Tasty New Recipes with Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌తో కొత్తగా...
ABN, Publish Date - Nov 08 , 2025 | 04:45 AM
చాలామంది డ్రాగన్ ఫ్రూట్‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పండు కమ్మగా కొద్దిపాటి తియ్యదనంతో ఉంటుంది. దీంతో సలాడ్స్, మిల్క్‌షేక్‌లు, జామ్‌లు, స్మూతీలు తయారుచేస్తూ ఉంటారు. ఎన్నో ఔషధ గుణాలతో నిండినడ్రాగన్ ఫ్రూట్‌ను విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...
చాలామంది డ్రాగన్ ఫ్రూట్‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పండు కమ్మగా కొద్దిపాటి తియ్యదనంతో ఉంటుంది. దీంతో సలాడ్స్, మిల్క్‌షేక్‌లు, జామ్‌లు, స్మూతీలు తయారుచేస్తూ ఉంటారు. ఎన్నో ఔషధ గుణాలతో నిండినడ్రాగన్ ఫ్రూట్‌ను విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...
డ్రాగన్ ఫ్రూట్ ఫ్రైడ్ రైస్
కావాల్సిన పదార్థాలు
డ్రాగన్ ఫ్రూట్- ఒకటి, అన్నం- రెండు కప్పులు, ఉల్లిపాయలు- రెండు, బీన్స్- నాలుగు, పచ్చి బఠాణీలు- కొన్ని, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఉల్లికాడలు- రెండు, పచ్చిమిర్చి- నాలుగు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు- రెండు, మిరియాల పొడి- చిటికెడు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత
తయారీ విధానం
స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడిచేయాలి. తరువాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లులి రెబ్బలు, పచ్చి బఠాణీలు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆపైన అన్నం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చివరగా డ్రాగన్‌ఫ్రూట్ ముక్కలు వేసి కలిపి దించాలి. ఇలా తయారుచేసిన డ్రాగన్ ఫ్రూట్ ఫ్రైడ్ రైస్‌ని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.
డ్రాగన్‌ఫ్రూట్ సార్బెట్
కావాల్సిన పదార్థాలు
పండిన డ్రాగన్ ఫ్రూట్- ఒకటి, స్ట్రాబెర్రీలు- నాలుగు, తేనె- నాలుగు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు
తయారీ విధానం
ముందుగా డ్రాగన్ ఫ్రూట్ ముక్కలను జిప్‌లాక్ కవర్లో వేసి రాత్రంతా ఫ్రీజర్లో ఉంచాలి. ఉదయాన్నే బ్లెండర్‌లో డ్రాగన్‌ఫ్రూట్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, తేనె, నిమ్మరసం వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక మౌల్డ్‌లో పరిచి ఒక పూటంతా ఫ్రీజర్లో ఉంచాలి. తరువాత ఈ డ్రాగన్‌ఫ్రూట్ సార్బెట్‌ను అందమైన బౌల్స్‌లోకి తీసి సర్వ్ చేసుకోవాలి.
డ్రాగన్ ఫ్రూట్ సల్సా
కావాల్సిన పదార్థాలు
డ్రాగన్ ఫ్రూట్- ఒకటి, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, నిమ్మకాయ- ఒకటి, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- చిటికెడు, మిరియాల పొడి- చిటికెడు
తయారీ విధానం
డ్రాగన్ ఫ్రూట్ పైన ఉన్న తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కొత్తిమీరను శుభ్రం చేసి సన్నగా తరగాలి. వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి చెంచాతో బాగా కలపాలి. ఇష్టమైతే అందులో దానిమ్మ గింజలు, పండిన బొప్పాయి ముక్కలు, పైనాపిల్ ముక్కలు కూడా కలుపుకోవచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ సల్సాను చిప్స్, క్రాకర్స్, గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్‌తో సర్వ్ చేసుకోవాలి.
డ్రాగన్ ఫ్రూట్ కేక్
కావాల్సిన పదార్థాలు
డ్రాగన్ ఫ్రూట్- ఒకటి, కోడిగుడ్లు- మూడు, పాలు- అర కప్పు, నూనె- అర కప్పు, మైదా- ఒక కప్పు, బేకింగ్ పౌడర్- ఒక చెంచా, పంచదార పొడి- అర కప్పు, మిల్క్ చాక్లెట్- పెద్దది ఒకటి, ఫ్రెష్ క్రీమ్- రెండు చెంచాలు, చాకో చిప్స్- కొన్ని
తయారీ విధానం
బ్లెండర్‌లో కోడిగుడ్ల సొనలు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పాలు, నూనె వేసి బాగా కలపాలి. తరువాత మైదా, బేకింగ్ పౌడర్, పంచదార పొడి వేసి ఉండలు రాకుండా కలపాలి. కేక్ మౌల్డ్ లోపల కొద్దిగా నూనె రాయాలి. అందులో డ్రాగన్ ఫ్రూట్ మిశ్రమాన్ని వేయాలి. తరువాత ఈ మౌల్డ్‌ను స్టీమర్‌లో ఉంచి నలభై నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించాలి. ఆపైన కేక్‌ను పళ్లెంలోకి తీసి చల్లార్చాలి.
ఒక గిన్నెలో మిల్క్ చాక్లెట్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్ వేసి వేడి నీళ్ల గిన్నెలో పావుగంటసేపు ఉంచాలి. చాక్లెట్ పూర్తిగా కరిగిన తరువాత ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. తెల్లగా మెరిసే ఈ చాక్లెట్ మిశ్రమాన్ని కేక్ మీద పరచాలి. పైన చాకో చిప్స్ చల్లాలి. అంతే డ్రాగన్ ఫ్రూట్ కేక్ రెడీ! ఈ కేక్‌ను గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేసుకోవాలి.
Updated Date - Nov 08 , 2025 | 04:45 AM