మహిళ ఆర్థిక స్వావలంబనకు
ABN, Publish Date - Jun 19 , 2025 | 02:08 AM
పెద్ద చదువులకు నోచుకోలేదు... అడుగడుగునా కట్టుబాట్లు... చిన్న వయసులోనే వివాహం, కుటుంబ బాధ్యతలు... ఆర్తి రాణా జీవితం అందరు తెహ్రీ మహిళల్లాంటిదే. కానీ పేదరికం నుంచి బయటపడి...
పెద్ద చదువులకు నోచుకోలేదు... అడుగడుగునా కట్టుబాట్లు... చిన్న వయసులోనే వివాహం, కుటుంబ బాధ్యతలు... ఆర్తి రాణా జీవితం అందరు తెహ్రీ మహిళల్లాంటిదే. కానీ పేదరికం నుంచి బయటపడి, స్వావలంబన సాధించాలనే పట్టుదలతో ఆమె ముందుకు నడిచారు. ఆమె కృషి 44 గ్రామాలకు చెందిన 10 వేల మంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదం చేసింది. ‘నారీశక్తి’ అవార్డుతో సహా పలు పురస్కారాలు అందుకున్న ఆర్తి కథ ఇది...
‘‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోబరోలా గ్రామం. లక్ష్మీపురి కెహ్రీ జిల్లాలోని పలిలా బ్లాక్‌లో థారు గిరిజన తెగ ప్రజలు నివసిస్తున్న 46 గ్రామాల్లో అది ఒకటి. నేపాల్‌ను ఆనుకొని ఉంటుంది. నేపాల్‌లో, దేశంలోని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల్లో మా తెగవారు అధికం. వ్యవసాయం, పశువుల పెంపకం మా ప్రధాన వృత్తి. పితృస్వామ్య భావాలు, కట్టుబాట్లు మా గ్రామాల్లో ఇప్పటికీ ఎక్కువే. అలాంటిది నలభయ్యేళ్ళ క్రితం ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఆడపిల్లల్ని చదివించేవారు కాదు. పన్నెండేళ్ళకే పెళ్ళి చేసేవారు. అప్పటి నుంచి వాళ్ళకు ఇల్లు, సంసారమే లోకం. తమ గ్రామం బయట ఏం ఉంటుందో చూడకుండానే వాళ్ళు జీవితకాలం గడిపేసేవాళ్ళు. అలాంటి చోట పుట్టి ఎనిమిదో తరగతి వరకూ చదవడం పెద్ద విషయమే. నాకు పెద్ద చదువులు చదవాలని ఉండేది. దానికి మా ఇంట్లో ఒప్పుకోలేదు. పద్ధెనిమిదేళ్ళు రాకుండానే పెళ్ళి చేశారు. రెండేళ్ళకల్లా పిల్లలు, వాళ్ళ బాధ్యతలు. ‘వాళ్ళూ ఈ గ్రామంలో... అరకొర చదువులతో, పేదరికంలో మగ్గిపోవాల్సిందేనా’ అనే బాధ నన్ను వేధిస్తూ ఉండేది. మా అత్తవారింట్లో మగ్గం ఉండేది. ఇంటి ఖర్చుల కోసం వాటి మీద నేయడం నేర్చుకున్నాను. కుట్టుపని కూడా చేసేదాన్ని.
గ్రామం దాటి మొదటిసారి...
2008లో... ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ప్రతినిధులు మా ప్రాంతంలోని దుధ్వా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. మా ఇంట్లో మగ్గం మీద నేస్తున్న నన్ను చూశారు. గ్రామీణ ప్రజల్లో హస్తకళా నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణ కార్యక్రమంలో చేరాల్సిందిగా వారు నన్ను ప్రోత్సహించారు. సీతాపూర్ నగరంలో శిక్షణ. మా ఇంట్లో వద్దంటే పట్టుపట్టి ఒప్పించాను. నేను మా గ్రామం దాటి బయటకు వెళ్ళడం అదే మొదటిసారి. ఆ శిక్షణ నాకు ఎంతో ఉపయోగపడింది. మగ్గంపై మరింత నైపుణ్యంతో వస్త్రాలు ఎలా నేయవచ్చనేది నేర్చుకున్నాను. అలాగే మ్యాట్లు, బాస్కెట్లు, బ్యాగ్‌ల తయారీ తెలుసుకున్నాం.
