Pangi Karunakumari: ఇప్పటికీ నమ్మలేకపోతున్నా
ABN, Publish Date - Dec 01 , 2025 | 04:04 AM
తల్లిదండ్రులు కూలి పని చేస్తేగానీ పూట గడవని కుటుంబం ఆమెది. పుట్టుకతోనే వచ్చిన అంధత్వం కారణంగా ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది. అంధుల పాఠశాలలో చేరిన ఆమె..
తల్లిదండ్రులు కూలి పని చేస్తేగానీ పూట గడవని కుటుంబం ఆమెది. పుట్టుకతోనే వచ్చిన అంధత్వం కారణంగా ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది. అంధుల పాఠశాలలో చేరిన ఆమె.. అక్కడి వారి ప్రోత్సాహంతో క్రికెట్‌లో శిక్షణ ప్రారంభించింది. ఇప్పుడు అంధుల ప్రపంచకప్ గెలిచిన భారతజట్టు సభ్యురాలుగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది పదిహేనేళ్ల పాంగి కరుణకుమారి ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...
‘‘ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా వంతలమామిడి మా స్వగ్రామం. అమా నాన్న నా కంటి పాపలు. నాకు ఊహ తెలిసేంత వరకు వారి మాటలతోనే ఈ లోకాన్ని చూశాను. కొద్దిరోజుల క్రితం వరకు నన్ను కేవలం ఒక అంధురాలిగానే చూసిన ఈ సమాజం ఇప్పుడు దేశానికి టీ20 అంధుల ప్రపంచకప్ అందించిన భారత జట్టు సభ్యురాలిగా గుర్తించి.. అభిమానం చూపిస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇన్నాళ్లూ నేను కార్చిన కన్నీళ్లు, పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను వరల్డ్‌కప్ విజయం మాయం చేసింది. అమ్మ సంధ్య, నాన్న రాంబాబుకునేను రెండో సంతానం.. పుట్టుకతోనే నాకు రెండు కళ్లు కనిపించడం లేదని తెలిసి అమ్మ, నాన్న చాలా బాధపడ్డారు. నాకు పదేళ్లు వచ్చే వరకు వాళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను వెంట తీసుకువెళ్లేవారు. ఒక్క క్షణం కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఉండేవారు కాదు. నాకు కొంచెం ఊహ వచ్చాక నా చెల్లెలితో కలిసి బడికి వెళ్లేదాన్ని. పాఠశాలలో నన్ను తోటివారు ఏడిపించేవారు. నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడే వారు కాదు. ‘గుడ్డిది’ అని హేళన చేసేవారు. ఆ బాధతో నేను ‘‘స్కూల్‌కు వెళ్లను’’ అని మొండికేసేదాన్ని. అమ్మ నన్ను సముదాయించేది. ‘‘నువ్వు మనుషుల దృష్టిలో గుడ్డిదానివి కావచ్చు కానీ, ఆ దేవుడి దృష్టిలో కాదు తల్లీ. నువ్వు బడికి వెళ్లి, చదువుకొని కొంచెం జ్ఞానం సంపాదిస్తే మేము లేని రోజు నువ్వు ఒంటరిగానైనా బతకగలవు’’ అని ధైర్యం చెప్పేది.
పుల్లలు, కట్టెలు ఏరుకొని..
అమ్మా నాన్న కూలికి వెళ్లి తెచ్చే నాలుగైదు వందల రూపాయలే మా ఐదుగురు కుటుంబ సభ్యులకు ఆధారం. కూలి పనులు లేనప్పుడు అడవిలో దొరికే పుల్లలు, కట్టెలు అమ్ముకొని పొట్ట నింపుకొంటూ ఉంటాం. వర్షా కాలం పనులు లేక పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న రేకుల షెడ్‌లో మా నివాసం. వర్షాలు పడినప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు తట్టుకోలేక అవస్థలు పడుతూ ఉంటాం. మా కుటుంబంలో నాకైనా కనీస సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలోని ప్రభుత్వ అంధుల పాఠశాల గురించి తెలుసుకొని రెండేళ్ల క్రితం నన్ను అక్కడ చేర్పించారు. స్కూల్‌లో పీఈటీ సత్యవతిగారు, ప్రిన్సిపల్ విజయ మేడమ్ ప్రోత్సాహంతో క్రికెట్‌లో శిక్షణ ప్రారంభించా. గత ఏడాది జరిగిన రాష్ట్ర స్థాయి సెలెక్షన్స్‌లో భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్‌రెడ్డి నా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. నాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జాతీయ జట్టులో చోటు దక్కేలా నన్ను తీర్చిదిద్దారు. ఈ ఏడాది సెప్టెంబరులో టీ20 వరల్డ్‌కప్ కోసం బెంగళూరులో జరిగిన సెలక్షన్ మ్యాచ్‌లో సెంచరీ (114 పరుగులు) చేశా. ఆ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాను. ప్రపంచక్‌పలో ఆడే భారత జట్టులో చోటు సంపాదించా.
అమ్మా నాన్న ఒప్పుకోలేదు..
భారత జట్టులో చోటు సంపాదించాలనే నా కల నిజమైంది. 15 ఏళ్లకే వరల్డ్‌క్‌పలో ఆడే అవకాశం లభించడంతో చాలా సంతోషపడ్డాను. అయితే అప్పటివరకు మా కుటుంబంలో ఎవరూ విశాఖపట్నం దాటి వెళ్లలేదు. ‘‘ఆడపిల్లను, అందులోనూ చూపులేని అమ్మాయిని శ్రీలంకకు ఎలా పంపించాలి?’’ అని అమ్మా నాన్న ఆందోళన పడ్డారు. దాంతో వరల్డ్‌క్‌పకు నన్ను పంపడానికి ఒప్పుకోలేదు. నాకు తెలుగు తప్ప మరే భాష రాదు. కాబట్టి వెంట తెలిసిన వాళ్లు లేకుండా అంత దూరం పంపేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఆ సమయంలో అజయ్ రెడ్డి సార్, కెప్టెన్ దీపిక అక్క వారితో మాట్లాడి నచ్చజెప్పారు. నా బాధ్యత తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. నేను కూడా ‘‘మీరు ఒప్పుకున్నా లేకపోయిన నేను కచ్చితంగా వరల్డ్‌క్‌పలో ఆడతాను. కొలంబో వెళ్తాను’’ అని తెగేసి చెప్పడంతో చివరకు అమ్మా నాన్న అంగీకరించారు. కనీసం బస్సు ఎక్కే స్తోమత కూడా లేని నాకు విమానంలో ప్రయాణించే అవకాశం దక్కడం, నేను ప్రపంచక్‌పలో ఆడడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. వరల్డ్‌కప్ ఫైనల్లో 42 కీలకమైన పరుగులు చేసి, జట్టును విజేతగా నిలపడంతో ముఖ్య భూమిక పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. వరల్డ్‌కప్ అందుకున్న క్షణాలను, ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. పారా, దివ్యాంగ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే నాలాంటి వారు మరింతమంది దేశం గర్వించేలా తయారవుతారు.
-ఎస్.ఎస్.బి.సంజయ్
హైదరాబాద్
Updated Date - Dec 01 , 2025 | 04:04 AM