Doctors as Life-Savers: వైద్యులు... ప్రాణ దాతలు
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:02 AM
వృద్ధుల్లో గుండె జబ్బుల చికిత్సలు క్లిష్టతరం. సర్జరీకి వాళ్ల శరీరాలు సహకరించవు. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇన్వేసివ్ చికిత్సలనే ఎంచుకుంటూ ఉంటాం! కానీ కొన్ని సందర్భాల్లో అది కూడా సాధ్యపడకపోవచ్చు.
మృదుస్వభావులుగా, సున్నితంగా కనిపించే వైద్యులు కొన్ని సందర్భాల్లో యుద్ధ సైనికుల్లా మారిపోక తప్పదు. రోగి ప్రాణాలు కాపాడడం కోసం చురుగ్గా స్పందించి, యుద్ధప్రాతిపదికన సర్జరీలకు సిద్ధపడే పరిస్థితులను కూడా వైద్యులు ఎదుర్కొంటూ ఉంటారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అలాంటి కొన్ని జీవితానుభావాలను వైద్యులు ఇలా పంచుకున్నారు.
82 ఏళ్ల మహిళకు గుండె సర్జరీ
వృద్ధుల్లో గుండె జబ్బుల చికిత్సలు క్లిష్టతరం. సర్జరీకి వాళ్ల శరీరాలు సహకరించవు. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇన్వేసివ్ చికిత్సలనే ఎంచుకుంటూ ఉంటాం! కానీ కొన్ని సందర్భాల్లో అది కూడా సాధ్యపడకపోవచ్చు. కొంత కాలం క్రితం అలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. ఆమెకు 82 ఏళ్లు. కళ్లు తిరిగి పడిపోతున్న ఆమెను స్థానిక వైద్యులకు చూపిస్తే, వాళ్లు గుండె జబ్బుగా నిర్థారించారు. పెద్ద వయస్కుల్లో గుండె దగ్గర బృహద్ధమని సన్నబడిపోతూ ఉంటుంది. దాంతో మెదడుకు సరిపడా రక్తం అందక కళ్లు తిరిగి పడిపోతూ ఉందామె. అయితే ఆమెది పెద్ద వయసు కాబట్టి క్యాథెటర్ ద్వారా రక్తనాళం గుండా బృహద్ధమనికి చేరుకుని దాన్ని మార్చే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియకు ముందు రక్తనాళాల్లో అడ్డంకులను కనిపెట్టడం కోసం కరొనరీ యాంజియోగ్రామ్ కూడా చేయవలసి ఉంటుంది. ఈ పరీక్షలో ఆమె మూడు రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నట్టు తెలిసింది. అయితే ఆవిడది పెద్ద వయసు కాబట్టి క్యాథెటర్ ద్వారా కవాటాన్ని మార్చడానికి వైద్యులు వెనకాడారు. అలాగని ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. అలా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో నా దగ్గరకు వచ్చిన ఆ వృద్ధురాలికి అత్యవసరంగా 3 బైపా్‌సలతో పాటు ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా విజయవంతంగా కవాటాన్ని కూడా మార్చగలిగాను. సర్జరీ జరిగిన ఐదో రోజునే డిశ్చార్జ్ అయిపోయిందామె. ఏడాది తర్వాత వచ్చి నన్ను కలిసి, పనులన్నీ స్వయంగా చేసుకోగలుగుతున్నట్టు చెప్పినప్పుడు నాకెంతో సంతృప్తి కలిగింది.
ఇప్పటివరకూ దాదాపు 20 వేల గుండె సర్జరీలు చేశాను. కాబట్టి నేను తీసుకున్న శిక్షణ, సుదీర్ఘ అనుభవాలు ఈ సర్జరీకి అక్కరకొచ్చాయని అనుకోవచ్చు. పి.వి నరసింహా రావు, ఎన్‌టి రామారావు, జైల్ సింగ్ లాంటి ప్రముఖులకు గుండె సర్జరీలు చేసిన అమెరికాలోని టెక్సాస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లోనే నేను కూడా శిక్షణ పొందాను. అక్కడ 90, 100 ఏళ్ల రోగులకు కూడా గుండె సర్జరీలు చేసిన సందర్భాలున్నాయి. అలాగే మన దేశం లో గుండె సర్జరీలకు సంబంధించి కొన్ని ప్రొటోకాల్స్ ఉంటాయి. వాటిని నేనే రూపొందించాను. రక్తం పలచబడే మందులను జీవితాంతం వాడుకోవలసిన అవసరం లేని కృత్రిమ గుండె కవాటాన్ని కూడా రూపొందించాను. ప్రస్తుతం అది ప్రయోగ దశలో ఉంది. ఇలా గుండె సమస్యలు, చికిత్సల పట్ల నాకున్న లోతైన పరిజ్ఞానంతో క్లిష్టమైన సర్జరీలను సవాలుగా తీసుకుని, విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నాను.
