ఇరాన్ అణు కేంద్రాలపై.. అమెరికా బాంబుల వర్షం
ABN, Publish Date - Jun 23 , 2025 | 05:19 AM
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం బీ2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై బీయూ-57 బంకర్-బస్టర్ బాంబులు, తొమహాక్ క్షిపణులతో భీకర దాడులు జరిపింది.
2 వారాల గడువిచ్చి రెండ్రోజుల్లోనే రంగంలోకి దిగిన అగ్రరాజ్యం
ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో బీభత్సం
ఒక్క ఫోర్డోపైనే 12 జీబీయూ-57 బాంబులు
30 దాకా తొమహాక్ క్షిపణులతో దాడులు
ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాం
దాడుల తర్వాత వైట్‌హౌ్‌సలో ట్రంప్ ప్రకటన
అధికార మార్పిడి తర్వాతే శాంతి స్థాపన
ఇరాన్ నాయకత్వ మార్పుపై నెతన్యాహు
ప్రతీకారం తప్పదన్న ఇరాన్.. రష్యాతో చర్చలు
అగ్రరాజ్యం అణ్వస్త్ర ఒప్పందాన్ని ఉల్లంఘించింది
అణు ఒప్పందం నుంచి వైదొలుగుతాం: ఇరాన్
అత్యంత సురక్షిత బంకర్‌కు తరలిన ఖమేనీ
ఇజ్రాయెల్‌పై భీకర దాడులు చేసిన ఇరాన్
టెల్‌అవీవ్, హైఫా, గలీలి, క్రయోట్, ఆరాలో నష్టం
ఇరాన్‌పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు
టెల్‌అవీవ్/టెహ్రాన్/న్యూయార్క్/న్యూఢిల్లీ, జూన్ 22: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం బీ2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై బీయూ-57 బంకర్-బస్టర్ బాంబులు, తొమహాక్ క్షిపణులతో భీకర దాడులు జరిపింది. ఈ దాడుల్లో మూడు అణుకేంద్రాలు నేలమట్టమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో నిలువరించినట్లు.. ఈ విషయంలో తమ లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు తెలిపారు. అమెరికా సహకారానికి ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలపగా.. ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. ‘‘అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది. ముగించడం మా వంతు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదెవ్ ఏకంగా ‘‘ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకుంటే.. ఆ దేశానికి న్యూక్లియర్ వార్‌హెడ్లను అందజేయడానికి ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రేరేపిత మిలిటెంట్ గ్రూపులు హౌతీ, హమాస్ కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను హెచ్చరించాయి. అమెరికా దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర క్షిపణి దాడులు జరిపింది. టెల్‌అవీవ్, హైఫా తదితర ప్రాంతాల్లో తీవ్ర నష్టం నమోదైంది. తమ అమ్ముల పొదిలోని ‘కోరంషహర్-4 మిసైల్’ను తొలిసారి ప్రయోగిస్తామని ఐఆర్‌జీసీ ఆదివారం ఉదయం ప్రకటించగా.. సాయంత్రానికి ఆ క్షిపణులను నిల్వ ఉంచిన కేంద్రాలను ఐడీఎఫ్ ధ్వంసం చేయడం గమనార్హం..!
రెండ్రోజుల్లోనే ట్రంప్ స్పందన..
ఇరాన్‌కు రెండు వారాల సమయం ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రెండ్రోజుల్లోనే రంగంలోకి దిగారు. ఆదివారం తెల్లవారుజామున ప్రణాళికను అమలు చేసి, సగం ప్రపంచం నిద్ర లేచేలోపే ‘‘ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేశాం’’ అని ప్రకటించారు. ఈ మూడు అణుస్థావరాలపై తాము విజయవంతమైన దాడిని పూర్తిచేశామని వైట్‌హౌ్‌సలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రపంచంలో మరే మిలటరీ ఇలా చేయలేదంటూ అమెరికా సైన్యాన్ని కొనియాడారు. ‘‘శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ ముందుకు రావాలి. లేకపోతే.. మళ్లీ దాడిచేస్తాం’’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ ప్రతీకారానికి దిగితే.. ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ ప్రభుత్వాధినేతలు అమెరికా దాడులను ధ్రువీకరించినట్లు ఐఎ్‌సఆర్‌జీ అనుబంధ మీడియా ఐఎ్‌సఎన్‌ఏ వెల్లడించింది.‘‘యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది’’ అని పేర్కొంది. ఇరాన్‌పై దాడుల సందర్భంగా అమెరికా తమతో పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుందని ఐడీఎఫ్ తెలిపింది. కాగా.. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అణు కార్యక్రమం కేవలం ఆర్నెల్లు వాయిదా పడుతుందని, అందుకే దాన్ని మూడేళ్లకు పొడిగించేలా అమెరికా రంగంలోకి దిగిందని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. ట్రంప్ కూడా ‘‘ఇజ్రాయెల్ 75ు కార్యక్రమాన్ని పూర్తిచేస్తే.. మేము మిగతా 25ు దాడులతో ఓ ముగింపునిచ్చాం’’ అని వ్యాఖ్యానించారు.