ఆంక్షలు తగ్గాయి...
మా శిక్షణ ముగిసిన తరువాత... జిల్లా మేజిస్ట్రేట్ మాకు సర్టిఫికెట్లు అందజేశారు. మేము గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసుకొని, మిగిలినవారికి చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తే... దానికి అవసరమైన వనరులు సమకూరుస్తామని చెప్పారు. మా పంచాయతీ తరఫున ఆ బాధ్యతలు నాకు అప్పగించారు. మొదట మా పంచాయతీ అంతా తిరిగాను. ‘జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్’ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) తరఫున మహిళా బృందాల ఏర్పాటుకోసం ప్రయత్నించాను. కానీ తమ ఇంట్లోని ఆడవారు బయటకు వెళ్ళడానికి ఏ కుటుంబం ఒప్పుకోలేదు. కష్టపడి రెండు బృందాలను తయారు చేసి శిక్షణ ఇచ్చాను. ‘ఎన్‌ఆర్‌ఎల్‌ఎం’ నుంచి సాయం అందింది. ఉత్పత్తులు తయారు చేసి, విక్రయించడం ప్రారంభించాం. ఈలోగా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల పెంపుడు పశువులు మరణించడం, వ్యవసాయం లాభదాయకంగా లేకపోవడం, మరోవైపు మా బృందాల ద్వారా మహిళలు ఆదాయం పొందుతూ ఉండడంతో... గ్రామస్తుల్లో మెల్లగా మార్పు వచ్చింది. ఆ తరువాత వెనుతిరిగి చూసింది లేదు. ఇప్పటివరకూ నా నేతృత్వంలో 44 గ్రామాల్లో 350 గ్రూపులు ఏర్పడ్డాయి. పదివేల మంది మహిళలు శిక్షణ పొందారు. వారిలో చాలామంది రూ.10-15 వేల కనీస ఆదాయం పొందుతున్నారు. దీంతో గ్రామాల్లో పరిస్థితుల కూడా క్రమంగా మారాయి. ఇప్పుడు మహిళలపై ఆంక్షలు బాగా తగ్గాయి. ఆడపిల్లలను కూడా బాగా చదివించాలనే ఆలోచన పెరిగింది.
స్థానికమైనవే ముడిసరుకుగా...
సభ్యుల సంఖ్య పెరగడంతో మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. మేము సాధారణంగా ముడి సరుకుల కోసం సీతాపూర్ వరకూ వెళ్ళాల్సి వచ్చేది. కరోనా సమయంలో అది వీలు కాకపోవడంతో... మా ప్రాంతంలో పుష్కలంగా పేరిగే మూంజీ గడ్డితో బాస్కెట్లు, పెన్ను స్టాండుల్లాంటి వస్తువుల తయారీని సభ్యులకు నేర్పించాం. దానికోసం ఐటిడిపి, డబ్య్లూడబ్ల్యూఎ్‌ఫల సాయం తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కువగా స్థానికంగా దొరికే వాటినే ముడిసరుకుగా ఉపయోగిస్తున్నాం. చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులతో పాటు నిత్యం వినియోగించే బాస్కెట్లు, బ్యాగులు, డోర్‌మ్యాట్లు, పూల కుండీలు, పేపర్ స్డాండ్‌లు, మొబైల్ కవర్లు, శాండల్స్‌తో సహా ఎన్నెన్నో రూపొందిస్తున్నాం. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది.’’
అవి పురోగతి సాధించాలంటే...
నా కృషికి గుర్తింపుగా 2016లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘రాణీ ఝాన్సీ లక్ష్మీబాయ్ బ్రేవరీ అవార్డు’ ఇచ్చింది. 2022లో ‘నారీ శక్తి’ పురస్కారంతోపాటు, ‘గ్రామస్వరాజ్ అవార్డ్’ లాంటివి ఎన్నో అందుకున్నాను. ఒకప్పుడు మా గ్రామం తప్ప మరేదీ తెలియని నేను దేశమంతటా తిరిగాను. మా బృందాలు సాధించిన ఆర్థిక స్వావలంబన గురించి ఎన్నో సమావేశాల్లో ప్రసంగించాను. గ్రామీణ ప్రాంతాలు, పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్న సమాజాలు పురోగతి సాధించాలంటే మహిళల ఆర్థిక స్వావలంబనే ఏకైక మార్గం.
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 02:08 AM