-డాక్టర్ లోకేశ్వర రావు సజ్జ
సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్
మరణం అంచ నుంచి వెనక్కి
రోగులకే కాదు కొన్ని సందర్భాల్లో వైద్యుల చేతిలో కూడా సమయం ఉండదు. మరీ ముఖ్యంగా అత్యవసరంగా రోగి ప్రాణాలు కాపాడవలసిన సందర్భాల్లో వైద్యులు చురుగ్గా ఆలోచించి, చకచకా నిర్ణయాలు తీసుకోవలసి వస్తూ ఉంటుంది. అలాంటి ఒక సందర్భం కొవిడ్‌కు ముందు ఎదురైంది. ఒక రోజు ఉదయాన్నే 32 ఏళ్ల మహిళను వాళ్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే కామెర్లతో కాలేయం పూర్తిగా దెబ్బతిని, కోమాలోకి వెళ్లిపోయిందామె. వాళ్లు మార్వాడీలు. వ్యాపారస్తులు. పెద్దగా చదువు లేదు కాబట్టి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాళ్లకెలాంటి అవగాహనా లేదు. దాంతో పరిస్థితి తీవ్రతను అంచనా వేయలేకపోయారు. ఆమెను పరీక్షించిన వెంటనే అత్యవసరంగా కాలేయ మార్పిడి చేయకపోతే, ప్రాణాలు దక్కవనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. అందుకు ఎక్కువ సమయం లేదు. 24 గంటల్లో కాలేయ మార్పిడి జరిగిపోవాలి. ఓ పక్క పరిస్థితిని తీవ్రతను కుటుంబ సభ్యులకు వివరించడంతో పాటు, మరోపక్క సర్జరీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అంతా యుద్ధప్రాతికపదికన జరిగిపోవాలి. ఆ సమయంలో ప్రతి క్షణం విలువైనదే! మొదట కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా చెప్పి, కాలేయ మార్పిడికి ఒప్పించిన తర్వాత, రోగి తమ్ముడి నుంచి కాలేయాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత అతనికి పరీక్షలన్నీ చేసి కాలేయాన్ని దానం చేయడానికి అన్ని విధాలా అర్హుడని నిర్థారించుకున్నాం. తర్వాత అనుమతులన్నీ తీసుకుని, సర్జరీకి సిద్ధపడ్డాం. అలా రోగి ఆస్పత్రికి చేరుకున్న 24 గంటల్లోపే తెల్లవారుఝామును 3 గంటలకు సర్జరీ మొదలుపెట్టాం. రెండు ఆపరేషన్ టేబుళ్ల మీద అక్కా తమ్ముళ్లకు ఏకకాలంలో సర్జరీ చేసి, తమ్ముడి నుంచి సేకరించిన 60ు కాలేయాన్ని అక్కకు అమర్చాం.
సర్జరీ నూరు శాతం విజయవంతమైంది. ఆరు వారాలకు ఇద్దరి కాలేయాలూ పూర్తి పరిమాణం మేరకు పెరుగుతాయి కాబట్టి అప్పటికి వాళ్లిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. తర్వాత కొంత కాలానికి ఆమె గర్భం దాల్చిందని తెలిసింది. ఇప్పటికీ అప్పుడప్పుడూ ఆమె ఆస్పత్రికి వచ్చి నన్ను కలుస్తూ ఉంటుంది. మరణం అంచుల వరకూ వెళ్లి, కాలేయ మార్పిడితో ప్రాణాలు దక్కించుకుని, పూర్తి ఆరోగ్యంతో కొత్త జీవితాన్ని గడుపుతున్న ఆమెను చూసిన ప్రతిసారీ నాకెంతో సంతృప్తి కలుగుతూ ఉంటుంది.
ప్రతి సర్జరీలో ముప్పులు ఉన్నట్టే, కాలేయ మార్పిడి సర్జరీలో కూడా కొన్ని ముప్పులుంటాయి. సర్జరీ కచ్చితంగా విజయవంతమవుతుందని చెప్పలేం! విషలమయ్యే అవకాశాలు 30శాతం ఉంటాయి. కాబట్టి కుటుంబానికి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇక్కడెంతో కీలకంగా మారుతూ ఉంటుంది. సర్జరీ సమయంలో తలెత్తే సమస్యలు, సర్జరీ తదనంతర పరిణామాలను కుటుంబానికి వివరించడం ఒక ఎత్తైతే, సర్జరీ విఫలమై రోగి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడం మరొక ఎత్తు. అలా కౌన్సెలింగ్ ముగించుకుని, మిగతా లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని, తెల్లవారుఝామున 3 గంటలకు, తమ్ముడికీ, అక్కకూ ఏకకాలంలో సర్జరీలు మొదలుపెట్టాం. అవి ఉదయం పది గంటల వరకూ కొనసాగాయి. నిజానికి ఇలాంటి సందర్భాల్లో వైద్యులమైన మాలో కూడా ఎంతో కొంత ఆందోళన ఉంటూ ఉంటుంది. అలాగే సర్జరీ ఎలాగైనా సక్సెస్ కావాలనే బలమైన కోరిక కూడా ఉంటుంది. కాబట్టే సర్జరీ పూర్తి చేసి ఇంటికెళ్లిపోయినా, మా ఆలోచలన్నీ ఆస్పత్రి చుట్టూరా, రోగి ఆరోగ్యం చుట్టూరా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. వైద్యులు భావోద్వేగపరంగా రోగులతో, పరిస్థితులతో కొంత డిటాచ్డ్‌గా ఉండక తప్పదు. ఒకవేళ సర్జరీ విఫలమై, రోగి ప్రాణాలు కోల్పోవడం లాంటిది జరిగితే, బాధపడుతూ, నిరాశలో కూరుకుపోతే మేం మా వృత్తికి న్యాయం చేయలేం! కాబట్టి సాధ్యమైనంత మెరుగైన చికిత్సను అందించడం, సత్ఫలితాన్ని సాధించడం కోసం శాయశక్తులా కృషి చేయడమే లక్ష్యంగా పని చేస్తాం! ఇలా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుని నిండు ఆరోగ్యంతో కొత్త జీవితాన్ని గడుపుతున్న వాళ్లను చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం!
