Wrongful Arrest: అయ్యో.. అని ఆస్పత్రిలో చేర్పిస్తే చంపేశాడని 13నెలలు జైల్లో వేశారు!
ABN, Publish Date - Jul 30 , 2025 | 06:25 AM
పుణ్యం చేయబోతే పాపం ఎదురైందన్నట్లు.. అతడు అయ్యో పాపం అని అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను ఆస్పత్రిలో చేర్పిస్తే, ఆమెను అతడే చంపేశాడంటూ పోలీసులు అరెస్టు చేశారు.
భోపాల్, జూలై 29: పుణ్యం చేయబోతే పాపం ఎదురైందన్నట్లు.. అతడు అయ్యో పాపం అని అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను ఆస్పత్రిలో చేర్పిస్తే, ఆమెను అతడే చంపేశాడంటూ పోలీసులు అరెస్టు చేశారు. సాయం చేసిన పాపానికి ఆ నిరుపేద కూలీ 13నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. భోపాల్‌లోని ఆదర్శనగర్ మురికివాడలో ఉండేరాజేశ్ దినసరి కూలీ. అద్దె ఇంట్లో ఉండేవాడు. గతేడాది జూన్ 16న తన ఇంటి పక్క ఇంట్లో మహిళ అనారోగ్యంతో బాధపడుతూ.. ఆస్పత్రికి తీసుకువెళ్లాలని రాజేశ్‌ను కోరింది. అతడు ఆమెను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం చనిపోయింది. పోలీసులు రాజేశ్‌ను విచారించారు. భయంభయంగా సమాధానం చెప్పడంతో అతడే ఆమెను చంపేసి ఉంటాడని అరెస్టు చేశారు. 9రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అప్పటివరకు రాజేశ్ కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. లాయర్‌ను పెట్టుకోవడానికి రాజేశ్ దగ్గర డబ్బు లేకపోవడంతో కోర్టే అతని కోసం రీనా వర్మ అనే న్యాయవాదిని కేటాయించింది. సదరు మహిళ మరణానికి కారణం అనారోగ్యం అని మెడికల్ రిపోర్టుల్లో ఉండటం, గొంతు పిసకడం వల్లే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో ఉండటాన్ని రీనా వర్మ గుర్తించారు. తర్వాత పోలీసుల నుంచి వివరాలు సేకరించగా, వారు ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను చూడలేదని తేలింది. ఆ మహిళ ఆస్పత్రిలోనే చనిపోయినట్లు ఫుటేజీల్లో ఉండటంతో కోర్టు రాజేశ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు తన అద్దె ఇంటికి తాళం వేశారని, ఇప్పుడు 13నెలల అద్దె ఎలా కట్టాలని రాజేశ్ వాపోతున్నాడు. జైలుకు వెళ్లొచ్చానని ఎవరూ తనకు పని కూడా ఇవ్వడం లేదని బాధపడుతున్నాడు.
Updated Date - Jul 30 , 2025 | 06:39 AM