For Humanity as a Human: మనిషి కోసం మనిషిలా...
ABN, Publish Date - Dec 19 , 2025 | 06:19 AM
ప్రపంచంలోని క్రైస్తవులందరూ క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్న రోజులివి. కాంతిని ఆరాధించడమే క్రిస్మస్. బైబిల్ ప్రకారం విశ్వంలో మొదట జన్మించినది కాంతి....
ప్రపంచంలోని క్రైస్తవులందరూ క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్న రోజులివి. కాంతిని ఆరాధించడమే క్రిస్మస్. బైబిల్ ప్రకారం విశ్వంలో మొదట జన్మించినది కాంతి. ‘‘ఆ కాంతిని నేనే’’ అని క్రీస్తు ప్రకటించాడు. ఆయన మానవులను వెతుక్కుంటూ భువికి దిగి వచ్చాడు. మనిషి కోసం మనిషిలా పుట్టాడు. అంత అవసరం ఎందుకు కలిగింది?
మానవాళి బాగుకోసం
మానవులను ప్రేమతో సృష్టించిన దేవుడు... వారు భ్రష్టులైపోవడం గమనించాడు. తన అందమైన శిల్పం పాడయితే ఒక కళాకారుడు ఎంత దుఃఖపడతాడో అలా ఆవేదన చెందాడు. మానవాళిని బాగు చేయడం కోసం, తన సృష్టికి పునఃసౌందర్యం తేవడం కోసం, మనిషిని మనిషిగా చేయడానికి దిగి వచ్చాడు. మానవ జన్మకోసం సజ్జనులైన తల్లిదండ్రులను ఎంచుకున్నాడు. ఒక మామూలు పశువులశాలలో జన్మించాడు. తాను పుట్టబోయే ముందు... ఆ శుభవార్తను చెప్పడం కోసం తన దూతలను, ధగధగలాడే తోకచుక్కను పంపించాడు. ఆ వార్త తెలియవలసింది పెద్ద పెద్ద రాజగృహాలకు కాదు, మంటలు వేసుకొని, చలి కాచుకొనే గొర్రెల కాపరులకు. ‘తోకచుక్కను చూసి భయపడవద్దు. చిన్ని దేవుడు పుట్టాడు’’ అనేది ఆ సందేశం.
అదే పరమార్థం
దేవుడు దేవునిగానే ఆర్భాటంగా ప్రత్యక్షం కావచ్చు. గొప్ప రాజ వంశంలో పుట్టవచ్చు. కానీ ఆయన సామాన్యుడిగానే జన్మించాడు. మనిషి ఏవేవి చేయగలడో, ఎంత చక్కగా చేయగలడో మానవాళికి నేర్పడానికే మనిషిగా పుట్టాడు. లోకానికి దారి చూపడానికి మంత్రాలు, మహిమలు అవసరం లేదని నిరూపించాడు. ‘‘మనిషిని మనిషి ప్రేమించాలి. కరుణతో ప్రవర్తించాలి, త్యాగబుద్ధితో నడవాలి. మానవతతో మెలగాలి’’ అని ప్రబోధించాడు. మానవులకు ఏది చేయాలని బోధించాడో... దాన్ని ఆచరించాడు. చివరకు సాధారణంగానే మరణించాడు. అద్భుతాలు చేసి, శిలువపై మరణయాతనను తప్పించుకోవాలని అనుకోలేదు. హింసలను, నిందలను, మృత్యుబాధను తప్పించుకోవడం ఆయనకు సమస్య కాదు. కానీ తన మానవ అవతార ధర్మానికి భంగం వాటిల్లనివ్వలేదు. ఆయన చెప్పిన సత్యాన్ని, నేర్పిన ఆచరణను అనుసరించాలనే సందేశమే క్రిస్మస్ పరమార్థం. క్రిస్మస్ ప్రాదేశికమైన హద్దులను చెరిపివేసిన పండుగ. ఆ పండుగ కాంతులు జీవితాల్లో నిండాలంటే మనలో క్రీస్తును నింపుకోవాలి.
-డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్ 9866755024
Updated Date - Dec 19 , 2025 | 06:19 AM