన్సెలర్లే!
ఓర్పు, నేర్పులతో...
కొందరు ఆత్మహత్య గురించిన ఆలోచన వచ్చినా దానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఇంకొందరు ఆ ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ క్షణం వాళ్ల ఆలోచనను ఆత్మహత్య నుంచి ఆశావహ భవిష్యత్తు వైపుకు మళ్లించడం ప్రధానం. మరీ ముఖ్యంగా ఆత్మహత్యకు పాల్పడేవాళ్లు, తమ బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే వేదనకు గురవుతూ ఉంటారు. అంతటి కష్టం తనకి మాత్రమే వచ్చిందనే భ్రమలో ఉంటారు. తమ సమస్యకు చావు తప్ప మరో పరిష్కారం లేదని బలంగా నమ్ముతూ ఉంటారు. ఇలాంటి వాళ్ల మాటలను ఓపికగా విని, ఓదార్చడంతో పాటు, జోర్నల్ రాయడం, సానుకూల ధృక్పథాన్ని అలవరుచుకోవడం, మానసిక ప్రశాంతతను అందించే యోగా, ధ్యానం లాంటి సెల్ఫ్ కేర్ యాక్టివిటీ్‌సను కూడా సూచిస్తూ ఉంటాం. ముఖాముఖి మాట్లాడినప్పుడు ఎదుటివారి భావోద్వేగాలను ప్రత్యక్షంగా చూడగలుగుతాం. కానీ టెలి కౌన్సెలింగ్‌లో ఆ అవకాశం ఉండదు. అయినప్పటికీ పరిస్థితిని అంచనా వేయగలుగుతాం. పరీక్షల ఒత్తిడి, ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు... ఇలా ఆత్మహత్యకు పురిగొల్పే అంశాలు అనేకం ఉంటాయి. కాబట్టి వారిని వేధిస్తున్న సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుని, సాధ్యమైన పరిష్కారాన్ని సూచిస్తాం. అవసరాన్ని బట్టి విడతలవారీ టెలి కౌన్సెలింగ్ చేస్తాం. ఆత్మహత్య ఆలోచన విరమించుకున్న తర్వాత కూడా, అప్పుడప్పుడూ కాల్ చేస్తూ క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆత్మహత్య ఆలోచనకు మానసిక సమస్యలు కారణమని తేలితే, మానసిక వైద్యులను కలవమని కూడా సూచిస్తూ ఉంటాం. కౌన్సెలింగ్‌తో ఆత్మహత్య ఆలోచనను విరమించుకుని, మా సంస్థకు వాలంటీర్లుగా పని చేయడానికి ముందుకొచ్చిన వాళ్లు కూడా ఉన్నారు
ఆత్మహత్య మానుకుని వాలంటీరుగా మారి...
సైన్యంలో ఉన్నత హోదాలో సేవలందించిన ఒక వ్యక్తి, కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ దగ్గరకు చేరుకుని, నీళ్లలోకి దూకి చనిపోబోతున్నానంటూ వన్ లైఫ్‌కు కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఫోన్లో కౌన్సెలింగ్ అందించి, అతని ప్రయత్నాన్ని అడ్డుకునే సమయం లేదు. ఏమాత్రం తాత్సారం చేసినా విలువైన ప్రాణాలు పోతాయి. కాబట్టి అప్పటికప్పుడు పరిస్థితి తీవ్రతను అంచనా వేసి, స్వయంగా నేనే రంగంలోకి దిగి, దోమలగూడ పోలీస్ స్టేషన్‌కు అతని వివరాలను అందించాను. వెంటనే పోలీసులు అప్రమత్తమై, ట్యాంక్‌బండ్‌కు చేరుకుని, అతన్ని అడ్డుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పుడు స్టేషన్‌కు వెళ్లి, అతన్ని కలిసి, వ్యక్తిగతంగా కౌన్సెల్ చేశాను. ఆ తర్వాత కొంత కాలానికి అతను కూడా మా సంస్థకు వాలంటీర్‌గా మారిపోయి, తనలాంటి ఇతరులకు కౌన్సెలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒక సందర్భంలో కర్ణాటకకు చెందిన ఒక మహిళ ఒక స్ర్టిప్ నిద్ర మాత్రలు మింగి, దిక్కుతోచని స్థితిలో మాకు కాల్ చేసింది. అప్పుడు తనంతట తానే క్యాబ్‌లో ఆసుపత్రికి వెళ్లేలా ఆమెను ప్రేరేపించి, అదే సమయంలో ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి తగిన చికిత్స ఏర్పాట్లను సిద్ధం చేయించాం.’’
గోగుమళ్ల కవిత పదిహేను రకాల థెరపీలు
‘‘నేను ఎమ్‌ఎ సైకాలజీ చేశాను. ఫ్యామిలీ కౌన్సెలింగ్, ఛైల్డ్ కౌన్సెలింగ్, అడిక్షన్ కౌన్సెలింగ్ చేస్తూ ఉంటాను. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్, యాంగర్ మేనేజ్‌మెంట్... ఇలా 15 రకాల థెరపీలను కూడా అందిస్తూ ఉంటాను. మాది హైదరాబాదే! మావారు కల్పేష్ దానిధారియా వ్యాపారి. మాకు ఇద్దరు మగ పిల్లలు. ప్రస్తుతం వన్‌లై్‌ఫకు మెంటర్‌గా పనిచేయడంతో పాటు ఛైల్డ్ అండ్ విమెన్ ప్రొటెక్షన్‌కు ఫ్యామిలీ కౌన్సెలర్, ఛైల్డ్ సైకాలజి్‌స్టగా కూడా సేవలందిస్తున్నాను.’’
వన్ లైఫ్ హెల్ప్‌లైన్: 7893078930
Updated Date - Dec 24 , 2025 | 06:25 AM