UP Cop: వినికిడి లోపం ఉన్న వృద్ధుడిపై చేయి చేసుకున్న పోలీసు అధికారి
ABN, Publish Date - Jun 29 , 2025 | 08:51 AM
తనకు సరిగా సమాధానం ఇవ్వలేదంటూ ఓ పోలీసు వృద్ధుడిపై చేయి చేసుకున్న ఘటన యూపీలోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. చర్చల ద్వారా ఈ వివాదానికి పరస్పర ఆమోదయోగ్యమైన ముగింపు లభించిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన ప్రశ్నలకు సరిగా స్పందించలేదన్న కోపంలో ఓ వృద్ధుడిపై స్థానిక పోలీసు అధికారి చేయి చేసుకున్నారు. కాన్పూర్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం కలకలానికి దారి తీసింది. అక్కడి డీజే ఆపరేటర్ల తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా ఉన్న డీజే ఆపరేటర్ల తనిఖీ కోసం పలువురు పోలీసులు అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ వారికి మూసి ఉన్న డీజే షాపు ఒకటి కనిపించింది. షాపు ముందు ఓ వృద్ధుడు కూర్చుని కనిపించారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన ఓ పోలీసు షాపు వివరాల గురించి వృద్ధుడిని ప్రశ్నించారు. వృద్ధుడికి వినికిడి లోపం కూడా ఉండటంతో మొదటిసారి సరిగా స్పందించలేదు. రెండో సారి పోలీసు అడిగిన ప్రశ్నకు అసంకల్పితంగా పెద్ద గొంతుతో సమాధానమిచ్చాడు. దీంతో, కోపోద్రిక్తుడైన అధికారి వృద్ధుడి చెంప ఛెళ్లుమనిపించారు. ఆపై చేయి చేసుకున్నారు.
‘నాకు వినికిడి సమస్య ఉంది. అయితే, ఆఫీసర్ వచ్చి నన్ను ఆ షాపు ఎవరిదని అడిగారు. నేను సమాధానం చెప్పాను. ఆయన మళ్లీ అడిగారు. ఈసారి కాస్త పెద్ద గొంతుతో మాట్లాడాను. గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఆయన నాపై చేయి చేసుకున్నారు’ అని బాధితుడు పేర్కొన్నారు.
ఈ ఘటనపై యూపీ పోలీసు శాఖ స్పందించింది. ‘ఈ విషయంపై దర్యాప్తును ఏసీపీ పర్యవేక్షిస్తున్నారు. డీజే షాపు గురించి ఔట్‌పోస్టు ఇన్‌చార్జ్ ప్రశ్నిస్తున్న సమయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సీనియర్ ఆఫీసర్‌ల సమక్షంలో ఈ వివాదానికి చర్చల ద్వారా ఫుల్ స్టాప్ పడింది. పరిష్కారం ఇరు వర్గాలకు సంతృప్తినిచ్చింది’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇక స్థానికంగా ఈ ఉదంతం పెను కలకలానికి దారి తీసింది.
ఇవీ చదవండి:
విమాన ప్రమాదం తరువాత పార్టీ.. ఎయిర్ ఇండియా-ఎస్ఏటీఎస్ సీనియర్ ఉద్యోగులకు ఉద్వాసన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 09:13 AM