Bhagavad Gita: అర్జునుడి అసలు భయం
ABN, Publish Date - Dec 26 , 2025 | 06:21 AM
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?’ అనే అంశానికే మనమందరం సాధారణంగా ప్రాధాన్యాన్ని ఇస్తాం. నిజానికి అర్జునుడి వేదన, అర్జునుడు వేసిన ప్రశ్నలు..
‘భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?’ అనే అంశానికే మనమందరం సాధారణంగా ప్రాధాన్యాన్ని ఇస్తాం. నిజానికి అర్జునుడి వేదన, అర్జునుడు వేసిన ప్రశ్నలు... ఇవి ఇంకా ముఖ్యమైనవి. రెండు సేనల మధ్య అర్జునుడు రథాన్ని ఆపేసి, శోకసముద్రుడై వేదాంతంలోకి దిగిపోవడం... చాలా సహజమైన విషయం. మనమందరం అలాంటి విషమ ఘడియలను ఎదుర్కొంటూనే ఉంటాం. అలాంటి సమయంలో ఎవరైనా సుమారుగా అలాగే ప్రతిస్పందిస్తారు.
‘‘ధర్మం మనవైపే అనుకున్నాం. సాక్షాత్తూ కృష్ణ పరమాత్మ కూడా మనవైపే నిలబడ్డాడు. ఎప్పుడూ ఎవరి సొమ్మూ ఆశించలేదు. అడవిలోకి పొమ్మంటే పోయాం. ఎక్కడున్నామో ఎవరికీ తెలియకుండా ఏడాదిపాటు దాక్కున్నాం. అయినా జూదం షరతుల ప్రకారం వెనక్కి ఇచ్చేయవలసిన రాజ్యాన్ని ‘‘ఇవ్వం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’’ అన్నారు. ద్రౌపదికి వస్త్రాలు ఊడదీసి అవమానించినా, అడవుల్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చి అవమానించే ప్రయత్నాలు చేసినా భరించి, సహించి, నోరు మూసుకొని పడి ఉన్నాం. మా మంచితనం, మా గొప్పతనం. మా శౌర్యం, ధైర్యం ప్రపంచం అంతటికీ తెలుసు. అయినా భూమి మీద ఉన్న రాజుల్లో ఎక్కువమంది దుర్యోధనుడివైపు ఉన్నారేమిటి? జరగబోయేది ప్రాణాంతకమైన మహా భీకర యుద్ధం అని తెలిసీ... ఇంతమంది దుర్యోధనుడి కోసం మామీద తలపడి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారా? ఏమిటా సేన... ఎవ్వరా సేనాధిపతులు... భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వీళ్ళందరూ చావడానికి సిద్ధపడి యుద్ధంలోకి దిగిపోయారే!? మనవైపు కచ్చితంగా ఉండాల్సిన బలరాముడు లాంటి మహాయోధుడు ‘‘నేను యుద్ధంలో పాల్గొనను’’ అని కృష్ణుడంతటివాడికి చెప్పేసి తప్పుకుంటే... మమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించే భీష్మద్రోణులు మాత్రం కవచాలు తొడుక్కొని, అస్త్రశస్త్రాలతో మమ్మల్ని చంపేయడానికి సిద్ధమైపోయారే? కౌరవ సేన.ఆకాశం పగిలిందా, నేల ఈనిందా?’ అన్నట్టు సైన్య సముద్రంలా ఉంది. మనవైపు చూస్తే పిల్లనిచ్చిన ద్రుపదుడి సేన, వియ్యమందిన విరాటుని సేన, కృష్ణుడి రాజలౌక్యంలో భాగంగా మిత్రులైన జరాసంధుడి కొడుకు, శిశుపాలుడి కొడుకుల (శిశుపాల, జరాసంధులిద్దరూ కృష్ణుడివల్లే హతులైనా... ఆయన వారి కొడుకులకే పట్టం కట్టి తనవాళ్ళను చేసుకున్నాడు) సేనలూ...’’ అరివీర భయంకరుడైన అర్జునుడికి మొదటిసారిగా అనుమానం వచ్చింది.
‘‘యద్వా జయేమ యది వానో జయేయుః... వారిని మనం జయిస్తామా? లేదంటే వారే మనల్ని జయిస్తారా? అని.
ఆఖరిదాకా వేదాంతం చెప్పిన అర్జునుడు ఆఖర్లో బయటపడిపోయాడు. ‘‘ఏమిటిది కృష్ణా! భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి నేను చంపగలనా? అడుక్కుతింటాను కానీ ఈ నెత్తుటి కూడు వద్దు’’ అంటూనే.... ‘‘ఇంతకీ ఎవరు గెలుస్తారో?’’ అనే అసలు భయాన్నీ బయటపెట్టాడు. దుఃఖభరితుడై... శోకంతో సుమారు పాతిక శ్లోకాలు చెప్పిన అర్జునుడికి కృష్ణపరమాత్మ ఇచ్చిన ప్రతిస్పందన... ఆ హృషీకేశుడు ఫక్కున నవ్వాడు.
తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత
సేనోయోరుభయోర్మధ్యే విషీదంత మిదం వచః
ఉభయ సేనల మధ్య శోకితుడైన అర్డునుణ్ణి చూసి చిరునవ్వుతో గీతోపదేశాన్ని కృష్ణుడు మొదలుపెట్టాడు.
ఉండవల్లి అరుణ్‌కుమార్
Updated Date - Dec 26 , 2025 | 06:21 AM