Organic Cotton Kidswear India: నవ్విన నోళ్లే మెచ్చేలా
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:02 AM
మా కథ చెప్పాలంటే... పద్ధెనిమిదేళ్లు వెనక్కి వెళ్లాలి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్...
‘‘మా కథ చెప్పాలంటే... పద్ధెనిమిదేళ్లు వెనక్కి వెళ్లాలి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్... ఎండలు మాడిపోతున్నాయి. నా పిల్లలు ఏ డ్రెస్ వేసినా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్‌లో ఎంత వెతికినా సరైన గాలి జొరబడేవి, సున్నితమైన శరీరానికి హాని కలిగించని దుస్తులు లభించలేదు. ఇది టెక్స్‌టైల్ డిజైనర్‌గా కార్పొరేటు సంస్థల్లో పని చేసిన అనుభవం ఉన్న నన్ను ఆలోచనలో పడేసింది. దీనికి పరిష్కారం ఏంటి? తీవ్రంగా పరిశోధించాను. ఎక్కడ వస్త్ర ప్రదర్శనలు జరిగితే అక్కడకు వెళ్లాను. ఎంతోమంది నేత కళాకారులతో మాట్లాడాను. వాళ్లు చెప్పింది విన్నాను. నా అభిప్రాయాలు, ఆలోచనలు వారితో పంచుకున్నాను. పదేళ్లు విస్తృతంగా అధ్యయనం చేశాక ఒక అభిప్రాయానికి వచ్చాను. అదేంటంటే... ‘సేంద్రియ పద్ధతిలో పండిన పత్తి’. రసాయనాలు లేని పత్తితో, సహజసిద్ధమైన పద్ధతిలో తయారైన దుస్తులు చంటి పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఎన్నో ఎగ్జిబిషన్లను సందర్శించిన నాకు అలాంటి వస్త్రాలు ఎక్కడ కనిపించలేదు. దాంతో నేనే ఒక అడుగు ముందుకు వేశాను. మా సోదరి అంకిత సహ వ్యవస్థాపకురాలిగా 2017లో ‘వైట్‌వాటర్ కిడ్స్’ పేరుతో కంపెనీ నెలకొల్పాను.
దానికీ ఒక అర్థం ఉంది...
మా బ్రాండ్‌కు ‘వైట్ వాటర్’ అని పెట్టడానికి ఒక కారణం ఉంది. పేరు చూడగానే ఉత్పత్తుల ఉద్దేశం అర్థమవ్వాలనేది మా ఆలోచన. తెలుపు స్వచ్ఛతకు, నీరు పారదర్శకతకు, ప్రవాహానికీ ప్రతీకలు. అంకితకు కూడా డిజైనింగ్, స్టోరీ టెల్లింగ్‌లో అనుభవం ఉంది. తను ‘లండన్ కాలేజీ ఆఫ్ కమ్యూనికేషన్’ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. డిజిటల్ మార్కెటింగ్‌కు తన నైపుణ్యం బాగా కలిసివచ్చింది. నేను కోరుకున్నది కేవలం డ్రెస్‌ల డిజైన్ మాత్రమే కాదు... అవి కమ్మని కథలు కూడా చెప్పేలా రూపొందించాలని. స్వతహాగా కవిత్వంపై నాకు ఆసక్తి. తీరిక దొరికినప్పుడల్లా ఏదోఒకటి రాస్తుంటాను. అలా కాగితం మీద పెట్టిన అక్షరాలను దుస్తులపైకి తెచ్చాను. మా చేనేత కళాకారులు నా కవితాత్మక పంక్తులకు చక్కని రూపం ఇస్తున్నారు. అవన్నీ చిన్నారుల్లో స్ఫూర్తి నింపేవిగానే ఉంటాయి.
కళాకారుల సంగమం...
మా బ్రాండ్ సంప్రదాయ వస్త్ర శ్రేణుల మేలి కలయిక. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పేరుపొందిన చేనేత కళలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నాం. అందుకోసం సాధ్యమైనంతమంది స్థానిక కళాకారులను సంప్రతిస్తున్నాం. వారితో కలిసి పని చేస్తున్నాం. తద్వారా వారికీ ఒక ఆదాయ మార్గం లభిస్తోంది. ప్రధానంగా మహిళా కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వారికి ఇంటి దగ్గర నుంచే పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఏదిఏమైనా మా అంతిమ లక్ష్యం... చిన్నారులకు సౌకర్యవంతమైన వస్త్ర శ్రేణులను అందించడం. అందులో రాజీ లేదు. సేంద్రియ పత్తితో తయారైన వస్త్రం, సహజసిద్ధ రంగులు మాత్రమే ఉపయోగిస్తాం. కుర్తా సెట్ నుంచి దిండు గలీబు వరకు చిన్నారులకు సంబంధించిన అన్ని వస్త్ర శ్రేణులను తీసుకువచ్చాం. అదే సమయంలో ప్రయోగాత్మకంగా, వేటికవే భిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నాం.
వైకల్యాన్ని దాటి...
అంకితకు, నాకు... ఇద్దరికీ వైకల్యం. నా ఒంటి నిండా తెల్ల మచ్చలు. అంకితకు పోలియో. సరిగ్గా నడవలేదు. బాల్యంలోనే కాదు... కాలేజీకి వెళ్లే రోజుల్లోనూ మేం ఎన్నో అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్నాం. మాలోని లోపాలను చూసి కొందరు చులకనగా మాట్లాడేవారు. అవి మమ్మల్ని విపరీతంగా బాధించేవి. కానీ వాటివల్ల మా కెరీర్ దెబ్బతినకుండా చూసుకోవాలని ఇద్దరం అనుకున్నాం. కష్టపడి చదివాం. ఇవాళ నవ్విన నోళ్లే మమ్మల్ని పొగిడేలా... వింతగా చూసిన కళ్లే మెచ్చుకొనేలా... స్వశక్తితో ఎదిగి ఒక సంస్థకు అధిపతులం అయ్యాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాం. ‘ఇదీ మేం సాధించిన విజయం’ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.’’
దృక్పథం మారాలి...
మాలాంటి వారి పట్ల ఈ సమాజం దృక్పథం మారాలి. మేమూ ఈ సంఘంలో మనుషులమే. వైకల్యం ఉన్నంతమాత్రాన దూరం నెట్టడం, చులకన చేయడం దారుణం. ఎటు వెళుతున్నాం మనం? ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే... మనిషిలోని ప్రతిభ, సామర్థ్యాలను వదిలేసి లోపాల గురించి మాట్లాడేవారు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మా అబ్బాయిని తన స్నేహితుడు అడిగాడు... ‘ఆంటీ ముఖానికి ఏమైంది’ అని! అందుకు నేను కోపగించుకోకుండా... ఆ పిల్లాడిని కూర్చోబెట్టి, అర్థమయ్యేట్టు చెప్పాను. ఆ తరువాత ఎప్పుడూ తను ఆ ప్రస్తావన తేలేదు. నేను కోరేది ఏంటంటే... వైకల్యం ఉన్నవారిపై జాలి, దయ చూపక్కర్లేదు. ఆ చిన్నారిలా అర్థం చేసుకొని... ఒక మనిషిలా చూడండి చాలు.
Updated Date - Jul 24 , 2025 | 12:02 AM