ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dwadashantam: ద్వాదశాంతం...చైతన్య వికాసం

ABN, Publish Date - Nov 07 , 2025 | 12:29 AM

భారతీయ యోగ, తంత్ర సంప్రదాయాలు మానవ జీవితంలోని పరమార్థాన్ని అన్వేషించే లోతైన మార్గాలను సూచిస్తాయి. వీటిలో ప్రాణాయామం, ముద్రలు, బంధాలు, ధ్యానం, కుండలినీ శక్తిని మేలుకొలపడం లాంటి ప్రక్రియలు..కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, పరమాత్మ సాక్షాత్కారం కోసం కూడా రూపుదిద్దుకున్నాయి. ...

భారతీయ యోగ, తంత్ర సంప్రదాయాలు మానవ జీవితంలోని పరమార్థాన్ని అన్వేషించే లోతైన మార్గాలను సూచిస్తాయి. వీటిలో ప్రాణాయామం, ముద్రలు, బంధాలు, ధ్యానం, కుండలినీ శక్తిని మేలుకొలపడం లాంటి ప్రక్రియలు..కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, పరమాత్మ సాక్షాత్కారం కోసం కూడా రూపుదిద్దుకున్నాయి.

ఆధునిక జీవితం వేగం, ఒత్తిడి, మానసికమైన కలతలతో నిండిపోయింది. మనిషి జీవనశైలి వేగంగా మారిపోతోంది. ఒత్తిడి, పనిభారం, కుటుంబ సమస్యలు, భవిష్యత్‌ భయం, అస్థిర సంబంధాలు, భద్రతా లోపం, ‘నేను’ అనే పరిమితి... ఇవన్నీ కలిసి డిప్రెషన్‌కు, అసహనానికి, శారీరక వ్యాధులకు దారి తీస్తున్నాయి. సోషల్‌ మీడియా, వార్తలు లాంటివి మెదడులో అనవసరమైన కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి దీనివల్ల అశాంతి, ఆందోళన పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక సమతుల్యతను కోల్పోవడం సహజం. ఈ సమయంలో ధ్యానం అనేది మానవుని ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక వికాసానికి, మానసిక ప్రశాంతతకు ఒక శక్తిమంతమైన పరిష్కారం. ధ్యానం క్రమంగా క్రియ నుంచి స్థితిగా మారుతుంది. అనంతంతో ఏకమయ్యే స్థితికి తీసుకువెళుతుంది. యోగ, తంత్ర సంప్రదాయాల్లో ధ్యానాన్ని కేవలం మనిషి మానసిక ఒత్తిడిని, శారీరక అలసటను తగ్గించి, లోతైన విశ్రాంతిని ప్రసాదించే సాధనంగా కాకుండా. చైతన్య వికాసంగా చూశారు. పూర్వకాలంలో ఋషులు ‘ఓం’కారాన్ని కానీ, ‘సోహం’ మంత్రాన్ని కాని అంతర్గతంగా జపించేవారు. ఆ మంత్రజపం కొన్ని రోజులకు, నెలలకు శ్వాసతో అనుసంధానమై, జపంకాని జపంగా మారి... సమాధి స్థితికి తీసుకువెళ్ళేది. సమాధిస్థితికి చేరుకున్న సాధకుడు ‘ద్వాదశాంతం’లో లయమవుతాడు. ‘ద్వాదశాతం’ అనేది శూన్య బిందు ధ్యాన కేంద్రం. అది మానవ చైతన్యం నుంచి దైవ చైతన్యానికి దారి చూపే ద్వారం. ప్రాణం, మనస్సు, నాదం, బిందువులం లయమయ్యే స్థానం.

ఎన్నో సంప్రదాయాల్లో, గ్రంథాల్లో...

