Jyoti Malhotra espionage: పాక్‌కు సైనిక రహస్యాలు
ABN, Publish Date - May 18 , 2025 | 05:08 AM
ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యానికి పాల్పడినట్లు హరియాణా పోలీసులు వెల్లడించారు. భారత సైనిక స్థావరాల వద్ద హై క్వాలిటీ వీడియోలు తీసి, వాట్సాప్–టెలిగ్రామ్‌ల ద్వారా పాకిస్థాన్ ఏజెంట్లకు పంపినట్లు గుర్తించారు.
సైనిక, వైమానిక బేస్‌ల వీడియోలు చిత్రీకరించి పాక్‌కు పంపిన మహిళా యూట్యూబర్ అరెస్టు
మహిళలపై పాక్ ఏజెంట్ల డబ్బు, వలపు వల
పలు రాష్ట్రాల్లో నెట్‌వర్క్.. ఆరుగురి అరెస్టు
న్యూఢిల్లీ, మే 17: హరియాణాలోని హిస్సార్‌కు చెందిన జ్యోతి మల్హోత్రా ఓ యూట్యూబర్. ఆమెకు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్‌గా పాక్ వెళ్లి ఆమె గూఢచర్యం బాట పట్టారు... పంజాబ్, హరియాణా, రాజస్థాన్, లద్దాఖ్‌లలోని భారత సైనిక పోస్ట్‌ల ముందు, వైమానిక దళ బేస్‌ల ముందు, డీఆర్‌డీవో టెస్ట్ రేంజ్‌ల ముందు దేశ భక్తి గీతాలు పాడుతూ... వందనం చేస్తూ ఏడాదిగా వీడియోలను అప్‌లోడ్ చేసింది. వీటిని చూస్తే ఎవరికీ ఆమె మీద అనుమానం రాదు.. వీటిలో జాతీయ జెండా ఎగురవేయడం, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలు, గన్ సెల్యూట్‌ల వంటివి కనిపిస్తాయి. కాని వీటన్నిటి వెనుకా లోతైన గూఢచర్యం ఉందని హరియాణా పోలీసులు తెలిపారు. హై రిజిల్యూషన్‌తో సైనికంగా సున్నిత ప్రాంతమంతా కనిపించేలా చిత్రీకరించడం, జీపీఎస్ ట్యాగ్‌లు, డ్రోన్‌లతో ఆయా సైనిక, వైమానిక బేస్‌లను, సైనిక వాహనాల బేలను, అక్కడి ఎలకా్ట్రనిక్ సెన్సార్లను చిత్రీకరించి వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా పాక్ ఏజెంట్లకు చేరవేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో జ్యోతిని శనివారం అరెస్టు చేయగా న్యాయస్థానం ఐదు రోజుల రిమాండ్ విధించింది. చిత్రీకరించిన సైనికపరంగా సున్నితమైన వీడియోల ఫుటేజీ మొత్తాన్ని ఆమె వెంటనే పాక్ హై కమిషన్ కార్యాలయం నుంచి భారత్ బహిష్కరించిన ఉద్యోగి అహ్‌సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ నంబరుకు పంపిస్తోందని హరియాణా-పంజాబ్ సైబర్ సెల్ పోలీసులు గుర్తించారు.
పోలీసులు అరెస్టు చేసిన మరో ఐదుగురి వద్దా ఆ నెంబరును గుర్తించారు. ‘ఆపరేషన్ గోస్ట్ సిమ్’ పేరిట చేసిన పరిశోధనలో వీరందరిని గుర్తించి అధికారిక రహస్యాలు అక్రమంగా చేరవేసిన కేసులో అరెస్టు చేశారు.
ఇఫ్తార్ విందులో...