అప్పుడే శాంతి: నెతన్యాహు
ఇరాన్ భవితవ్యం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగితేనే శాంతి జరుగుతుందని పరోక్షంగా అన్నారు. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ట్రంప్‌నకు కృతజ్ఞతలు. ట్రంప్, నేను తరచూ చెబుతుంటాం. శాంతి అనేది బలప్రయోగం ద్వారానే సాధ్యం. అందుకు ఓ ప్రతినిధి(ఇరాన్ అధికార మార్పును ఉద్దేశించి) అవసరం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి.. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను నాశనం చేయడానికి ట్రంప్ చేసిన సాహసాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఈ నిర్ణయం పశ్చిమాసియా శ్రేయస్సు, శాంతి భవితకు దారితీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
అమెరికాతో చర్చల్లేవు: ఇరాన్
తమ అణు కేంద్రాలపై అమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రతిస్పందన కోసం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు. ఐక్య రాజ్య సమితి(ఐరాస) చార్టర్, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించారు. ‘‘అమెరికా చర్యలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. దీనిపై ఐరాసలో ప్రతి సభ్యదేశం ఆందోళన తెలపాలి. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించడానికి అన్ని అవకాశాలను వినియోగించుకుంటాం. ఇప్పుడే రష్యాకు వెళ్తున్నాను. సోమవారం ఉదయం పుతిన్‌తో భేటీ అవుతాను. తదుపరి కార్యాచరణను ఆ తర్వాత ప్రకటిస్తాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అమెరికాతో చర్చలుండవని తేల్చిచెప్పారు. అణు ఒప్పందం నుంచి వైదొలగుతామని ప్రకటించారు. అమెరికా యుద్ధాన్ని ప్రారంభించిందని, ఇరాన్ ముగింపునిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, ఇరాన్ ప్రభుత్వం అమెరికా దాడికి ముందే శుద్ధి చేసిన యురేనియంను ఫోర్డో నుంచి ఇతర ప్రాంతాలకు తరలించినట్లు రాయిటర్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఒకట్రెండ్రోజుల ముందు ఆ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ ట్రక్కులు మోహరించిన ఉపగ్రహ చిత్రాలను ఆధారాలుగా చూపింది.
హోర్ముజ్ మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం
సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత అమలు
టెహ్రాన్, జూన్ 22: తమ అణుకేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్‌కు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అంశంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోగానే ఇది అమలోకి వస్తుంది. అయితే హోర్ముజ్ జలసంధి మూసివేత నిర్ణయం ఇరాన్‌కు ఆర్ధిక ఆత్మహత్యగా మారుతుందని అమెరికా హెచ్చరించింది. జలసంధిని మూసివేయకుండా చూడాలని చైనాకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సూచించారు. చమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, ఓమన్ దేశాల నౌకలు రాకపోకలు సాగించేది హోర్ముజ్ జలసంధి గుండానే. ఆయా దేశాల నుంచి చైనా, భారత్, జపాన్, కొరియా దేశాల చమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతులకు ఇదే ప్రధాన ఆధారం. ప్రపంచవ్యాప్తంగా నిత్యం వినియోగించే చమురులో 20ు, సహజవాయువులో 25ు పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తే భారత్‌కు కూడా తిప్పలు తప్పవు. ఎందుకంటే మన ముడి చమురు అవసరాల్లో 90 శాతం, గ్యాస్ అవసరాల్లో 50 శాతానికి దిగుమతులే మార్గం.