శైవ, తాంత్రిక, నాథ సంప్రదాయాల ప్రకారం... ‘ద్వాదశాంతం’ అంటే నాసికాగ్రం నుంచి పన్నెండు అంగుళాల దూరంలో ఉన్న శూన్యస్థలం. కొందరు సిద్ధ గురువులు ‘‘ద్వాదశాంతం అనేది సహస్రారం నుంచి పన్నెండు అంగుళాల దూరంలో ఉన్న శివశక్తుల లయస్థానం’’ అని సూచించారు. ‘ద్వాదశ’ అంటే పన్నెండు, ‘అంతం’ అంటే అంతిమ స్థానం. ‘‘ద్వాదశాంతం... అమృతధార ఉద్భవించే స్థానం’’ అని పేర్కొంది సిద్ధ సంప్రదాయం. ఉపనిషత్తులలో కూడా ద్వాదశాంతం ప్రస్తావన ఉంది. యోగి నాసికాగ్రం నుంచి పన్నెండు అంగుళాల దూరంలో చిత్తాన్ని నిలిపినప్పుడు... అక్కడ ప్రాణం... అంటే కుండలినీశక్తి లయమై, అమృతరసం ఉద్భవిస్తుందని ‘అమృతనాదోపనిషతు’్త చెబుతోంది. ‘‘నాసికాగ్రం నుంచి పన్నెండు అంగుళాల దూరంలో శూన్య బిందువు ప్రకాశిస్తుంది. అది శివశక్తి స్థానం. అంతేకాదు, శూన్య, నాద బిందువులకు కేంద్ర స్థానం’’ అంటోంది ‘ధ్యానబిందూపనిషత్‌’. ‘‘ద్వాదశాంతం... ప్రాణం, మనస్సుల లయక్షేత్రం’’ అని పేర్కొంది ‘యోగవాశిష్ఠం’. ‘‘నాసాగ్ర దృష్టి, బ్రహ్మరంధ్రం, ద్వాదశాంత ధారణలు... ప్రాణసమాధి సాధనతో అనుసంధానమై ఉంటాయి’’ అని స్వాత్మారామ యోగి తన ‘హఠయోగ ప్రదీపిక’లో చెప్పారు. తంత్రాగమ గ్రంథాల విషయానికి వస్తే... ద్వాదశాంతం అనేది శూన్యస్థానం అనీ, అది శివశక్తుల లయక్షేత్రం అనీ ‘మాలినీ విజయోత్తర తంత్రం’ వివరించింది. ‘‘మంత్రోపాసనలో మంత్ర జపం అక్షర లక్షలు అయినప్పుడు... మంత్రం శ్వాసతో అనుసంధానమై, కుండలినీశక్తి మేల్కొని ద్వాదశాంతం వైపు పయనిస్తుంది. ద్వాదశాంతం అనేది శక్తి లయ బిందువు. నాదకుడు నాద, బిందు, శూన్య స్థితుల ద్వారా ఈ స్థితిలోకి ప్రవేశిస్తాడు. సహస్రారానికి పైన... పన్నెండు అంగుళాల దూరంలో ఉన్న శూన్యాన్ని దీర్ఘకాలంగా ధ్యానిస్తూ, ప్రణవాన్ని పరిపూర్ణంగా ఉచ్ఛరించేవారికి ఇంద్రియాతీతమైన శక్తి లభిస్తుంది’’ అని అభినవగుప్తుడి ‘లోకతంత్రం’ గ్రంథం చెబుతోంది. అలాగే కాశ్మీరీ శైవతంత్రం, స్కంద కారికలు, పరాత్రిశికా గ్రంథాలు, వసుగుప్తుడు రాసిన శివసూత్రాలు, సిద్ధ గురువు బోగర్‌ రాసిన ‘బోగర్‌ 7000’, తిరుమూలర్‌ రాసిన ‘తిరుమంతిరం’ లాంటి అనేక గ్రంథాలు ద్వాదశాంతం గురించి ఎన్నో అంశాలను వివరించాయి. బౌద్ధంలో దీన్ని ‘శూన్య ధ్యానం’గా, సూఫీ మతంలో ‘నూర్‌ అనుభవం’గా, క్రైస్తవ సంప్రదాయంలో ‘దివ్యకాంతి దర్శనం’గా పేర్కొన్నారు.

యోగి భరద్వాజ బొడ్డు

Updated Date - Nov 07 , 2025 | 12:29 AM