Weather: ముందే ముగిసిన వేసవి
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:48 AM
2025 మే నెలలో సాధారణ వేడి కాకుండా అనూహ్యంగా చల్లటి వాతావరణం ఏర్పడింది. రుతుపవనాల ముందస్తు రాక, మేఘావృత వాతావరణం, వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి, వ్యవసాయంపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అంచనాల కంటే ముందే విచ్చేసిన నైరుతి
అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం
న్యూఢిల్లీ, జూన్ 2: మే నెల మొదలైందంటే చాలు.. ఎండలు మండిపోతాయి. విపరీతమైన ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 2024లోనూ భారత్‌లో ఎండలు ఠారెత్తించాయి. కాబట్టి.. ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు మండిపోతాయని అందరూ బావించారు. కానీ, దానికి భిన్నంగా ఈసారి వేసవి ఆరంభానికి ముందే చాలా ప్రాంతాలు అనూహ్యంగా చల్లబడ్డాయి. నైరుతి రుతుపవనాలు ముందే రావడం, అకాల వర్షాలు కురవడం, మేఘావృతంగా ఉండడంతో మే నెలలో ఎక్కువగా చల్లని వాతావరణం నెలకొంది. రికార్డులు నమోదుచేయడం ప్రారంభించినప్పటి నుంచి 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలవగా.. 2025లో మాత్రం ఎండలు ఎక్కువయ్యే సమయానికంటే ముందే వేసవి ముగిసింది. గతేడాది మే, జూన్ నెలల్లో అనేక ప్రాంతాల్లో వేడి గాలులు, ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కరువు పరిస్థితులు తీవ్రమయ్యాయి. కానీ.. ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. దేశ వాతావరణ నమూనాల్లో ఇదొక పెద్ద మార్పును సూచిస్తోంది.
తేమ గాలులు.. మారిన నమూనాలు..
అయితే ఈ క్రమరాహిత్యానికి అనేక అంశాలు దోహదపడి ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముందస్తు తేమ గాలుల ప్రభావం, మారిన గాలి నమూనాలతో పాటు రుతుపవనాల రాకలో మార్పులు ఉష్ణోగ్రతల పెరుగుదలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం, అప్పుడప్పుడూ కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. వాతావరణం చల్లబడడం వల్ల తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం దక్కింది. అలాగే విద్యుత్ డిమాండ్ కూడా తగ్గింది. వేసవి ముందే ముగియడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా వ్యవసాయ చక్రం దెబ్బతింటుంది. అధిక ఉష్ణోగ్రతలు అవసరమైన కొన్ని పంటల పెరుగుదలపై ఇది ప్రభావం చూపుతుంది. రైతులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించి విత్తనాలు, కోత సమయాలను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ.. భారత వాతావరణానికి సంబంధించి సంక్లిష్టమై, మారుతున్న స్వభావాన్ని ఇది సూచిస్తోందని నిపుణులు అంటున్నారు.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 03 , 2025 | 04:48 AM