జ్యోతి మల్హోత్రా గత ఏడాది మార్చిలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం కనిపిస్తోంది. ఇందులో అక్కడి ఏర్పాట్లను ఆమె ఎంతో మెచ్చుకున్నారు. పాకిస్థాన్ మరెన్నోసార్లు వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పాక్ హై కమిషన్ ఉద్యోగి డాని్‌షతో సంభాషిస్తూ ఆమె ఆ వీడియోలో కనిపించారు. గతంలో తాము కలుసుకున్న సందర్భాలనూ ప్రస్తావించారు. అతడి భార్యతోనూ చనువుగా మాట్లాడారు. సాధారణ పరిచయాన్ని మించిన సన్నిహితత్వం వారి మధ్య కనిపించింది. కాగా, జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను హరియాణా పోలీసులు ఈ కేసులో అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్ హరియాణా, పంజాబ్ రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతమంతా విస్తరించినట్లు భావిస్తున్నారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరిట యూట్యూబ్ చానల్ నడుపుతోన్న జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్థాన్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేసే డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. ఇతడు జ్యోతికి పలువురు పాకిస్థాన్ ఏజెంట్లను పరిచయం చేశాడు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్‌ల ద్వారా జ్యోతి వారితో టచ్‌లో ఉంది. షకీర్ అలియాస్ రాణా షహబాజ్ అనే పాక్ ఏజెంట్ వారిలో ఒకడు. అతడి నంబరును జాట్ రణ్‌ధావా పేరుతో జ్యోతి సేవ్ చేసుకుంది. ఒక పాక్ ఏజెంట్‌కు బాగా దగ్గరయిన జ్యోతి అతడితో ఇండోనేషియా పర్యటనకూ వెళ్లింది. కాగా డాని్‌షను ఈ నెల 13న కేంద్రం అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. జ్యోతితో పాటు పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు చెందిన మరో వితంతు మహిళ గుజాల(32) కూడా ఈ కేసులో కీలక నిందితురాలు. వీసా కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ హై కమిషన్ కార్యాలయానికి వెళ్లిన ఆమెకు డానిష్ పరిచయమయ్యాడు. అతడితో తరచూ మాట్లాడుతూ ఉండేది.
పెళ్లి చేసుకుంటానని డానిష్ ఆమెకు దగ్గరయ్యాడు. ఏప్రిల్ 23న గుజాల మలేర్‌కోట్లకే చెందిన వితంతు మహిళ బాను నస్రీనను పాక్ హై కమిషన్ కార్యాలయానికి తీసుకువెళ్లగా డానిష్ ఆమెకు మరుసటి రోజే పాక్ వీసా ఇప్పించాడు. కాగా ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురు వ్యక్తులు మలేర్‌కోట్లకు చెందిన యమీన్ మహమ్మద్, పటియాలలోని ఖల్సా కళాశాల విద్యార్థి దేవిందర్ సింగ్ ధిల్లాన్, నుహ్‌కు చెందిన అర్మాన్. యమీన్ డాని్‌షతో కలిసి ఆర్థిక, వీసా జారీ వ్యవహారాలు నడిపాడు. ధిల్లాన్ మే 12న తన ఫేస్‌బుక్ ఖాతాలో గన్, పిస్టల్ చిత్రాలను పోస్ట్ చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు పలు కీలక వివరాలు రాబట్టారు. గత ఏడాది నవంబరులో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాక్ వెళ్లిన అతడు అక్కడ ఐఎ్‌సఐ ఏజెంట్లకు భారత్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని అందజేశానని వెల్లడించాడు. అందుకు తనకు పెద్దమొత్తంలో డబ్బు ముట్టిందని చెప్పాడు. పటియాల కంటోన్మెంట్ వీడియోలూ ఇతడు పాక్‌కు పంపినట్లు గుర్తించారు. అర్మాన్ సిమ్ కార్డులు సమకూర్చడం, డబ్బు పంపిణీ వ్యవహారాలు చేశాడు. అంతేగాక పాక్ ఏజెంట్ల సూచనల మేరకు డిఫెన్స్ ఎక్స్‌పో-2025ని కూడా సందర్శించాడు. కాగా నిందితులంతా తమ నేరాలను అంగీకరించారు. పాక్ ఏజెంట్లు సమాజంలో మతపరంగా, సామాజికంగా సున్నిత మనస్తత్వం గలవారిని గుర్తించి డబ్బు, ప్రేమ, పెళ్లి పేరిట వలలో వేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 09:51 AM