Uttar Pradesh: సీఎం యోగికి ప్రశంసలు.. మహిళా ఎమ్మెల్యేపై సమాజ్ వాదీ వేటు
ABN, Publish Date - Aug 15 , 2025 | 05:25 AM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీలో ప్రశంసించిన గంటల వ్యవధిలోనే తమ ఎమ్మెల్యే పూజాపాల్‌పై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వేటు వేసింది.
లఖ్‌నవూ, ఆగస్టు 14: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీలో ప్రశంసించిన గంటల వ్యవధిలోనే తమ ఎమ్మెల్యే పూజాపాల్‌పై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. గురువారం యూపీ అసెంబ్లీలో ‘విజన్ 2047’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎవరూ గమనించని తన మౌన రోదనను సీఎం యోగి గుర్తించారన్నారు. తన దుఃఖం, బాధను గమనించి, న్యాయం చేశారని వ్యాఖ్యానించారు. పూజాపాల్‌కు 2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌తో వివాహం జరిగింది. వివాహం జరిగిన 10 రోజుల్లోనే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ప్రయాగ్‌రాజ్‌లో మాఫియా నేత, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ అనుచరులు ఈ హత్యకు బాధ్యులుగా పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి న్యాయం కోసం పూజాపాల్ పోరాటం చేశారు.
అయితే.. వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలిన అతిక్, అష్ర్‌ఫలను 2023 ఏప్రిల్‌లో జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు. యోగి ద్వారా తనకు న్యాయం జరిగిందంటూ పూజ అసెంబ్లీలో చెప్పడం.. ఆదిత్యనాథ్‌ను పొగడ్తలతో ముంచెత్తడం సమాజ్ వాదీ పార్టీకి నచ్చలేదు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. ఈ నిర్ణయంపై అధికారపక్షం తీవ్రంగా స్పందించింది. స్వాతంత్య్రదినోత్సవానికి ఒక్కరోజు ముందు.. అభివృద్ధి దృక్పథాన్ని అసెంబ్లీలో సమర్థించినందుకు పూజను బహిష్కరించడం సమాజ్‌వాదీ పేలవ మనస్తత్వానికి(ఘటియా సోచ్) నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీది ‘మహిళా విరోధ విధానం’ అని ఎద్దేవా చేశారు.
Updated Date - Aug 15 , 2025 | 05:26 AM