బంకర్‌లోకి ఖమేనీ
ఇరాన్‌పై అమెరికా దాడి నేపథ్యంలో సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఐఆర్‌జీసీ మరింత సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పాశ్చాత్య మీడియా పేర్కొంది. లెబనాన్‌లో హిజ్బుల్లా నేతలు బంకర్లలో ఉండగానే ఇజ్రాయెల్ మట్టుబెట్టిన విషయం తెలిసిందే..! ఈ అనుభవాల నేపథ్యంలో ఖమేనీని అతను ఉంటున్న బంకర్ నుంచి అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఖమేనీ ఉన్న బంకర్‌లో ఎలాంటి సిగ్నళ్లు ఉండవని, ఎలకా్ట్రనిక్ కమ్యూనికేషన్‌ను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిసింది.
ఇరాన్ నుంచి మరో 311 మంది భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ, జూన్ 22: యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులను ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఆదివారం ఇరాన్‌లోని మష్షాద్ నగరం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక విమానం ద్వారా 311 మందిని తీసుకొచ్చింది. భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఇంతవరకు ఇరాన్ నుంచి 1,428 మంది భారతీయులను తరలించినట్టయిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
దాడులు జరిగాయిలా..
ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున..
2.42: అమెరికాకు చెందిన ఆరు స్టెల్త్ బీ2 బాంబర్లు ఇరాన్‌ను సమీపించాయి. వాటిని కవర్ చేస్తూ.. 125 దాకా యుద్ధ విమానాలు, ఇంధన ట్యాంకర్ జెట్లు దూసుకువచ్చాయి.
3.03: ఇరాన్‌కు మరో అవకాశమిస్తున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ప్రకటన.
4.00: అమెరికా యుద్ధ విమానాలు ‘రయ్’మంటూ ఇరాన్ గగనతలంపై దూసుకెళ్లాయి. కవరింగ్ విమానాలు తబ్రీజ్, టెహ్రాన్‌లో దాడులు చేస్తూ ముందుకెళ్లగా.. బీ2 బాంబర్లు ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాల వైపు విడిపోయాయి.
4.30: వైట్‌హౌస్ సిట్యుయేషన్ గదిలో ట్రంప్, ఇతర అధికారులు పర్యవేక్షిస్తుండగా.. ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ పేరుతో.. ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలను తుత్తునీయలు చేసిన అమెరికా బీ2 బాంబర్ విమానాలు. అదే సమయంలో 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాంతర్గాముల నుంచి 30 తోమహాక్ క్షిపణుల ప్రయోగం. 25 నిమిషాల్లోనే 3 అణుకేంద్రాలపై భీకర దాడులు!
5.19: వైట్‌హౌ్‌సలో ట్రంప్ ప్రెస్‌మీట్! ‘‘అమెరికాకు, ఇజ్రాయెల్‌కు, ప్రపంచానికి ఇదో చరిత్రాత్మక సందర్భం..! ఇరాన్ ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించేందుకు అంగీకారం తెలపాలి’’ అని ప్రకటన. ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణుకేంద్రాలను పూర్తిస్థాయిలో ధ్వంసం చేశామని వెల్లడి. పశ్చిమాసియాలో శాంతికి సమయం ఆసన్నమైందని వ్యాఖ్య..!
కొనసాగిన ఐడీఎఫ్ దాడులు
ఇరాన్‌పై ఐడీఎఫ్ దాడులు ఆదివారం ఉదయం నుంచి కొనసాగాయి. అమెరికా దాడులు ముగిసిన ఒకట్రెండు గంటల్లోనే.. ఐడీఎఫ్ వైమానిక దళం 8 క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసింది. డెజ్‌పోల్ విమానాశ్రయంలోని రెండు ఎఫ్-5 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. సెంట్రల్ ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, ఆయుధ కర్మాగారం, క్షిపణి నిల్వల కేంద్రాలను నేలమట్టం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. మధ్యాహ్నం ఇస్ఫహాన్‌లోని విమానాశ్రయంలో ఉన్న సైనిక సదుపాయాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిన ఐడీఎఫ్.. సాయంత్రం బుషెహర్‌లోని ఎయిర్‌పోర్టుపై దాడులు జరిపింది. బుషెహర్ అణు కేంద్రానికి అత్యంత సమీపంలో ఈ విమానాశ్రయం ఉంది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 23 , 2025 | 05:19 AM