-డాక్టర్ నవీన్ పోలవరపు
సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ,
హైదరాబాద్
పసవం ఆమెకు ప్రాణాంతకం
ప్రసవం మహిళలకు పునర్జన్మ లాంటిదని ఊరికే అనలేదు. ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత మహిళల ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే పరిస్థితులు అకస్మాత్తుగా తలెత్తుతూ ఉంటాయి. సాధారణంగా గర్భిణిగా ఉన్నప్పుడే, సదరు మహిళది క్లిష్ట ప్రసవం కాబోతోందని ముందుగానే కనిపెట్టేస్తూ ఉంటాం. దాంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రసవానికి అన్ని విధాలా సన్నద్ధమవుతూ ఉంటాం. కానీ అరుదుగా కొన్ని సందర్భాల్లో ప్రసవం తర్వాత సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి సమస్యలో రక్తస్రావం ప్రధానమైనది.
ఒక సందర్భంలో సుఖ ప్రసవం జరిగిన ఒక మహిళకు ఆగకుండా రక్తస్రావం జరిగిపోవడం మొదలైంది. దాంతో ఉన్నపళాన ఆస్పత్రికి రమ్మని నాకు కబురొచ్చింది. అప్పటికే ఎంతో రక్తం ఎక్కించారు. అయినా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆ సమయంలో అందరూ ఏం చేయాలో, రక్తస్రావాన్ని ఎలా ఆపాలో తెలియని అయోమయంలో పడిపోయారు. దాంతో ఆ క్షణమే నాకొక ఆలోచన తట్టింది. గర్భాశయం నుంచి రక్తస్రావం అవుతోంది. కాబట్టి గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాన్ని మూసేయడం ద్వారా రక్తస్రావాన్ని ఆపవచ్చని నాకు అనిపించింది. నిజానికి ఆ చికిత్సను వైద్యులు ముందు నుంచే అనుసరిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ నాకు అది కొత్త. ఆ పనిని ఎండోస్కోపీ ద్వారా చేయవచ్చని నాకు అనిపించింది. నిజానికి ప్రసవం జరిగిన వెంటనే ల్యాప్రోస్కోపీ చేయరు. కాబట్టి పొట్ట కోసి రక్తస్రావాన్ని ఆపే సర్జరీని ఎంచుకోవాలి.
కానీ అంత పెద్ద సర్జరీకి బదులుగా ల్యాప్రోస్కోపీతోనే ఆ పనిని పూర్తి చేయవచ్చన్నది నా ఆలోచన, అలా మొదటిసారిగా ఒక ప్రయోగాత్మకమైన చికిత్సకు పూనుకున్నాను. అంతకంటే ముందు ఆ చికిత్స ఫలితం, పరిణామాల గురించి ఆమె కుటుంబ సభ్యులకు వివరించాను. ఎండోస్కోపీ మధ్యలో అవసరమైతే, ఓపెన్ సర్జరీ కూడా చేయవలసి రావచ్చు. సర్జరీ సఫలం కావచ్చు. లేదంటే విఫలమై గర్భసంచిని కూడా తొలగించవలసి రావచ్చు. ఆ విషయం కుటుంబ సభ్యులతో చర్చించి ఆ ప్రయోగాత్మకమైన సర్జరీకి పూనుకున్నాను. విజయవంతంగా రక్తనాళాన్ని కనిపెట్టి, దాన్ని మూసేయడం ద్వారా రక్తస్రావాన్ని ఆపగలిగాను. దాంతో ఆ క్షణమే రోగి రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంది. మరుసటి రోజే చురుగ్గా నడవడం మొదలుపెట్టింది. ఇలాంటి సందర్భాల్లో రక్తస్రావాన్ని ఆపి, మహిళతో పాటు ఆమె గర్భాశయాన్ని కూడా కాపాడగలిగినప్పుడు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది.
-డాక్టర్ రాధిక రెడ్డి
సీనియర్ కన్సల్టెంట్ అబ్‌స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్,
ల్యాప్రోస్కోపీ సర్జన్,
బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్, హైదరాబాద్
Updated Date - Jul 01 , 2025 | 05:14 AM